Home Unknown facts మహా శివరాత్రి నాడు అస్సలు చేయకూడని పనులు ఏంటో తెలుసా ?

మహా శివరాత్రి నాడు అస్సలు చేయకూడని పనులు ఏంటో తెలుసా ?

0

మహా శివరాత్రి.. సృష్టి స్థితి లయకారుడైన ఆ మహాశివునికి అత్యంత ప్రీతికరమైన రోజు.. ప్రతినెలా శివరాత్రి వస్తుంది కానీ మాఘమాసం బహుళ చతుర్దశి నాడు పరమేశ్వరుడు లింగరూపంలో ఉద్భవించినట్లు పురాణ కథనం.. పూర్వం బ్రహ్మ విష్ణువులు, తమలో తాము నేను గొప్ప అంటే నేను గొప్ప అని వాదించుకుంటుండగా ఆ ప్రదేశంలో పెళ పెళ శబ్దాలతో జ్యోతి ప్రజ్వలిస్తుంది.. అసలు ఆజ్యోతి ఏంటి.. దాని ఆది అంతం తెలుసుకునేందుకు బ్రహ్మ హంస రూపంలోనూ, విష్ణువు వరాహ రూపంలోనూ వెళ్లినప్పటికీ ఆది అంతాలు అంతు చిక్కక పోవటంతో అంతట ఆ జ్యోతి మరేదో కాదని.. లింగ రూపంలో ఉన్నది తానే అని చెప్పి జ్ఞాన బోధ చేస్తాడు.. అలా లింగోద్భవం జరిగిన రోజే మహా శివరాత్రిగా జరుపుకుంటాం.. మహాశివరాత్రి రోజున శివ ప్రతిష్ట చేసినా, శివపార్వతుల కళ్యాణం చేసినా ఎంతో శ్రేష్టం. లింగోద్భవం జరిగింది అమావాస్య కాగా ముందు రోజును శివరాత్రిగా జరుపుకుంటాం.. క్షీర సముద్రమధనంలో వెలువడ్డ విషాన్ని లోక కల్యాణార్థం గరళంలో దాచి ఉంచిన మహా శివుడికి ఆ రాత్రి జాగరణతో ఉంచటంకోసం జాగారం చేస్తాం.. త్రయోదశినాడు ఒంటిపొద్దు ఉండి చతుర్థశినాడు ఉపవాసం ఉంటాం.. శివ శక్తుల కలయికగా శివరాత్రి చెప్పబడింది కాబట్టి కల్యాణాన్ని జరిపిస్తాం..

Maha Shivratriఈ 2020 సంవత్సరం ఫిబ్రవరి 21 అర్ధరాత్రి 12 గంటలకు లింగోద్భవ పుణ్యకాలం.. ఎంతో పవిత్రమైన ఈ రోజున శివుణ్ని భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. శివపురాణంలో శివరాత్రి పూజ విధానాన్ని శ్రీకృష్ణుడుకి ఉపమన్యు మహర్షి వివరించాడు. ఈ రోజున పరమేశ్వరుణ్ని భక్తులు మూడు విధాలుగా పూజిస్తారు. అవి.. శివపూజ, ఉపవాసం, జాగారం. వీటిలో ఉపవాసానికి చాలా ప్రాధాన్యత ఉంది. మహాశివరాత్రినాడు ఉపవాసం చేసి శివనామ స్మరణ చేయడం కన్నా ముఖ్యమైంది మరొకటి లేదు. ఉపవాసం వల్ల శారీరక శుద్ధి, జాగారం చేస్తూ ధ్యానం చేయడం వల్ల మనోశుద్ధి కలుగుతాయి. ఆ మహాదేవుని ఆశీస్సులకోసం చేసే అభిషేకం, పూజ, ఉపవాసం, జాగరణలో పాటించాల్సిన విధులు చూద్దాం..

అసలు ఆహారం తీసుకోకుండా ఉండలేని వారు.. అన్నం కాకుండా పాలు, పండ్లు, ఫలహారం మాత్రమే తీసుకోవాలి.. అది కూడా తక్కువ మొత్తంలో తీసుకోవాలి.. శివరాత్రి రోజు మనం మాట్లాడే మాటలు కూడా శుచిగా ఉండాలి.. ఎక్కువ దైవసంబంధమైనవే మాట్లాడుకోవటం.. వీలైనంత తక్కువ మాట్లడటం .. శివ పంచాక్షరీ (ఓం నమశ్శివాయ) మంత్రాన్ని జపిం చాలి.. నాలుగు యామాల్లో జరిగే శివ పూజలో పండ్లు పలహారాలు దేవునుకి నివేదించటం వాటిని ఇతరులకు పంచిపెట్టటం చేయాలి.. శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి.. పూజ చేయటం వీలుకాని వారు చారెడు నీళ్ళైనా సమర్పించాలి.. స్త్రీ, పురుషులు తప్పక బ్రహ్మచర్యం పాటించాలి. లింగోద్భవ పుణ్యకాలం వరకూ మేల్కొని ఉండాలి. వీలైతే మరుసటి రోజు సూర్యోదయం వరకూ ఉండాలి. రాత్రంతా శివకథలు వింటూ…. మౌనవ్రతం చేయదలచినవారు ‘ఓం నమః శివాయ’ మంత్రాన్ని మనసులో స్మరిస్తూ ఉండాలి. మర్నాడు శివ భక్తులకు అన్న, పానీయాలు.. శక్తి కొలది వస్త్రాలు, ఛత్రం దానం చేయాలి.

మహా శివరాత్రి రోజున ప్రాతఃకాలాన్నే నిద్రలేచి తలంటు స్నానం చేసి శివాలయాన్ని దర్శించుకోవాలి. అలా కాకపోతే, ఇంటి దగ్గరే శివపార్వతులను పుష్పాలు, బిల్వదళాలు, పంచామృతాలతో అభిషేకం చేయాలి.. అయితే అనారోగ్యంతో ఉన్నవారు కఠీన ఉపవాసం ఉండాలని లేదు.. సాత్విక ఆహారం స్వీకరించవచ్చు… శివరాత్రి రోజు ప్రాతః సంధ్య కాలంలో నిద్రించరాదు.. అలాగే మొగలిపువ్వులను ఎట్టి పరిస్థితుల్లోనూ శివపూజకు ఉపయోగించకూడదు.. ఇక అభిషేకాలకి వీలైనంతవరకు నీటిని ఎక్కువగా వాడండి.. ఇలా ఉపవాస, జాగరణ లింగార్చనా రూపకమైన శివరాత్రి వ్రతం ఆచరిస్తే సకలశుభాలు కలుగుతాయి..

 

Exit mobile version