Home Unknown facts పేదల తిరుపతి మన్యంకొండ శ్రీలక్ష్మీవేంకటేశ్వరస్వామి దేవాలయం…!

పేదల తిరుపతి మన్యంకొండ శ్రీలక్ష్మీవేంకటేశ్వరస్వామి దేవాలయం…!

0

బంగారు ఆనంద నిలయంలో కొలువైన శ్రీవేంకటేశ్వరుడు అలంకార ప్రియుడు, ఉత్సవ ప్రియుడు, పుష్పాలంకరణ ప్రియుడు, భక్త ప్రియుడు మాత్రమే కాదు. అంతకంటే మిక్కిలి ఆహార ప్రియుడు కలియుగ వరదుడు. వక్షస్థలంలో లక్ష్మి నివాసితుడైన శ్రీశ్రీనివాసుడికి నిత్య సేవలు జరుగుతాయి. కలి పాపాల నుంచి ప్రజలను కాపాడటం కోసం సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి కలియుగ దైవంగా ఏడుకొండలపై వెలిసినట్లు మనకు పురాణాలు తెలియజేస్తున్నాయి.

manyamkonda sri lakshmi venkateshwaraపరమ పవిత్రమైన తిరుమల తిరుపతిలో కొలువై ఉన్న వెంకటేశ్వర స్వామి దర్శనార్థం ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున స్వామి వారిని దర్శించుకుంటారు.
అయితే తిరుమలలో వెలసిన స్వామి వారు తన కొండకు చేరి దర్శించుకోలేని భక్తుల కోసం పలు ప్రాంతాలలో వెలిశాడని ఎన్నో కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి.

అలాంటి ప్రదేశాలలో ఎంతో ప్రసిద్ధి గాంచినది మన్యంకొండ. మహబూబ్‌నగర్ జిల్లాలోని మన్యంకొండలో శ్రీలక్ష్మీవేంకటేశ్వరస్వామి దేవస్థానంలో స్వామివారు గుట్టపై కొలువుదీరారు. ఈ మన్యంకొండను పేదల తిరుపతి, రెండవ తిరుపతి, తెలంగాణ తిరుపతి అని వివిధ రకాల పేర్లతో పిలుస్తుంటారు.

కొన్ని వందల సంవత్సరాల పాటు మునులు, సిద్ధులు ఈ కొండపై తపస్సు చేయటం వల్ల ఈ కొండను మునులకొండ అని కూడా పిలుస్తారు. ఆ తర్వాత ఈ కొండ చుట్టూ పెద్ద అరణ్యం ఏర్పడటం వల్ల దీనిని మన్యంకొండగా పిలుస్తున్నారు.

సుమారు ఆరు వందల సంవత్సరాల క్రితం తమిళనాడు శ్రీరంగం సమీపంలో గల అళహరి గ్రామ నివాసి అళహరి కేశవయ్య కలలో వేంకటేశ్వరుడు కనిపించి కృష్ణా నది తీరాన మన్యంకొండలో వెలుస్తానని అక్కడికి వెళ్లి నిత్య పూజలు చేయాలని చెప్పడంతో అళహరి కేశవయ్య తన తండ్రి అనంతయ్యతో పాటు కుటుంబసభ్యులతో నివాసం ఏర్పాటు చేసుకున్నాడు.

ఈ క్రమంలోనే కేశవయ్య ఒకరోజు కృష్ణా నది తీరంలో స్నానమాచరించి సూర్యభగవానునికి నమస్కరించి దోసిలిలో ఆర్గ్యం వదులుతుండగా, చెక్కని శిలారూపంలోగల వెంకటేశ్వర స్వామి విగ్రహం వచ్చి కేశవయ్య దోసిలిలో నిలిచింది.

ఆ విగ్రహాన్ని తీసుకొచ్చి, మన్యం కొండపై శేషసాయి రూపంలోగల గుహలో ప్రతిష్టించి అప్పటి నుంచి పెద్ద ఎత్తున పూజలు నిర్వహించడం ప్రారంభించారు.
స్వామివారిని భక్తిశ్రద్ధలతో పూజించే భక్తుల కోరికలను నెరవేర్చే దేవుడిగా ఎంతో ప్రసిద్ధి చెందారు.

Exit mobile version