శ్రీమహావిష్ణువు మానవ అవతారంలో అవతరించినదే శ్రీరామావతారం. అయితే లోకకల్యాణం కోసం శ్రీ మహావిష్ణువు సిరా రాముడిగా అవతరించాడు. శ్రీమహావిష్ణవు అవతారాల్లో రామావతారం ఏడవదిగా చెబుతారు. అయితే శ్రీరాముడు జన్మించిన పుణ్యస్థలం అయోధ్య. మరి శ్రీరాముడు జన్మించిన అయోధ్య గురించి అక్కడ ఉన్న రాముడు ఎలా జన్మించాడనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఫైజాబాదు జిల్లాకి 6 కి.మీ. దూరంలో సరయు నది తీరంలో అయోధ్య అనే పుణ్యక్షేత్రం ఉంది. ఈ ప్రదేశం 108 దివ్యతిరుపతిలలో ఒకటిగా, శ్రీరాముడు జన్మించిన పుణ్యభూమిగా, మోక్షదాయకమైన సప్తపురములలో అయోధ్యాపురం ఒకటిగా ప్రసిద్ధి చెందింది. పూర్వం దశరథమహారాజు సంతానం కోసం ఇక్కడ పుత్రకామేష్టియాగం చేసాడు. ఆ యజ్ఞ ఫలితంగా శ్రీరామచంద్రుడు దశరథమహారాజుకి కుమారునిగా ఈ అయోధ్యలో జన్మించాడు. ఈవిధంగా ఈ అయోధ్య నగరం రాముని జన్మభూమిగా ప్రసిద్ధిగాంచింది. ఆనాటి జ్ఞాపకాలుగా ఇక్కడ అనేక ప్రదేశాలు దర్శన మిస్తుంటాయి. సీతారాముల ఆలయం, లక్ష్మణుడి మందిరం, హనుమాన్ మందిరం, కుశుడు నిర్మించిన ఆలయం, సీతాదేవికి కైకేయి కానుకగా ఇచ్చిన భవనం, వాల్మీకి మందిరం, బాలరాముడి మందిరం, సీతాదేవి పూజించిన దేవకాళీ మందిరం ఇక్కడ కొలువుదీరి కనిపిస్తాయి. శ్రీరాముని తాతలలో ఒకరైన అయుధ అయోధ్య క్షేత్రాన్ని పాలించాడు. ఆ కారణంగా ఆయన తదనంతర కాలంలో ఈ క్షేత్రానికి అయోధ్య అనే పేరు వచ్చినట్లు చెబుతారు. యుధ్ అంటే సంస్కృతంలో యుద్ధమని, నాశనమని అర్థం. అ యుధ్ అంటే నాశనం కానిదని అర్థంగా చెబుతారు. అయోధ్యలో కాలుమోపిన భక్తులంతా ముందుగా ఇక్కడ సరయూ నదిలో స్నానాదికాలు చేయడం సంప్రదాయం. సరయూ నది ఒడ్డునే లక్ష్మణ మందిరం ఉంది. ఇక్కడ లక్ష్మణుడు కొలువుదీరాడు. దీనికి సమీపంలోనే నాగేశ్వరనాథ్ మందిరం ఉంది. శ్రీరాముని కుమారుడు కుశుడు నిర్మించిన ఆలయంగా ఇది ఖ్యాతికెక్కింది. మిగిలిన ఆలయాలన్నీ ముస్లింల దాడులకు అంతరించి పోయాయి.ఇది ఇలా ఉండగా, మొట్టమొదటగా ఈ పుణ్యభూమిలో విక్రమాదిత్యుడు స్పటిక శిలలతో దివమందిరాన్ని నిర్మించాడు. అయితే క్రీ.శ. 1526 లో బాబరు ఈ ఆలయాన్ని పడగొట్టించి ఆలయ స్థంబాలతోనే ఒక మసీదును నిర్మించాడు. ఈ వివాదం పై హిందూ ముస్లిం లా ఘర్షణల అనంతరం భారత రిపబ్లిక్ ఏర్పడిన తరువాత మసీదు ఉన్న ప్రాంతంలోనే ఒక రామమందిరం నిర్మించబడినది. ఇప్పటికి మిలటరీ వారి కాపాలలోనే శ్రీరాముని దర్శనం భక్తులకి లభిస్తుంది. శ్రీరాముడి జన్మస్థలం అత్యంత పుణ్యస్థలం అయినా అయోధ్యని జీవితంలో ఒకసారైనా వెళ్లి సీతారాముడిని దర్శించాలని ప్రతి రామభక్తుడు కోరుకుంటారు.