తిరుమలలో కొలువైన దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి. అయితే తిరుమల ఆలయానికి ఉన్న ప్రాచీనమైన చరిత్రలో చాలా భాగం ఆ స్వామివారి హుండీకి కూడా ఉంది. శ్రీవారికి కానుకల రూపంలో నిత్యం లక్షలాది నోట్ల కట్టలు, ఖరీదైన బంగారు, వెండి నగలు వస్తాయి. ఇక పండుగలు, విశేషదినాల్లో ఏడుకొండల వేంకటేశునికి లెక్కకు మిక్కిలిగా కానుకలు వస్తాయి. మరి శ్రీవారి హుండీ ఎప్పుడు ప్రారంభం అయింది? ఇంకా శ్రీవారి హుండీ గురించి చాలామందికి తెలియని కొన్ని విషయాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.
శంఖుచక్రాలు, తిరునామాలు ముద్రించిన రాగి గంగాళాన్ని శ్రీవారి హుండీగా ఉపయోగిస్తారు. దీన్ని కొప్పెర అని కూడా అంటారు. శ్రీవారి హుండీ తిరుమామణి మంటపంలో ఉంది. అయితే బంగారు నగలు, వెండి పాత్రలు, ముడుపులు, నాణేలు, నోట్లు, వస్త్రాలు, కర్పూరం, బియ్యం ఇలా ఎన్నో రకాలైన వస్తువులను భక్తులు స్వామివారికి కానుకలుగా ఈ హుండీ ద్వారా సమర్పిస్తారు. నిటారుగా పెద్ద సంచీ ఆకృతితో ఏర్పాటు చేయబడిన తెల్లని కాన్వాసు గుడ్డలో పెద్ద రాగి గంగాళాన్ని దించి పైగుడ్డను రోటి వలె తాళ్ళతో కట్టి వేలాడదీస్తారు. ఈ కాన్వాసు గుడ్డపై శ్రీవారి శంఖుచక్రాలు తిరునామాలు చిత్రింపబడి ఉన్నాయి.
ఇక 1821 జూలై 25న శ్రీవారి హుండీ ఏర్పాటైంది. ఈస్టిండియా కంపెనీవారి చట్టం బ్రూస్కోడ్- 12లో దీని వివరాలు ఉన్నాయి. 1830ల్లోనే తిరుమల ఆదాయం, అందులోనూ ప్రధానంగా హుండీ ఆదాయం నుంచి పూజలకు, అర్చనలకు, ఉత్సవాలకు ఖర్చులు పోగా ఆనాటి ప్రభుత్వమైన ఈస్టిండియా కంపెనీకి దాదాపు రూ.లక్ష మిగులు ఉండేది. ఇక ప్రస్తుతం శ్రీవారి ఒకరోజు సగటు ఆదాయం కోటిన్నరకు పైగా ఉంది.
పురాణాల ప్రకారం, శ్రీనివాసుడు పద్మావతిదేవిని వివాహం చేసుకునేందుకు తన వద్ద డబ్బులేకుంటే పెళ్ళిఖర్చుల కోసం ఇక్కట్లు పడ్డాడు. లక్ష్మిదేవిని వైకుంఠంలో విడిచి రావడంతో ఆయనకు సంపదలేకపోయింది. పెళ్ళికి అవసరమైన డబ్బు కుబేరుడు వేంకటేశ్వరునికి అప్పుపెట్టారు. వేంకటేశ్వరస్వామి ఆ బాకీ తీర్చలేకపోగా ఏటేటా వడ్డీ మాత్రం తీరుస్తున్నాడు. ఆ వడ్డీ డబ్బును ఈ హుండీ సొమ్ములోంచే ఇస్తున్నాడని ప్రతీతి. అయితే ఆపదలు వచ్చినప్పుడు మొక్కులు మొక్కుకుంటే ఆ స్వామి తీరుస్తాడని నమ్మిక. ఇక ఒంటిపై వేసుకుని వచ్చిన బంగారం, సొమ్ముతో పళంగా పర్సు మొత్తం హుండీలో వేసేయడాన్ని నిలువు దోపిడీ అని వ్యవహరిస్తారు.
ఇది ఇలా ఉంటె, వేంకటేశ్వరుడి అకౌంటు కింద వివిధ బ్యాంకుల్లో 9,500 కోట్ల రూపాయలు డిపాజిట్ల రూపంలో ఉన్నాయి. వాటి ద్వారా దేవస్థానానికి ఏడాదికి 800 కోట్ల రూపాయల వడ్డీ వస్తుంది. ఇక సాధారణ రోజుల్లో రోజుకు రూ.కోటి నుంచి రూ.2.5 కోట్ల ఆదాయం శ్రీవారికి వస్తుంది. అదే రద్దీ రోజులో అయితే రోజుకు రూ.2.50 నుంచి రూ.3 కోట్లు దాటుతుంది.