ఒక్కోసారి తిన్న వెంటనే కడుపుబ్బరంగా అనిపించడం, ఛాతిలో మంటగా నొప్పిగా అనిపించడం జరుగుతుంటుంది. దీనికి కారణం గ్యాస్ ట్రబుల్. మనం తీసుకున్న ఆహారం అరగక పోవడం వలన, లేదా జీర్ణశక్తి సన్నగిల్లి విరేచనం సాఫీగా కాకపోవడం వలన గ్యాస్ ట్రబుల్ ఏర్పడుతుంది. ఆహారం తీసుకున్న కాసేపటికే ఆకలి వేయడం, కొంచెం తినగానే కడుపు నిండినట్లుండటం, ఛాతిలో నొప్పిగా అనిపించడం, గొంతులో మంటగా ఉండి, పుల్లటి తేన్పులు రావడం.. ఇవన్నీ గ్యాస్ వల్ల కలిగే ఆరోగ్య సమస్యలే.
దీనివలన పొట్ట అంతా ఉబ్బరంగానూ, గట్టిగా బిగదీసుకుపోయినట్లు వుంటుంది. ఎక్కిళ్ళు ఎక్కువగా వస్తాయి. గుండె బలహీనమై గుండెజబ్బులు కూడా వచ్చే అవకాశముంది. అయితే ఇలాంటివి తాత్కాలికంగా ఇబ్బంది పెట్టినా ఆ లక్షణాలు కాసేపటికే మాయమౌతాయి. దీంతో ఇది ‘చిన్న సమస్యే’ అని చాలామంది పట్టించుకోవడం మానేస్తారు. ఈ నిర్లక్ష్యం అలా అల్సర్లు, జీర్ణకోశ వ్యాధులకు దారితీస్తుంది. అందుకే తొలిదశలోనే గ్యాస్ ట్రబుల్‌కు చెక్ చెప్పాలి.
పొట్టలో గ్యాస్ సమస్యలు ఎందుకొస్తాయి?
నమలడం అనే ప్రక్రియ వలన మన శరీరంలోకి గ్యాస్ చేరుతూ ఉంటుంది. కార్బొనేటెడ్ పానీయాల వలన కూడా గ్యాస్ పెరుగుతుంది. చిన్న ప్రేగులలో బ్యాక్టీరియా కావలసినదానికన్నా ఎక్కువ పెరగడం కూడా దీనికి కారణం కావచ్చు. టైప్-2 డయాబెటిస్, సెలియాక్ లేదా కాలేయానికి సంబంధించిన వ్యాధుల వలన ఈ బ్యాక్టీరియా పెరుగుతుంది.
పూర్తిగా జీర్ణం కాని కార్బోహైడ్రేట్స్ వలన ఈ గ్యాస్ తయారవుతుంది. చిన్న ప్రేగుల్లోకి చేరిన ఆహారం మొత్తం జీర్ణం కాకపోవచ్చు. ఇక్కడ జీర్ణం కాని కార్బోహైడ్రేడ్స్ మలద్వారం లేదా కొలోన్‌కు చేరుతుంది. అక్కడ బ్యాక్టీరియా దీన్ని హైడ్రోజన్, కార్బన్ డైఆక్సైడ్‌గా మారుస్తుంది.
ఇది సాధారణంగా ఆహారపదార్థాలలో తేడా వలన, వేళకు సక్రమంగా ఆహారం తీసుకోకపోవడం వలన, కాఫీ-టీలు ఎక్కువగా త్రాగడం వలన, సిగరెట్లు ఎక్కువ కాల్చడం వలన కూడా ఏర్పడుతుంది. తీసుకునే ఆహారంలో పాలు, జున్ను, ఐస్ క్రీం, గోధుమ, ఓట్స్, క్యాబేజీ, కాలీఫ్లవర్, తీసుకోవడం వలన గ్యాస్ ఎక్కువవుతుంది.
మన డైట్ లో దుంపపదార్థాలు ఎక్కువైనా, నూనెల వాడకం ఎక్కువైనా కూడా శరీరంలో గ్యాస్ ఏర్పడుతుంది. నిద్రలేకపోవడం వలన, త్రాగుడు, ఎక్కువ వేడిచేసే పదార్థాలు తీసుకోవడం వలన కూడా గ్యాస్ ట్రబుల్ వస్తుంది. అయితే ఇది అంత పెద్ద సమస్యేమీ కాదు, మనం అనుకుంటే దీనిని సులువుగా నివారించుకోవచ్చు.
సరైన సమయాలలో క్రమబద్దంగా భోజనం చేయాలి. దుంపకూరలు, వేడిచేసే ఆహారపదార్థాలను కొంచెం మాత్రమే తీసుకోవాలి. ఆహారంలో నూనె వాడకం తక్కువగా వుండాలి. సులువుగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవాలి.మసాలాలు, వేపుళ్లు, ఆయిల్‌ఫుడ్స్, ఫాస్ట్‌ఫుడ్ వంటివాటిని తినకూడదు. నిల్వ ఉంచిన పచ్చళ్లు తినకూడదు. మానసిక ఒత్తిడిని నివారించడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. తేలికగా జీర్ణమయ్యే పీచు పదార్థాలున్న తాజా కాయగూరలు ఎక్కువగా తీసుకోవాలి.
కడుపునిండా ఒకేసారి ఆహారం తీసుకోకుండా.. కొద్దిపాటి మార్పులు చేసుకుంటే మంచిది. ఆహారాన్ని చిన్న చిన్న ముద్దలుగా చేసుకుని, బాగా నమిలి మింగడం వల్ల ఈ ఇబ్బందిని అధిగమించొచ్చు. బాగా నమిలి తినాలి. మెల్లగా తినాలి. తొందర తొందరగా తింటే శరీరంలోకి ఎక్కువ గాలి జొరబడే అవకాశాలున్నాయి. వ్యాయామం చెయ్యడం కూడా చాలా అవసరం. రాత్రిపూట భోంచేసిన తరువాత ఒక గ్లాసు గోరువెచ్చని నీరు త్రాగాలి.
చూయింగ్‌గమ్ లేదా బబుల్‌గమ్ ఎక్కువగా నమలడం వలన కూడా శరీరలోకి ఎక్కువ గాలి వెళుతుంటుంది. ఇది గ్యాస్ తయారవడానికి కారణమవుతుంది. కాఫీ, టీ, సిగరెట్లు, మత్తుపానీయాలు మానేయాలి. నిలవ వుండే ఆహారాన్ని తీసుకోకూడదు. ఎక్కువ సిగరెట్ తాగడం కూడా గ్యాస్ పెరగడానికి ఒక కారణం. ఈ అలవాటు ఉన్నవారికి మలబద్దకం ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల గ్యాస్ పెరిగే అవకాశాలుంటాయి.
భోజనం అయిన వెంటనే పడుకోకుండా కొంత సేపు నడవాలి. మిఠాయి కిళ్ళీ వేసుకోవడం మంచిది. మనం తినే పదార్థాలన్నీ జీర్ణం అవడానికి కొన్ని బ్యాక్టీరియాలు సహకరిస్తాయి. వీటిల్లో కొన్ని హైడ్రోజన్‌ను తొలగించడానికి ఉపయోగపడతాయి. ప్రోబయోటిక్ ఫుడ్ తినడం వలన ఇలాంటి బ్యాక్టీరియా పెరుగుతుంది.
ఫ్రక్టోజ్, లాక్టోజ్, ఇన్‌సాల్యుబుల్ ఫైబర్, పిండిపదార్థాలు లాంటి కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉన్న పదార్థాలు తగ్గించడం మంచిది. వీటివల్ల గ్యాస్ ఎక్కువగా తయారయ్యే అవకాశం ఉంది. సోడా, బీర్ లాంటి కార్బొనేటెడ్ పానీయాలలోని గాలి బుడగలు శరీరంలో చేరుతాయి. వాటికి బదులు మంచినీళ్ళు, వైన్ తాగడం మంచిది.
ఈ చిట్కాలు పాటించినా
కడుపు నొప్పి
తల తిరగడం
వాంతులు
డయేరియా వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్ దగ్గరకు వెళ్ళడం మంచిది.