Home Unknown facts బ్రహ్మ ముహూర్తానికి ఉన్న ప్రాధాన్యత ఏంటో తెలుసా ?

బ్రహ్మ ముహూర్తానికి ఉన్న ప్రాధాన్యత ఏంటో తెలుసా ?

0

మనం ఏవైనా శుభకార్యాలు చేసినప్పుడు, పూజలు, వ్రతాలు చేసేటప్పుడు బ్రహ్మ ముహూర్తంలో చేయాలి అనే పదాన్ని వినే ఉంటాం. అసలు బ్రహ్మ ముహూర్తం అంటే ఏమిటి? చిన్నప్పటి నుంచి ఈ పదాన్ని ఎక్కువ సార్లు వింటూ ఉన్నా దీనికి సరైన అర్థం మాత్రం చాలామందికి తెలియదు. సూర్యోదయానికి 90 నిమిషముల ముందు కాలాన్ని బ్రహ్మ ముహూర్థం అంటారు. బ్రహ్మీ అంటే సరస్వతి. మనలోని బుద్ధి ప్రభోదము చెందే కాలం కాబట్టి బ్రహ్మీముహూర్తం అని అంటారు. బ్రహ్మముహుర్తాన్ని పూర్వ కాలంలో ఘడియలలో లెక్కించేవారు. ఒక ఘడియకు మన ప్రస్తుత కాలమాన ప్రకారంగా 24 నిమిషాలు.ఒక ముహూర్తం అనగా 2 ఘడియల కాలం అని అర్థం. అంటే 48 నిమిషాలను ఒక ముహూర్తం అంటారు. ఒక పగలు, ఒక రాత్రిని కలిపిన మొత్తాన్ని అహోరాత్రం అంటారు.

Significance of Brahma Muhurtamహిందూ ధర్మంలో అనేక పురాణాలు, శాస్త్రాల్లో ఈ బ్రహ్మ ముహూర్తం గురించి ప్రస్తావన ఉంది. ఇది చాలా ప్రత్యేకమైన, పవిత్రమైందిగా పేర్కొన్నాయి. ఈ సమయం వేకువ జామున 4 గంటల నుంచి 05.30 మధ్య ఉంటుంది. బ్రహ్మ ముహూర్తంలో నిద్రను త్యాగం చేస్తే సర్వోత్తమని మన ఋషులు, మహర్షులు చెప్పారు. ఈ సమయంలో నిద్రలేవడం వల్ల అందం, బలం, జ్ఞానం, తెలివితేటలతో పాటు ఆరోగ్యం ఉంటుందని తెలిపారు. సూర్యోదయానికి నాలుగు ఘడియలు ముందుండే బ్రహ్మ ముహూర్తంలో కొన్ని పనులు అస్సలు చేయకూడదని శాస్త్రాల్లో ప్రస్తావించారు.

మరి ఈ నేపథ్యంలో బ్రహ్మ ముహూర్తానికి ఉన్న ప్రత్యేకత ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.బ్రహ్మ ముహూర్తానికి సంబంధించి వాల్మికీ రామాయణంలో ఓ కథను చెప్పారు. దీని ప్రకారం ఆంజనేయుడు బ్రహ్మముహూర్తంలోనే సీతమ్మను చూసేందుకు అశోక వనానికి వెళ్లాడని తెలిపారు. దీని గురించి శాస్త్రాల్లోనూ ప్రస్తావించబడింది.

వర్ణా కీర్తి మతిం లక్ష్మీ స్వాస్త్యమాయుశ్ఛ విదంతి|

బ్రహ్మ ముహూర్తే సంజాగ్రచ్ఛివ పంకజ యథా||

దీనర్థం ఓ వ్యక్తి బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేవడం వల్ల అందం, తెలివితేటలు, ఆరోగ్యంతో పాటు లక్ష్మీ దేవి అనుగ్రహం పొంది సంపన్నలవుతారని తాత్పర్యం. అంతేకాకుండా శరీరం తామర పువ్వులాగా అందంగా మారుతుంది. బ్రహ్మ ముహూర్తానికి ప్రకృతితో లోతైన సంబంధముంది. ఈ సమయంలోనే జంతువులు, పక్షులు మేల్కొంటాయి. వాటి మధురమైన కిలకిల రావాలు ప్రారంభమవుతాయి. తామర పువ్వు కూడా ఈ సమయంలోనే వికసిస్తుంది. కోడి కూయడం ప్రారంభిస్తుంది. ఓ విధంగా చెప్పాలంటే ప్రకృతి కూడా బ్రహ్మ ముహూర్తంలోనే చైతన్య పరుస్తుంది. లేవడం, మేల్కొనడాన్ని సూచిస్తుంది. నిద్రను విడిచిన తర్వాత బ్రహ్మ ముహూర్తంలో లేచి రోజువారీ కార్యకలాపాల్లో పాల్గొనాలనే సందేశాన్ని ప్రకృతి మనకు ఇస్తుంది. వాస్తు ప్రకారం కూడా బ్రహ్మ ముహూర్తం పవిత్రంగా భావిస్తారు.

ప్రతిరోజూ బ్రహ్మ ముహూర్తంలో లేచిన వ్యక్తులు విజయం సాధించే అవకాశాలు ఎక్కువ. వాస్తు ప్రకారం ఈ సమయంలో వాతావరణంలో సానుకూల శక్తి నిండి ఉంటుంది. ఉదయం నిద్రలేచినప్పుడు ఈ శక్తి మనతో కలిసినప్పుడు మనలో మంచి ఆలోచనలు వస్తాయి. ఉత్సాహం నిండి ఉంటుంది. ఈ సానుకూల శక్తితో మనం ఏదైనా పని చేసినప్పుడు అందులో విజయం సాధించే అవకాశాలు పెరుగుతాయి. ఆయుర్వేదం ప్రకారం బ్రహ్మ ముహూర్తంలో నడవడం వల్ల శరీరంలో సంజీవనీ శక్తి ప్రసరిస్తుంది. ఈ సమయంలో ప్రవహించే గాలిని అమృత తుల్యంగా పరిగణిస్తారు. ఇది కాకుండా ఈ సమయంలో చదవడానికి కూడా ఉత్తతమమైందిగా చెబుతారు. ఎందుకంటే రాత్రి విశ్రాంతి తీసుకున్న తర్వాత మనం ఉదయం లేచినప్పుడు శరీరం, మెదడు ఎంతో శక్తిమంతంగా ఉంటాయి.

Exit mobile version