Home Unknown facts గరుడాద్రి కొండపైన వెలసిన సుమారు 500 వందల సంవత్సరాల చరిత్ర గల ఆలయం

గరుడాద్రి కొండపైన వెలసిన సుమారు 500 వందల సంవత్సరాల చరిత్ర గల ఆలయం

0

గరుడాద్రి అనే కొండపైన వెలసిన సుమారు 500 వందల సంవత్సరాల చరిత్రని తెలియచేస్తూ, ఆలయ శిల్పకళా సంపద, అధ్బుత కట్టడాలు ఇలా ప్రతి ఒక్కటి ఇక్కడ ఆశ్చర్యానికి గురి చేస్తూనే ఉంటుంది. మరి ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఈ ఆలయ స్థల పురాణం ఏం చెబుతుంది అనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Ranganadha Swamyతెలంగాణ రాష్ట్రం, మహబూబ్ నగర్ జిల్లా, పెబ్బేరు మండలం వనపర్తికి సమీపంలో శ్రీ రంగాపురం అనే గ్రామం ఉంది. ఈ గ్రామంలో గరుడాద్రి అనే చిన్న కొండపైన శ్రీ రంగనాథ స్వామి వారి ఆలయం ఉంది. ఈ ఆలయాన్ని సుమారు 600మంది శిల్పులు, ఆగమశాస్త్ర పండితులు, కళాకారులు వేలాదిమంది కార్మికులు కలసి దాదాపుగా 134 సంవత్సరాల పాటు నిర్మించారని పురాణాలూ చెబుతున్నాయి.

ఇక ఈ ఆలయ స్థల పురాణానికి వస్తే, ఎనిమిది భాషల్లో పట్టు కలిగిన బహుముఖసాహితీ ప్రియుడు, పాలనాదక్షుడు అయిన వనపర్తి సంస్థానాధీశుడు బహిరి గోపాల్‌రావు 1662వ సంవత్సరంలో దక్షిణ భారతదేశంలోని పుణ్యక్షేత్రాలను దర్శించుకునే క్రమంలో కర్ణాటక రాష్ట్రంలోని శ్రీరంగపట్నం చేరుకున్నాడు. అక్కడ శ్రీరంగనాయకులు కొలువై ఉన్న శ్రీరంగ క్షేత్రమును దర్శించాడు. ఆ ఆలయ నిర్మాణం, శిల్పకళను చూసి ముగ్ధుడయ్యాడు. తన రాజ్యం వనపర్తిలోనూ శ్రీరంగ నాయకుల ఆలయాన్ని నిర్మించాలని అనుకోని ఈ ఆలయాన్ని నిర్మించాడని స్థల పురాణం.

ఇక ఆలయ విషయానికి వస్తే, ఆలయానికి మూడు దిక్కులా రంగసముద్రం చెరువు ఉండటం వలన మరింత సౌందర్యంగా కనిపిస్తుంది ఈ ప్రాంతం. ఆలయ ముఖద్వారంలో నిర్మించిన 60 అడుగుల ఎత్తైన గాలిగోపురంలో శిల్పకళా చాతుర్యం ఉట్టిపడుతుంది. ఆలయ గర్భగుడిలో శ్రీ రంగనాథుడు శేషపాన్పుపై శయనించి భక్తులకి దర్శనం ఇస్తాడు. స్వామివారి పాదాల వద్ద శ్రీదేవి, భూదేవిలను దర్శించగలము. ఇంకా ఈ ఆలయానికి 200మీటర్ల దూరంలో 12మూలలు కలిగి, నక్షత్రాకారంలో పూర్తిగా రాతితో నిర్మించిన రత్నపుష్కరిణిలో ఇప్పటివరకు నీరు ఎండిపోలేదు.

ఈ ఆలయంలో భక్తులకు పవిత్రమైన వైకుంఠ ఏకాదళి రోజున ఆలయ దక్షిణద్వార ప్రవేశం తెల్లవారుజామున జరుగుతుంది. దక్షిణ ద్వారం గుండా రంగనాయకుల దర్శనం, సూర్యోదయ కాలంలో చేసుకున్న వారికి పునర్జన్మ ఉండదని శాస్త్రం చెబుతోంది. ఈ దర్శనానికి దేశం నలుమూలల నుంచి భక్తులు వస్తారు.

Exit mobile version