శాంతికి ప్రతిరూపం సాయిబాబా. సాయిబాబా హిందువుల మరియు ముస్లింల ప్రముఖ ఆరాధ్యదైవంగా కీర్తింపబడుతున్నారు. అతన్ని దేవుని ప్రతిరూపంగా నమ్ముతారు. సాయిబాబా యొక్క భోధనలు హిందూ, ముస్లింల అంశాలు రెండింటినీ కలపడం ద్వారా అత్యధిక ప్రాచుర్యాన్ని సంతరించుకున్నాయి. సాయిబాబా ప్రేమ, సహనం, శాంతి మరియు వివేచనా సంకేతాలను భోధించారు. సబ్ కా మాలిక్ ఏక్ హై అన్నది సాయిబాబా నిర్వచనం, అనగా దేవుళ్ళందరూ ఒక్కటే అని.
సాయిబాబా ఎప్పుడూ ఉపవాసం వుండలేదు. అదేవిధంగా ఇతరును ఎవ్వరినీ ఉపవాసం వుండనిచ్చేవాడు కాదు. ఉపవాస వ్రతంలో వుండేవారి మనసు ఎప్పుడూ ప్రశాంతంగా వుండదు. అలాంటప్పుడు ఉపవాసంతో పరమార్థాన్ని ఎలా పొందగలం అనేది ప్రశ్న. ఖాళీ కడుపుతో భగవంతుని సాక్షాత్కారం లభించదు. మొదట స్థూలదేహ ఆకలిని తీర్చి జీవాత్మను తృప్తి పరచాలని సాయి చెప్పేవారు. అయినా సరే కొంతమంది భక్తులు తమ భక్తుని చాటుకునేందుకు ఉపవాసం చేస్తారు. వారి కోసం తొమ్మిది గురువారాలు వ్రతం గురించి తెలుసుకుందాం.
తొమ్మిది వరుస గురువారాలలో చేసే ఉపవాసాల ద్వారా సాయి కృపాకటాక్షాలు సిద్ధిస్తాయని ప్రజల ప్రఘాడ విశ్వాసం. ఇలా చేసే ఉపవాసాల ద్వారా సాయి కరుణ పొందడం ద్వారా కోరికలు నేరవేరడంతో పాటు ఆశించిన అన్నీ రంగాలలో విజయం సిద్దిస్తుంది అని భక్తుల నమ్మకం. సాయిబాబా భక్తులు ఇలా ప్రతి గురువారం ఉపవాసం చెయ్యటం కాని, ఆరోజు ప్రత్యేకంగా సాయి మందిరానికి కాని వెళ్లి భజనల్లో పాలుపంచుకోవడం మూలంగా వ్రత లాభం పొందుతారు. భక్తులకి కఠోరమైన తపస్సు అవసరం లేదు, ఒక్క గురువార ఉపవాస దీక్ష చాలు సాయి కృపకు పాత్రులవడానికి.
ఈ వ్రతాన్ని కులమతాలకు అతీతంగా ఎవరైనా చెయ్యవచ్చు.
ఈ వ్రతం గురువారం మాత్రమే చెయ్యవలసి ఉంటుంది.
తర్వాత కనీసం 9 గురువారాలు ఈ ఉపవాస దీక్ష చెయ్యవలసి ఉంటుంది.
ఉపవాసం సమయంలో ఖాళీ కడుపుతో ఉండవలసిన అవసరం లేదు. దీక్షా సమయంలో పాలు, పండు, పళ్ళ రసాలను తీసుకొనవచ్చు మరియు రోజుకు ఒకపూట మాత్రమే ఆహారాన్ని స్వీకరించవలసి ఉంటుంది.
వీలైతే, మీరు ప్రతి గురువారం సాయిబాబా ఆలయాన్ని సందర్శించాలి. ఇంటిలో, మీరు ఉదయం మరియు సాయంత్రం కూడా ప్రార్ధించవలసి ఉంటుంది. ప్రార్ధన చెయ్యడానికి ముందుగా ఒక చెక్క బోర్డు ని శుభ్రమైన స్థలంలో ఉంచి, దానిని ఒక పసుపు వస్త్రముతో కప్పి సాయి బాబా విగ్రహాన్ని ఉంచవలసి ఉంటుంది. విగ్రహం,లేదా పటం యొక్క నుదుటి పై కుంకుమని ఉంచండి. దేవునికి పూలదండలతో అలంకరించి, ఏవైనా పండ్లను లేదా పాలను నైవేద్యంగా పెట్టండి. సాయిబాబా భోధనల పుస్తకాన్ని లేదా చాలీసా లేదా గురుచరిత్రని చదవడం పూర్తి చేశాక , నైవేద్యాన్ని నలుగురికీ పంచండి. తొమ్మిదవ గురువారం, 5 పేద ప్రజలకు ఆహారం ఇవ్వడం తప్పనిసరి.
ఋతు చక్రం వల్ల ఒక మహిళ గురువారం వ్రతాన్ని కోల్పోయి ఉంటే, ఆ గురువారం దాటవేసి, మరుసటి గురువారం నుండి కొనసాగించవచ్చు. ఈ సులభమైన దశలను అనుసరించడం ద్వారా మీరు సాయి బాబా యొక్క ఆశీస్సులను పొంది, అపజయం లేనివారై అన్నిటా కార్యసిద్ది లభిస్తుంది.