తిరుమల తిరుపతి దేవస్థానం గురించి అందరికీ తెలిసిందే. దేశంలోనే అత్యంత సంపద కలిగిన ఆలయంగా ప్రసిద్ధిగాంచిన తిరుమలలో ఎన్నో ఆసక్తికర రహస్యాలు దాగి ఉన్నాయి. అవేంటో తెలిస్తే తప్పకుండా ఆశ్చర్యచకితలవుతారు. మళ్లీమళ్లీ తిరుమల దర్శనానికి మొగ్గు చూపుతారు. రోజూ లక్ష నుంచి రెండు లక్షలకు పైగా భక్తులకు దర్శనమిచ్చే వేంకటేశ్వర స్వామి సంపదను తూచడం అంత సులభం కాదు. దాదాపు 11 టన్నులకు పైగా ఆభరణాలు స్వామివారికి ఉన్నట్లు చెబుతుంటారు.
వెంకటేశ్వర స్వామి కలియుగ ప్రత్యక్ష దైవం. భక్తుల కష్టాలను పోగొట్టడంలో మరియు వెంకటేశ్వర నామాలకు ఈయన సుప్రసిద్ధుడు. ఆంధ్ర ప్రదేశ్ లో వెంకటేశ్వర స్వామి ఆలయాలు ఎన్నో ఉన్నప్పటికీ తిరుపతి లో కొలువైన వేంకటాచలపతి ఆలయం ఖ్యాతి గాంచింది. దేశంలోనే కాదు ప్రపంచం మొత్తం మీద భక్తులు శ్రీనివాసుని దర్శనానికి క్యూ కడతారు.
తిరుమల క్షేత్రంలో అడుగుపెట్టడానికి అతి పవిత్రమైన ఏడుకొండలను అధిరోహించడానికి … శ్రీవారిని దర్శించడానికి వేయి జన్మల పుణ్యం వెంటరావాలి. వైకుంఠం నుంచి దిగివచ్చి తనని దర్శించుకోమంటూ నిశ్చలంగా నిలిచిన స్వామిని మనసుతో అభిషేకించాలి చూపులతో సేవించాలి. ఆ దివ్య మంగళ రూపాన్ని హృదయంలో బంధించడం కోసమే ఎంతో దూరాల నుంచి భక్తులు తరలి వస్తుంటారు. వారందరి ఆనందం కోసం స్వామి సర్వాలంకార భూషితుడై ముచ్చట తీరుస్తూ వుంటాడు.
నిత్యం లక్షలాదిమంది భక్తిప్రపత్తులతో దర్శించుకునే మూలవిరాట్టును ధ్రువబేరం అంటారు. ధ్రువ అంటే స్థిరంగా ఉండేది అని అర్ధం. ధృవబేరం అంటే నేలలో స్తంభం పాతుకున్నట్లు స్థిరంగా ఉండే విగ్రహమూర్తి. మూలవిరాట్టు అయిన ధ్రువబేరానికి తెల్లవారుజామున సుప్రభాతసేవ మొదలు, అర్ధరాత్రి ఏకాంతసేవ వరకూ రోజంతా ఆరాధనలు జరుగుతాయి. ఈ మూలవిరాట్టు సాలగ్రామమూర్తి. మూలమూర్తి శిరస్సు నుండి పాదం వరకూ ఎనిమిది అడుగుల ఎత్తులో ఉంటుంది. ”వీరస్థానక” పద్ధతిలో నిలబడి ఉన్న మూలవిరాట్టు పక్కన శ్రీదేవి, భూదేవి విగ్రహాలు ఉండవు. నిత్యం లక్షలాదిమంది భక్తులు తిరుమలేశుని దివ్య మంగళ దర్శనం కోసం ఎదురుచూస్తారు కాబట్టి ఈ మూలవిరాట్టును (ధృవబేరం) దర్శించుకోడానికి రెండు క్షణాల కంటే సమయాన్ని కేటాయించలేరు.
అయితే ఎలాంటి ఆభరణాలు లేనప్పుడు స్వామి దర్శనం చేసుకోవాలనే ఆసక్తి చాలామందికి వుంటుంది. అలాంటి వాళ్లందరూ ఆయనని గురువారం రోజున దర్శించడానికి వెళతారు. ఎందుకంటే గురువారం రోజున ‘నేత్ర దర్శనం’ వుంటుంది. ఈ రోజున వేకువ జాములో రెండవ అర్చన ముగిసిన తరువాత, స్వామివారు ఎలాంటి అలంకారాలు లేకుండా ఎంతో నిరాడంబరంగా కనిపిస్తుంటాడు.అప్పటి వరకూ వెడల్పుగా స్వామివారి నయనాలను సగభాగం వరకూ కప్పుతూ ఉంచిన పచ్చ కర్పూరపు నామాన్ని ఈ రోజున సన్నగా చేస్తారు. దాంతో స్వామివారి విశాల నేత్రాలు పూర్తిగా కనిపిస్తూ వుంటాయి. పూర్తి నేత్రాలను దర్శించే రోజు కాబట్టి , దీనికి నేత్ర దర్శనం అనే పేరు వచ్చింది. ఇక ఈ రోజున స్వామివారు పట్టు తలపాగాను పట్టు ధోవతిని ధరించి దర్శనమిస్తాడు.
నిగనిగలాడే నల్లని దేహంతో నిరాడంబరంగా దర్శనమిచ్చే స్వామిని గోపాలకుడి అవతారంగా భక్తులు భావిస్తుంటారు కాబట్టి దీనిని ‘నిజరూప దర్శనం’ అని కూడా అంటారు. ఇక ఈ నేత్ర దర్శనం రోజున స్వామివారి దృష్టి మరింత సూక్ష్మంగా తీక్షణంగా ఉంటుందట. ఈ రోజున దైవ సంబంధమైన విషయాల్లో ఎలాంటి పొరపాట్లు అపచారాలు జరిగినా ఫలితం వెంటనే కనిపిస్తుందని చెబుతారు. అందువలన స్వామివారి సేవల విషయంలో గానీ, ఆయన భక్తుల మనసుకి కష్టం కలిగించే చర్యలు గాని జరగకుండా ఇక్కడ తగిన జాగ్రత్తలు తీసుకుంటూ వుంటారు.