Home Unknown facts దుష్ట శక్తిని అంతం చేయడానికి అగ్ని నుండి వెలిసిన వల్లూరమ్మా

దుష్ట శక్తిని అంతం చేయడానికి అగ్ని నుండి వెలిసిన వల్లూరమ్మా

0

ప్రతి గ్రామంలో గ్రామదేవతకి సంబంధించిన ఆలయం అనేది తప్పనిసరిగా ఉంటుంది. అలానే ఇక్కడ కూడా పూర్వం దుష్ట శక్తిని అంతం చేయడానికి అగ్ని నుండి వల్లూరమ్మా తల్లి వెలిసిందని పురాణం. మరి వల్లూరమ్మా తల్లి ఎలా వెలసింది? ఈ తల్లి వెలసిన ఆలయం ఎక్కడ ఉందనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Sri Valluramma Ammavari Temple

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ప్రకాశం జిల్లా లో వల్లూరు అనే గ్రామంలో శ్రీ వల్లూరమ్మా ఆలయం ఉంది. ఈ తల్లి ఎన్నో మహిమలు గల తల్లిగా పేరు గాంచినది. భక్తులు కోరిన కోరికలు నెరవేరుస్తూ, భూతపిశాచాలను సైతం వణికించిన తల్లి వల్లూరమ్మా.

ఈ ఆలయ పురాణానికి వస్తే, ఒంగోలు ప్రాంతానికి అవతలివైపున ఉండే ప్రాంతాలు వేంకటగిరి రాజుల అధీనంలో ఉండేవి. ఒంగోలు ప్రాంతం మందపాటి రాజుల అధీనంలో ఉండేది. అయితే కొన్ని కారణాల వలన ఈ రెండు రాజ్యాలకి శత్రుత్వం విపరీతంగా ఉండేది. దీంతో ఒకసారి వేంకటగిరి గిరి రాజు కేరళ మాంత్రికుడిని రప్పించి ఒంగోలు రాజ్యంపైన భూతశక్తిని ప్రయోగించాడట. అప్పుడు ఆ రాజ్యంలోని పశువులు, ప్రజలు ఒక్కొక్కరిగా చనిపోతుండగా ఆ రాజు మహా చండీయాగం జరిపించగా ఆ యాగానికి ఆహుతిగా అద్దంకి నాంచారమ్మని ఆహ్వానించారు. ఇక ఈ యాగం ముగిసే సమయానికి అగ్ని నుండి ఒక దివ్యమూర్తి ఉధ్భవించి జ్వాలాగా మారగా ఆ జ్వాలా రూపం స్త్రీ రూపంగా మారి ఆ ప్రదేశంలోనే వల్లూరమ్మా గా ఆవిర్భవించింది.

ఇక ఆ తల్లి స్వయంభువుగా వెలసిన తరువాత దుష్టశక్తులు పూర్తిగా అంతం అయినాయి. ఈ తల్లికి అద్దంకి నాంచారమ్మ, ఇతముక్కుల జ్వాలాముఖి అనే అక్కలు ఉన్నట్లుగా చెబుతారు. అందుకే భక్తులు వీరి ముగ్గురిని అక్కచెల్లెళ్లుగా భావించి పూజలు చేస్తుంటారు. ఈ ఆలయ విషయానికి వస్తే, దుష్ట శక్తుల పాలిట సింహస్వప్నం అయినా ఈ తల్లి కొలువైన ఈ ఆలయానికి కొత్తగా వాహనాలు కొన్న వారు వారి వాహనాలకు ఇక్కడ పూజలు చేస్తుంటారు. శక్తి స్వరూపమైన ఈ తల్లి కొలువై ఉన్న ఈ ఆలయానికి దేవి నవరాత్రులు, సంక్రాంత్రి సమయాల్లో భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు.

Exit mobile version