చలికాలంలో జుట్టు రాలడం ఎక్కువ అవుతుంది. ఈ కాలంలో జుట్టుకు సంబంధించి కొంచెం ఎక్కువ జాగ్రత్త అవసరం. ఈ కాలంలో కొన్ని రకాల జుట్టు సమస్యలు ఎక్కువగా ఎదురైవుతుంటాయి. అందులో ఒకటి జుట్టు చిట్లిపోవడం. సాధారణంగా జుట్టు చివర్లు చిట్లినప్పుడు కొంచెం జుట్టును కట్ చేస్తూ ఉంటాం. ఇలా చేయటం వలన సమస్య తాత్కాలికంగా తగ్గుతుంది. కానీ పూర్తిగా తగ్గదు. అందువల్ల కొన్ని సహజమైన చిట్కాల ద్వారా ఈ సమస్య నుండి సులభంగా బయట పడవచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
అవకాడో దెబ్బతిన్న జుట్టును పునరుద్ధరించి, చిట్లిన జుట్టుకు ఎంతో ప్రభావవంతమైన రీతిలో చికిత్సను అందిస్తుంది. జుట్టు ప్రయోజనాలకు ఉపయోగపడే మంచి మార్గాలలో అవకాడో ఒకటి. మరి ఆ ప్యాక్స్ ఎలా చేసుకోవాలో చూద్దాం.
ఒక అవకాడో పండును గుజ్జుగా చేసుకుని అందులో ఆలివ్ ఆయిల్ మిక్స్ చేయాలి. తలకు బాగా రాసుకుని అరగంట తర్వాత స్నానం చేయాలి. ఇలా వారానికి ఒకసారి చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. అవకాడో బదులుగా అవకాడో ఆయిల్ ని కూడా ఉపయోగించవచ్చు.
బాగా పండిన బొప్పాయి గుజ్జులో కొద్దిగా అవకాడో పేస్ట్ కలిపి తలకు రాసుకుని 20 నిమిషాల తర్వాత తేలికపాటి షాంపూతో తలస్నానము చేయాలి. ఈ విధంగా నెలలో రెండు సార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
అవోకడో గుజ్జులో ఎగ్ వైట్ కలిపి ఈ మిశ్రమాన్ని మీ చిట్లిన జుట్టుకు రాసుకుని 30 నిముషాల తర్వాత తలస్నానం చేయాలి. చిట్లిన జుట్టును అరికట్టడానికి ఇంట్లో తయారుచేసిన ఈ మిశ్రమాన్ని నెలకు రెండుసార్లు మీ జుట్టుకు రాసుకుంటే జుట్టు అందంగా మారుతుంది.
అవోకడో, తేనె కలిపి ఈ మిశ్రమాన్ని మీ తలకు రాసుకుని 40 నిమిషాల పాటు ఆరనిచ్చి, గోరువెచ్చని నీటితో తలను శుభ్రం చేసుకుంటే చిట్లిన జుట్టు నుండి ఉపశమనం పొందవచ్చు. ఇలా నెలకు 3-4 సార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
అరటిపండు గుజ్జులో అవకాడో గుజ్జు, కొద్దిగా రోజ్ వాటర్ కలిపి పేస్ట్ లా చేసి ఈ మిశ్రమాన్ని మీ తలకు రాసుకుని గంటపాటు వదిలేయండి. తేలికపాటి షాంపూ, గోరువెచ్చని నీటితో కడిగేయండి. చిట్లిన చివర్లు తొలగించడానికి ఈ విధానాన్ని వారానికి ఒకసారి చేయండి.