Home Unknown facts ఈ ప్రాంతాన్ని భూతల కైలాసంగాను, బృహదాచల క్షేత్రంగాను ఎందుకు పిలుస్తారు ?

ఈ ప్రాంతాన్ని భూతల కైలాసంగాను, బృహదాచల క్షేత్రంగాను ఎందుకు పిలుస్తారు ?

0

మన దేశంలో నాగుపాముని దైవంగా భావించి నాగులచవితి నాడు పుట్టలో పాలు కూడా పోస్తారు. అయితే ఇక్కడ విశేషం ఏంటంటే ఈ ఆలయానికి రోజు ఒక శేషనాగు వచ్చి స్వామివారిని సేవిస్తునట్లుగా చెబుతున్నారు. ఇంకా ప్రకృతి నడుమ వెలసిన ఈ ఆలయం దగ్గర లో వేసవికాలంలో సైతం జలధార అనేది ఎప్పటికి వస్తూనే ఉండగా ఆ జలధార ఎక్కడ నుండి వచ్చేదని ఇప్పటికి అంతు చిక్కని రహస్యంగానే మిగిలిపోయింది. మరి ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఈ ఆలయంలో దాగి ఉన్న మరిన్ని విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Gudilova Ranganatha Swamy Temple

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, విశాఖపట్నం జిల్లా, ఆనందపురం మండలం, గుడిలోవ అనే గ్రామంలో శ్రీ రంగనాథ స్వామి ఆలయం ఉంది. ఈ ఆలయం చాలా పురాతన ఆలయమని చెబుతారు. ప్రకృతి ఒడిలో మూడు కొండల నడుమ ఈ ఆలయం ఎంతో ప్రశాంత వాతావరణంలో ఉంటూ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది. ఇక రంగనాధ స్వామి ఆలయ గర్భగుడిలో ఒక శేషనాగు ఎప్పటినుండో నివాసం ఏర్పాటుచేసుకుని స్వామిని నిత్యం సేవిస్తునట్లుగా అక్కడి స్థానికులు చెబుతున్నారు.

ఈ ప్రాంతాన్ని భూతల కైలాసంగాను, బృహదాచల క్షేత్రంగాను పిలుస్తారు. కొండమీద ఉన్న ఈ ఆలయానికి కొంత దూరంలో విష్ణుపాదాలు, శ్రీచక్రం ఉన్నాయి. అయితే ఇక్కడ ఒకేచోట శ్రీరంగనాథ స్వామి ఆలయం, శ్రీ నారాయణేశ్వరాలయం ఉండటం విశేషం. ఇక్కడి కొండపైన వెలసిన శివలింగం స్వయంభువు అని చెబుతారు. ఇక్కడ మరొక విశేషం ఏంటంటే, ఎక్కడో కొండకోనల్లో పుట్టిన జలధార విష్ణుపాదాలు, శ్రీచక్రం, శ్రీ నారాయణేశ్వరాలయం లో ఉన్న శివలింగాన్ని తాకుతూ ఒక సెలయేరులా నిత్యం ప్రవహిస్తూనే ఉంటుంది. ఈ నీరు స్వచ్ఛంగా తియ్యగా ఉంటాయి. అయితే ఈ నీరు ఎక్కడి నుండి వస్తుందనేధీ ఇప్పటికి ఒక ప్రశ్నగానే మిగిలిపోయింది.

ఇది ఇలా ఉంటె ఈ ప్రాంతంలో పూర్వం దేవతలు సంచరించారని, నృసింహుడు ఈ కొండపై నుండే సింహాచలం వెళ్లాడని పురాణం. అయితే నృసింహుడు ఈ కొండపైన నిలుచోగా ఎదురుగా ఉన్న పద్మనాభుడు కనిపించడంతో సింహాచలం కొండమీదకు వెళ్లి అక్కడ అవతరించినట్లుగా ఒక కథ ఆధారంగా తెలియుచున్నది. ఇక ఈ ఆలయ విషయానికి వస్తే, హిందువులు ఉసిరి చెట్టును పవిత్రంగా భావిస్తారు. ఇక్కడ ఎన్నో ఉసిరి చెట్లు ఉండటంతో ఈ ప్రాంతానికి మరింత పవిత్రత ఏర్పడింది.

ఇలా ఎన్నో అద్భుతాలకు నిలయమైన ఈ ఆలయానికి కార్తీకమాసంలో భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు. అయితే కార్తీకమాసంలో భక్తులకి గర్భాలయ ప్రవేశం కల్పిస్తారు. ఇంకా కార్తీకమాసంలో ఇక్కడ వనభోజనాలు చేస్తే ముక్తి లభిస్తుందని భక్తుల నమ్మకం. అందుకే ఈ పుణ్యక్షేత్రానికి కార్తీకమాసంలో ఆదివారం నాడు భక్తుల రద్దీ అనేది అధికంగా ఉంటుంది.

Exit mobile version