మన పూర్వికులు మనకు వరంగా ఇచ్చిన అలవాట్లు, పద్ధతులు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుస్తాయి. కానీ మనం వాటిని చాలా నిర్లక్ష్యం చేస్తున్నాం. దీంతో ప్రస్తుతం నేలపై కూర్చుని భోజనం చేసే వారి సంఖ్య బాగా తగ్గిపోయింది. ఇప్పుడు భోజనం చేయాలన్నా, టిఫిన్ చేయాలన్నా, ఏం తినాలన్నా, తాగాలన్నా.. అన్నింటికీ కుర్చీలు, టేబుల్స్‌నే ఆశ్రయిస్తున్నాం. ఆధునిక జీవన శైలికి అలవాటు పడి డైనింగ్ టేబుళ్ల మీదే తింటున్నాం. ఏ మాత్రం నడుము వంచకుండా అన్ని పనులు పూర్తి చేసుకుంటున్నాం.
కానీ… ఒకప్పుడు అంతా నేల మీదే తినేవారు.ఇప్పటికీ ఉమ్మడి కుటుంబంలోని వారంతా కలిసి తినాలనుకుంటే హాయిగా నేలమీదే కూర్చుంటారు. ఈ సంప్రదాయం ఏదో అలవోకగా వచ్చిందీ కాదు. ఒకప్పటి జనాలకి బల్లలు, కుర్చీలు అందుబాటులో లేకా కాదు. నేల మీద కూర్చుని తింటే ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో తెలుసు కాబట్టి అలా తినేవారు. కుర్చీల్లో కూర్చునేవారికి నడుం చుట్టూ రింగులాగా కొవ్వు పేరుకొని… ఆ తర్వాత పొట్ట పెరుగుతుంది. ఆ తర్వాత అధిక బరువు పెరుగుతారు. ఆ తర్వాత బీపీ, షుగర్, హార్ట్ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది.
ఇదంతా లేకుండా… నేలపై కూర్చుంటే పొట్ట వచ్చే అవకాశాలు తక్కువ అని నిపుణులు చెప్తున్నారు. నేలపై కూర్చుని భోజనం చేయడం వల్ల జీర్ణ వ్యవస్థకు సహకారం లభిస్తుంది. జీర్ణక్రియ మెరుగు పడుతుంది. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం అవుతుంది. భోజనం చేసేందుకు కూర్చునే స్థితిలోనే ఒక ఆసనం కనిపిస్తుంది. ఇలా నేల మీద కాళ్లు మడుచుకుని కూర్చునే భంగిమలు సుఖాసనంలో కానీ, అర్ధపద్మాసనంలో కానీ ఉంటాయి. జీర్ణ వ్యవస్థ చురుగ్గా పనిచేయటానికీ, వెన్ను నిటారుగా ఉండటానికీ, మానసిక ప్రశాంతతకూ ఈ ఆసనాలు చాలా ఉపయుక్తంగా ఉంటాయి.
కింద కూర్చుని తినే క్రమంలో ప్రతి ముద్దకీ… మనం ముందుకీ, వెనక్కీ వంగుతూ ఉంటాం. ఇలాంటి కదలికల వల్ల రెండు లాభాలు కలుగుతాయి. ఒకటి- ఈ కదలికల వల్ల జీర్ణరసాలు తగినంతగా ఊరుతాయి. రెండు- తగినంత ఆహారం తీసుకోగానే పొట్ట నిండుగా అనిపిస్తుంది. ఇంకా తినాలన్నా తినలేం. తినే ప్రతిసారీ నేల మీద కూర్చోవడం అన్నది మనం ఆహారం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నమన్న సూచనను మెదడుకి అందిస్తుంది. దానికి అనుగుణంగానే మన ఒంట్లోని లాలాజలం మొదల్కొని సకల జీర్ణ రసాలనూ మెదడు సిద్ధం చేస్తుంది.
నేలపై కూర్చుని భోజనం చేయడం బరువు తగ్గేందుకు సహాయ పడుతుంది. పొట్ట దగ్గరి కండరాలు ఉత్తేజితం అవుతాయి. దీంతో బరువు తగ్గడం సులభతరం అవుతుంది. నేలపై కూర్చుని భోజనం చేస్తే శరీరంలో రక్త సరఫరా మెరుగు పడుతుంది. ఒత్తిడి తగ్గుతుంది. బీపీ అదుపులో ఉంటుంది. నేలపై కూర్చుని తింటే శరీర భంగిమ సరిగ్గా మారుతుంది. వెన్నెముక సమస్యలు రావు. గ్యాస్ సమస్యలు కూడా దూరం అవుతాయి. అదే డైనింగ్ టేబుల్, కుర్చీలో కూర్చుంటే.. బ్లడ్‌ఫ్లో హార్ట్‌కి సరిగా ఉండదు.
చిన్నప్పటి నుంచి ప్రతిరోజూ నేల మీదే కూర్చుని భోజనం చేసేవారిలో కీళ్లనొప్పులు తక్కువగా ఉండటాన్ని గమనించవచ్చు. ఎందుకంటే నేల మీద కూర్చుని తినడం మన కీళ్లకి చక్కని వ్యాయామం. ఇలా కీళ్లని మడిచే అలవాటే లేకపోతే కొన్నాళ్లకి అవి పట్టేసే ప్రమాదం లేకపోలేదు. కాబట్టి వృద్ధాప్యంలో సైతం ఒకరి సాయం లేకుండా నేల మీదకి కూర్చుని, నిల్చొనే శక్తి ఉండటానికి ఈ అలవాటు దోహదపడుతుంది. యూరిపియన్ జర్నల్ ఆఫ్ ప్రివెంటివ్ కార్డియాలలో ప్రచురితమైన ఓ కథనం ప్రకారం… నేలపై కూర్చుని భోజనం చేయడం వల్ల ఆయుష్షు పెరుగుతుందని వెల్లడించారు.