శ్రీమహావిష్ణువు లోకకల్యాణం కోసం దశావతారాలు ఎత్తాడనీ చెబుతారు. అందులో ఒక అవతారమే ఈ వామనావతారం. అయితే శ్రీమహావిష్ణువు ఈ అవతారం ఎత్తడం వెనుక ఒక కారణం ఉంది. మరి శ్రీ మహావిష్ణువు వామనావతారం ఎందుకు దర్శనమిస్తాడు? ఈ ఆలయం ఎక్కడ ఉందనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.
తమిళనాడు రాష్ట్రము, కాంచీపురం జిల్లా, కాంచిపురంకి కొంత దూరంలో శ్రీ ఉలగళంద పెరుమాళ్ స్వామివారి ఆలయం ఉంది. ఈ ఆలయం 108 వైష్ణవ దివ్యక్షేత్రాలలో ఒకటిగా చెబుతారు. ఇక్కడ శ్రీ మహావిష్ణువు వామనావతార మూర్తిగా భక్తులకు దర్శనం ఇస్తున్నాడు.
పురాణానికి వస్తే, శ్రీ మహావిష్ణువు వామనుడు అనే పేరుతో మరుగుజ్జు బాలునిగా అవతరించి, బలిచక్రవర్తిని మూడు అడుగుల భూమిని దానంగా ఇవ్వమని అడుగుతాడు. దానికి బలి చక్రవర్తి గురువు శుక్రాచార్యుల వారు వద్దని వాదించిన వినకుండా సంతోషంతో అంగీకరిస్తాడు. అప్పుడు వామన రూపంలో ఉన్న శ్రీమహావిష్ణువు తన రూపాన్ని పెంచి, ఆకాశం అంతా వ్యాపించి, ఒక పాదాన్ని భూమి మొత్తాన్ని, రెండవ పాదాన్ని ఆకాశాన్ని ఆక్రమించగా, మూడవపాదం చోటు చూపమంటూ అడిగాడు. అందుకు బలిచక్రవర్తి తన శిరస్సు చూపించగా, మూడవపాదంతో బలిచక్రవర్తిని పాతాళానికి అంగదొక్కుతాడు.
ఇక ఈ ఆలయ విషయానికి వస్తే, పల్లవ రాజుల కాలంలో ఈ ఆలయ నిర్మాణం జరిగినట్లు జరిగినట్లు తెలుస్తుంది. ఈ ఆలయ ప్రాంగణం చాలా విశాలంగా ఉండి, ఐదు అంతస్థుల గాలి గోపురంతో విరసిల్లుతుంది. గర్భాలయంలో విష్ణుమూర్తి విశ్వరూపాన్ని మనం దర్శించవచ్చు. అయితే ఇక్కడ స్వామి పాదం క్రింద బలిచక్రవర్తి యొక్క శిరస్సు ఉంటుంది.
ఇక గర్బాలయంలో ఉన్న స్వామివారిని ఉలగాలందానాధన్ మరియు త్రివిక్రమస్వామిగా భక్తులు పిలుస్తారు. మూలవిరాట్టు ముందు భాగాన శ్రీదేవి – భూదేవి సమేత లోకనాథన్ ఉత్సవమూర్తులు ఉన్నాయి. ఇక్కడ స్వామివారికి నిత్య పూజలతో పాటు పండుగ పర్వదినాలలో విశేష పూజలు, పుష్యమాసం నందు పదిరోజుల పాటు బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా నిర్వహిస్తారు.