ఈ ఆలయంలో అమ్మవారు దశహస్తాలతో భక్తులకు దర్శనం ఇస్తుంది. ఈ ఆలయాన్ని సందర్శిస్తే గ్రహ దోషాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. మరి ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఈ ఆలయంలోని మరిన్ని విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కృష్ణాజిల్లా, విజయవాడ నగరంలో అయోధ్యనగర్ ప్రాంతంలో శ్రీ శివకామేశ్వరి సహిత నీలకంటేశ్వరస్వామి వారి ఆలయం ఉంది. ఈ ఆలయ నిర్మాణం మూడు అంతస్థులతో కూడి ఉంటుంది. ఈ ఆలయం ముందు భాగంలో దత్తాత్రేయుని విరాట్ స్వరూపం కనిపిస్తుంది. ఈ ఆలయంలోకి ప్రవేశించగానే ఒక ఎత్తైన వేదికపైన దశహస్తాలతో శ్రీ మహిషాసుర మర్ధిని అమ్మవారు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటుంది. మరోవైపు ధ్యానముద్రలో పరమేశ్వరుడు దర్శనమిస్తాడు.
ఇక గర్భాలయానికి ముందు ధ్వజస్థంభం, గర్భాలయంలో స్వామివారు నీలకంటేశ్వరునిగా భక్తులకు దర్శనం ఇస్తాడు. ఈ స్వామివారికి ఎడమవైపున ప్రత్యేకమైన ఆలయంలో శివకామేశ్వరి దేవి కొలువుదీరి ఉంది. ఈ అమ్మవారు నాలుగు హస్తాలతో, పై హస్తాలతో పాశాంకుశాలను, క్రింది హస్తాలలో అభయ, వరద ముద్రలను కలిగి ఉంది. అమ్మవారి ముందు ఉన్న శ్రీచక్రానికి, అమ్మవారికి నిత్యం కుంకుమ పూజ చేస్తారు. అంతేకాకుండా ప్రతి శుక్రవారం పర్వదినాలలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. దేవినవరాత్రుల సందర్బంగా దశవిధ అలంకారాలతో అమ్మవారిని అలంకరిస్తారు.
ఈ ఆలయ ప్రాంగణంలోనే శ్రీ వేంకటేశ్వరుడు శ్రీదేవి, భూదేవి లతో కొలువుతీరి ఉన్నాడు. ఇంకా రాథాకృతి మండపాలలో గణపతి, ఆంజనేయుడు, సుబ్రమణ్యస్వామి, దత్తాత్రేయ స్వామి వార్లు ఉన్నారు. ఈ ఆలయ ప్రాంగణంలోని రెండవ అంతస్థులో శ్రీ షిరిడి సాయిబాబా మందిరం ఉన్నది. మూడవ అంతస్థులో నిత్యజీవితంలో తారసపడే ద్వాదశరాశులు కొలువై ఉన్నాయి.
ఈ ఆలయంలో ప్రతి మాసశివరాత్రికి, కార్తీకమాసంలో, ప్రతి సోమవారం నీలకంటేశ్వరస్వామి వారికీ విశేష అభిషేకం జరుగుతుంది. అన్నం, పెరుగు, శుద్ధోదకం, నెయ్యి, విభూతి, గంధం మొదలైన వాటితో ఈ అభిషేకం జరుగుతుంది. అభిషేకం తరువాత స్వామివారిని అతి సుందరంగా అలంకరిస్తారు.
అయితే ఈ ఆలయంలోని మూడో అంతస్థులో ఉన్న ద్వాదశరాశులు క్రింద ఉన్న దైవాన్ని పూజిస్తే గ్రహదోషాల నుండి విముక్తి పొందుతారని భక్తుల విశ్వాసం.