చలికాలం చర్మానికి గడ్డుకాలమనే చెప్పుకోవాలి. చర్మాన్ని ఎక్కువగా శ్రద్ధ పెట్టాల్సి వస్తుంది. చాలామందికి బయటి వాతావరణం ఆహ్లాదంగా కనిపించినా వారి చర్మంలో వచ్చే మార్పులు చూసి తట్టుకోలేరు. పాలిపోయిన చర్మం, మొటిమలతో బయటికి రాలేకపోతారు. అందుకే చలికాలంలో చర్మంపై ప్రత్యేక శ్రద్ద తీసుకోవాల్సి ఉంటుంది. శీతాకాలంలో సహజంగా ఎదురయ్యే సమస్య చర్మం పగలడం లేదా చర్మం పొడి బారి..దురద రావడం వంటి సమస్యలు వస్తుంటాయి.
చలికాలంలో అంతర్గత ఆరోగ్యం ఎంత ముఖ్యమో.. బాహ్య సంరక్షణ కూడా అంతే ముఖ్యం. ఈ కాలంలో చర్మాన్ని సాధ్యమైనంతగా మృదువుగా తేమగా ఉంచుకుంటే మంచిది. సహజంగా మాయిశ్చరైజింగ్, హీలింగ్ స్కిన్ కేర్ ప్రొడక్ట్‌కి మారడం వల్ల చర్మాన్ని మృదువుగా ఉంచుకోవచ్చు. అంతేకాదు ఇంట్లో దొరికే వస్తువులతో నేచురల్ ప్యాక్స్ కూడా ట్రై చేయవచ్చు. అలాగే చర్మం పొడి బారడానికి కారణాలు తెలుసుకొని తగిన జాగ్రత్తలు తీసుకుంటే చలికాలంలో చర్మ సంరక్షణ మరింత సులువవుతుంది.
చలికాలంలో చాలామంది చలి తట్టుకోలేక వేడి నీటితో స్నానం చేస్తారు. దీనివల్ల చర్మంలోని తేమ, సహజ నూనెలు కోల్పోతాయి. ఈ కారణంగా చర్మం పొడిగా మారుతుంది. అందుకే స్నానానికి ఎక్కువ వేడి నీరు కాకుండా గోరు వెచ్చని నీటిని వాడాలి. ఏవైనా సమస్యలకు మందులు వాడుతున్నా చర్మం త్వరగా పొడిబారుతుంది. ముఖ్యంగా శరీర కొవ్వు పదార్థాలను తగ్గించే మందులు, కేన్సర్ నివారణా మందుల వల్ల కూడా సమస్య ఎక్కువ అవుతుంది. ఈ కాలంలో చాలామంది రకరకరాల లోషన్స్, టోనర్స్, బాడీ క్రీమ్స్ వాడుతుంటారు. ఇందులో ఎక్కువగా ఆల్కహాల్ ఉంటుంది. దీనివల్ల చర్మం పొడిగా మారుతుంది. కాబట్టి వీటిని కొనేటప్పుడే ఆల్కహాల్ తక్కువగా ఉన్న ప్రొడక్ట్స్‌ని తీసుకోవాలి.
తేనె తేనెలో మాయిశ్చరైజింగ్ గుణాలు ఉంటాయి. ఈ కారణంగా మార్కెట్‌లో లభించే అనేక క్రీమ్‌లు, లోషన్‌లలో దీనిని ఉపయోగిస్తారు. తేనెలో ఉండే ఎంజైమ్‌లు చర్మంలోపలికి వెళ్లి మృదువుగా చేస్తాయి. తేనె అనేది చాలా సౌందర్య ఉత్పత్తులలో సాధారణంగా ఉపయోగించే పదార్ధం. అంతేకాదు పొడి చర్మంపై నేరుగా కూడా ఉపయోగించవచ్చు. దీని కోసం ఒక గిన్నెలో తేనె వేయాలి. అందులో కాటన్ బాల్‌ని ముంచి ముఖం, మెడ అంతా అప్లై చేయాలి. 15-20 నిమిషాలు అలాగే ఉంచి ఆరిన తర్వాత చల్లటి నీటితో కడగాలి.
స్నానం చేసే నీటిలో కొంచెం కొబ్బరి నూనె వేసుకుంటే చర్మం పొడిగా మారదు. అలాగే స్నానం చేసిన వెంటనే కాస్తా తేమగా ఉన్నప్పుడే మాయిశ్చరైజర్‌లో కాస్తా కొబ్బరి నూనె వేసి చర్మాన్ని మర్దనా చేసినా ఫలితం ఉంటుంది. మొక్కజొన్న పిండి, పెరుగు కలిపి స్నానానికి ముందు చర్మంపై రాసి, ఆరిన తర్వాత స్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల చర్మం మిలమిలలాడుతుంది. కొబ్బరి నూనెలో నిమ్మరసం కలిపి ఆ మిశ్రమాన్ని చర్మంపై మర్దనా చేయాలి. ఇలా చేయడం వల్ల చర్మం తాజాగా, కాంతివంతంగా మారుతుంది.
ఆరెంజ్, తేనె సమాన పరిమాణాల్లో తీసుకోవాలి. బాగా కలిపి ఆ మిశ్రమాన్ని చర్మంపై మర్దనా చేయాలి. ఇలా చేయడం వల్ల చర్మం పొడిగా మారదు. నారింజ పండ్ల తొక్కలను ఎండబెట్టి పౌడర్‌గా చేసుకుని ఆ పౌడర్‌ని పేస్టులా చేసి ముఖం, చేతులకి రాసి ఆరిన తర్వత శుభ్రం చేయాలి. ఇలా చేయడం వల్ల పొడిబారే సమస్య త్వరగా తగ్గడమే కాకుండా అందంగా కూడా మారుతుంది. టమాట గుజ్జుకు కాసింత పెరుగు కలిపి ఆ మిశ్రమాన్ని ఒంటికి పట్టించాలి. ఇలా చేయడం వల్ల చర్మం పొడిగా మారడం తగ్గుతుంది. చర్మంపై గాయాలు, వాటి తాలూకు మచ్చలు కూడా తగ్గిపోతాయి.
చర్మం తాజాగా మారడానికి, ముఖ సౌందర్యం పెంచుకోడానికి కూడా క్యారెట్ బాగా పని చేస్తుంది. క్యారెట్ జ్యూస్, పెరుగు, ఎగ్ వైట్ లను సమపాళ్లలో కలుపుకుని..ఆ మిశ్రమాన్ని ముఖానికి రాసుకోవాలి. 15 నిమిషాలు ఉంచుకుని గోరువెచ్చని నీళ్లతో కడిగేయాలి. ఇలా చేస్తే చర్మంపై ఉండే డెడ్ స్కిన్ సెల్స్ తొలగిపోతాయి. చర్మం ఫ్రెష్ అవుతుంది. ఆయిలీ స్కిన్ ఉన్నవారికి సైతం క్యారెట్లతో చాలా ప్రయోజనం కలుగుతుంది. ఒక కప్పు క్యారెట్ జ్యూస్ లో ఒక్కో టేబులు స్పూన్ పెరుగు, శెనగ పిండి, నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు ప్యాక్‌గా వేసుకోవాలి. ఓ అరగంట తరువాత గోరువెచ్చని నీటితో కడిగితే..ఆయిలీ స్కిన్ నుంచి విముక్తి పొందవచ్చు.
ఇక మాయిశ్చరైజర్స్‌ను వాడేవారు చర్మం పొడిగా ఉన్నప్పుడు కాకుండా తేమగా ఉన్నప్పుడు రాయడం వల్ల అధిక లాభాలు ఉంటాయి. ముఖ్యంగా చర్మం పొడిగా మారదు. ఈ కాలంలో వారానికి ఓ సారి నువ్వుల నూనెతో మర్దనా చేయడం కూడా మంచిది. ఇలా చేయడం వల్ల చర్మం పొడిబారదు. ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో తేనె, నిమ్మరసం కలిపి తాగాలి. ఇలా చేయడం వల్ల శరీరంలోని వ్యర్థాలన్నీ బయటికి వెళ్లిపోతాయి.