క్యాప్సికంను తరచూ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల మనకు అనేక లాభాలు కలుగుతాయి. మిరపకాయలు కారం ఉంటాయని, తినలేని వారు క్యాప్సికం తినవచ్చు. దీంతో మిరపకాయల ద్వారా కలిగే లాభాలు వీటితోనూ కలుగుతాయి. ప్రస్తుతం మనకు మార్కెట్‌లో 3 రకాల క్యాప్సికం వెరైటీలు లభిస్తున్నాయి. ఆకుపచ్చ, పసుపు, ఎరుపు రంగుల్లో క్యాప్సికం లభిస్తుంది. ఆకుపచ్చ రంగు క్యాప్సికం మిగిలిన రెండింటి కన్నా తక్కువ ధరకే లభిస్తుంది.
క్యాప్సికంలో క్యాప్సెయిసిన్ అనబడే సమ్మేళనం ఉంటుంది. ఇది మన శరీర మెటబాలిజంను పెంచుతుంది. వీటిలో ఫ్యాట్ తక్కువగా ఉంటుంది. 100 గ్రాముల క్యాప్సికంలో 4.64 గ్రాముల కార్బొహైడ్రేట్లు, 1.8 గ్రాముల డైటరీ ఫైబర్ ఉంటాయి. అందువల్ల క్యాప్సికం జీర్ణవ్యవస్థకు ఎంతగానో మేలు చేస్తుంది. దీంతో అధిక బరువు తగ్గవచ్చు.
క్యాప్సికంలో విటమిన్ సి కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది యాంటీ ఆక్సిడెంట్‌లా పనిచేస్తుంది. శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. కొల్లాజెన్ తయారు అయ్యేందుకు కూడా విటమిన్ సి దోహదపడుతుంది. కొల్లాజెన్ వల్ల చర్మం, వెంట్రుకలు ఆరోగ్యంగా ఉంటాయి. జుట్టు దృఢంగా, ఒత్తుగా పెరుగుతుంది. విటమిన్ సి లోపిస్తే వెంట్రుకలు చిట్లిపోతాయి. అందువల్ల క్యాప్సికంను తినడం ద్వారా విటమిన్ సిని పొందవచ్చు.
క్యాప్సికంలో విటమిన్ ఇ, కెలు ఉంటాయి. ఇవి చర్మాన్ని సంరక్షిస్తాయి. మెటబాలిజం సరిగ్గా ఉండేలా చేస్తాయి. విటమిన్ కె వల్ల గాయాలు అయినప్పుడు రక్తం త్వరగా గడ్డకడుతుంది. అందువల్ల క్యాప్సికం తింటే ఈ విటమిన్లను పొందవచ్చు. క్యాప్సికంలో విటమిన్ ఎ కూడా పుష్కలంగానే ఉంటుంది. ఇది కంటి సమస్యలను తగ్గిస్తుంది. కంటి చూపును మెరుగు పరుస్తుంది.
థయామిన్ (బి1), రైబోఫ్లేవిన్ (బి2), నియాసిన్ (బి3), పాంటోథెనిక్ యాసిడ్ (బి5), విటమిన్ బి6, ఫొలేట్ (బి9) వంటి ఎన్నో పోషకాలు క్యాప్సికం ద్వారా మనకు లభిస్తాయి. ఇవి గ్యాస్, అసిడిటీ, హైబీపీ సమస్యలను తగ్గిస్తాయి. గుండె సమస్యలు రాకుండా చూస్తాయి.