ఈ ఆలయంలో శివుడు స్వయంభు లింగంగా వెలిసాడు. ఇక్కడ బుగ్గ జాతర చాలా ప్రత్యేకం. కార్తీక మాసంలో పౌర్ణమి నుంచి పదిహేను రోజులు ఈ జాతర చాలా ఘనంగా జరుగుతుంది. అయితే ఈ ఆలయం దగ్గరలో నీటికి ఒక విశేషం ఉంది. మరి ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఏంటి ఆ విశేషం? ఇంకా ఆలయం గురించి మరిన్ని విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.తెలంగాణ రాష్ట్రంలో రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం డివిజన్ మంచాల మండలం ఆరుట్ల గ్రామంలో ఆరుట్ల బుగ్గ రామలింగేశ్వరలయం ఉంది. క్కడ వెలిసిన రామలింగేశ్వర స్వామికి ఎంతో పవిత్రత ఉంది. అరణ్యవాసంలో ఉన్న రాముడికి శివుడు ప్రత్యక్షమైన చోటు కాబట్టే ఇక్కడ స్వావి రామలింగేశ్వరుడిగా వెలిసాడని ప్రతీతి. పవిత్రమైన సెలయేటి చెంతన వెలసినందున బుగ్గ రామలింగేశ్వరుడిగా పేరొచ్చింది. అడవిలో పుట్టే ఈ ప్రవాహం శివుడిని అభిషేకించడానికే పుట్టిందా అన్నట్లు తూర్పు నుంచి పడమరకు ప్రవహించి తిరిగి అడవిలో ప్రవేశించి అదృశ్యమవుతుంది. అయితే ఇక్కడ విశేషం ఏంటి అంటే తూర్పు దిక్కు నుంచి పడమర వైపు నీళ్లు ప్రవహించి తిరిగి తూర్పు వైపు మరలుతున్నాయి. ఇది చాలా అరుదైన సన్నివేశంగా భక్తులు తిలకిస్తుంటారు. కార్తిక పౌర్ణమి నుంచి అమావాస్య వరకు ఇక్కడ ప్రవహించే నీటిలో పుణ్యస్నానాలు ఆచరిస్తే సకల పాపాలు దూరమవుతాయని భక్తుల నమ్మకం. అంతేకాకుండా ఇక్కడికి వచ్చే భక్తులు స్వామి చెంతన కార్తీకమాసం వ్రతాలు ఆచరిస్తారు. కాశీకి వెళ్లలేనివారు కార్తిక పౌర్ణమి నాడు ఇక్కడ రామలింగేశ్వరుడిని దర్శించుకుంటే కాశీకి వెళ్లి వచ్చిన ఫలం దక్కుతుందని విశ్వసిస్తారు. బుగ్గరామలింగేశ్వరస్వామి ఆలయానికి చెంతనే గుట్టపై కబీర్‌దాస్ మందిరం ఉంది. కాశీలో ఉపదేశం పొందిన నర్సింహ బాబా అనే సాధువు 1975లో ఇక్కడ కబీర్‌దాస్ మందిరాన్ని నిర్మించారు. ఆలయానికి వచ్చే భక్తులంతా పక్కనే ఉన్న కబీర్‌దాస్ మందిరాన్ని దర్శించుకోవటం ఆనవాయితీ. ఈ ఆలయంలోనే నాగన్నపుట్ట, శివపార్వతుల సన్నిధి ఉంది. కార్తీకమాసం సందర్భంగా నాగన్నపుట్టకు మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఇక్కడ కార్తీకమాసంలో పుట్టలో నుంచి నాగరాజు బయటికి వచ్చి కనిపిస్తాడని ప్రజల నమ్మకం. ఈ మందిరంలోనే చాలా కాలంపాటు ధ్యానం చేసిన నర్సింహబాబా ఇక్కడే సజీవంగా సమాధి అయినట్లు చెబుతారు. కార్తీక మాసంలో బుగ్గరామలింగేశ్వరస్వామి ఆలయంలో వ్రతాలు చేస్తే అనుకున్న కోర్కెలు తీరుతాయని ఈ ప్రాంత ప్రజల విశ్వాసం. కార్తీక పౌర్ణమి నుంచి అమావాస్య వరకు ఈ ఆలయ ప్రాంగణంలో ప్రతిరోజు వందలాది మంది సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహిస్తారు. కోరిన కోర్కెలు తీరితే వ్రతాలు నిర్వహిస్తామని భక్తులు మొక్కుకుంటారు. తమ కోరికలు తీరిన తరువాత వ్రతాలు ఆచరించి మొక్కులు తీర్చుకుంటారు. వందల సంఖ్యలో తరలివచ్చే భక్తులు పదిహేను రోజుల పాటు ఆలయప్రాంగణంలో సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహిస్తారు.ఇలా కొండ కోనలు ఆకట్టుకునే అటవీ అందాల మధ్యన కొలువైన బుగ్గక్షేత్రంగా పేరు గాంచిన రామలింగేశ్వరస్వామి ఆలయాన్ని దర్శించుకొనుటకు వివిధ ప్రాంతాల నుండి భక్తులు అధికంగా తరలి వస్తుంటారు.
Sign in
Welcome! Log into your account
Forgot your password? Get help
Password recovery
Recover your password
A password will be e-mailed to you.