Home Unknown facts నవనందులకి ఉన్న విశేషం ఏంటి? ఆ నవనందులు ఎక్కడ ఉన్నాయో తెలుసా

నవనందులకి ఉన్న విశేషం ఏంటి? ఆ నవనందులు ఎక్కడ ఉన్నాయో తెలుసా

0

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కర్నూలు జిల్లా, నంద్యాలకు కొన్ని కిలోమీటర్ల దూరంలో మహానంది వద్ద శ్రీ మహానందీశ్వరస్వామి ఆలయం ఉంది. ఈ మహానందికి చుట్టూ 18 కి.మీ. వలయంలో తొమ్మిది నంది ఆలయాలున్నాయి. వీటన్నింటిని కలిపి నవనందులు అంటారు. మరి ఈ నవనందులకి ఉన్న విశేషం ఏంటి? ఆ నవనందులు ఎక్కడ ఉన్నాయనే విషయాలను మనం తెలుసుకుందాం.

ప్రథమనంది:

Nandhiనంద్యాలకు నైరుతి దిక్కున చామకాల్వ ఒడ్డున ప్రథమ నందీశ్వర ఆలయం ఉంది. నవనందులలో ఇది మొదటిది. అయితే పూర్వం విధాత కోరికమేరకు పరమేశ్వరుడు ఇక్కడ ప్రథమ నందీశ్వరునిగా వెలిసాడు. ఇక్కడ కార్తీకమాసం నెలరోజులు, సూర్యాస్త సమయంలో నందీశ్వరుడిపై సూర్యకిరణాలు పడటం ఇక్కడి ప్రత్యేకత.

నాగానంది:

నంద్యాలలోని ఆంజనేయస్వామి దేవాలయంలో నాగానంది విగ్రహం ఉన్నదీ. ఇక్కడ పరమేశ్వరుడు నాగానందీశ్వరుడిగా వెలిశాడని చెబుతారు. పూర్వం నాగుల గరుత్మంతుని దాటికి తట్టుకోలేక పరమేశ్వరుడి కోసం తపస్సు చేసిన ప్రదేశం ఇదేనని తెలుస్తుంది. నాగుల తపస్సుకు మెచ్చిన పరమశివుడు వారికీ అభయం ఇచ్చి కాపాడాడని ప్రతీతి.

సోమనంది:

నంద్యాల పట్టణానికి తూర్పున ఉన్న ఆత్మకూరు బస్టాండ్ సమీపంలో సోమనందిశ్వరాలయం ఉన్నది. పూర్వం సోముడు (చంద్రుడు) సోమశేఖరుని కోసం ఇక్కడే తపస్సు చేయగా, ఇక్కడ శివుడు సోమనందిశ్వరునిగా వెలిశాడని భక్తుల నమ్మకం.

శివనంది:

మహానంది క్షేత్రానికి ఉత్తరాన 10 కి.మీ. దూరంలో బండి ఆత్మకూరు మండలం, కడమల కాల్వ గ్రామంలో శివానందీశ్వరాలయం ఉన్నది. ఈ ఆలయం మిగతా ఎనిమిది ఆలయాల కంటే పెద్దది. ఈ ఆలయం అరణ్యప్రాంతంలో ఉటుంది. ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంటుంది.

సూర్యనంది:

మహానందికి 8 కి.మీ. దూరంలోని తమ్మడపల్లి గ్రామంలో సూర్యనంది ఆలయం ఉంది. ఈశ్వరుడి కోసం సూర్యుడు తపస్సు చేసిన ప్రదేశం ఇదే, అయితే సూర్యుని కోరిక మేరకు శివుడు ఇక్కడ సూర్యనందిశ్వరుడిగా వెలిసాడు. ఈ ఆలయంలో రోజు సూర్యోదయ సమయంలో కిరణాలు ఈ లింగం పైన పడటం ఇక్కడి విశేషం.

విష్ణునంది:

మహానందికి ఉత్తరాన 4 కి.మీ. దూరంలో విష్ణునందీశ్వరాలయం ఉంది. ఒకప్పుడు మహాదేవుడి కోసం శ్రీహరి ఇక్కడే తపస్సు చేసాడట. అయన కోరిక మేరకు ఆ స్వామి ఇక్కడ విష్ణునందీశ్వరునిగా వెలిసాడు. ఈ ఆలయంలో పాలరాయితో చేసిన నంది విగ్రహం ఎంతో అందంగా చూడముచ్చటగా ఉంటుంది.

మహానంది:

ఈ ప్రాంతాన్ని పాలించిన నంధనవంశరాజుకి శివుడు కలలో కనిపించి తానూ మహానందితో పాటు మరో ఎనిమిది క్షేత్రాలలో ఉన్నానని అక్కడ ఆలయాలు కట్టి అభివృద్ధి చేయాలనీ ఆఙ్ఞాపించాడట. అప్పుడు రాజు ఈ ఆలయాన్ని కట్టించాడు. ఇక్కడి మహానందిలో లింగం స్వయంభు లింగం. ఈ క్షేత్రనికి తీర్థ ప్రాధాన్యం కూడా ఉన్నది. ఇక్కడి కోనేటిలో ఎప్పుడు అయిదు అడుగుల లోతులో నిలిచి ఉండే నీరు, వేసవిలో చల్లగా, శీతాకాలంలో వెచ్చగా ఉంటుంది.

వినాయకనంది:

మహానంది క్షేత్రంలోనే కోనేటి గట్టున ఉన్నదీ వినాయక నందీశ్వరుని ఆలయం. పూర్వం వినాయకుడు ఈ ప్రాంతంలో తపమాచరించాడట అయన కోరిక మేరకు వినాయకానందీశ్వరునిగా ఇచట వెలిశాడట.

గరుడనంది:

వినాయకనంది క్షేత్రంలోకి ప్రవేశిస్తుండగా ఈ గరుడనందీశ్వరాలయం కనిపిస్తుంది. గరుత్మంతుడు తన తల్లి అయినా వినతా దేవి దాస్యవిముక్తి కోసం అమృత కలశాన్ని తెచ్చేందుకు బయలుదేరేముందు ఆ పనిలో విజయం కలగాలని పరమేశ్వరుని కోసం తపస్సు చేసిన ప్రదేశమిది. అప్పుడు గరుడుని కోరిక మేరకు ఇచట పరమేశ్వరుడు గరుడ నందీశ్వరునిగా వెలిసాడు.

ఈవిధంగా వెలసిన ఈ నవనందులని కార్తీకమాసంలో సోమవారం రోజున దర్శించుకుంటే జన్మజన్మల నుండి మనలను వెంటాడుతున్న పాపగ్రహ దోషాలన్నీ తొలగిపోతాయని, సూర్యోదయం నుండి సూర్యాస్తమయం లోపల ఈ క్షేత్రాలన్నింటిని దర్శిస్తే అన్ని దోషాలు తొలగి, కోరిన కోర్కెలు తీరుతాయని భక్తుల నమ్మకం.

Exit mobile version