మహానంది లో జలమే ఒక విశేషం. శుద్ధ స్ఫటిక వర్ణంలో కనిపించే జలం జలజలా ప్రవహించే దృశ్యం మహానంది క్షేత్రానికి మాత్రమె సొంతం. ఇక్కడి కోనేర్లు (పుష్కరిణిలు) విశ్వబ్రాహ్మణ శిల్పుల యొక్క అత్యద్భుత పనితనాన్ని తెలియజేస్తాయి.
ప్రధాన ఆలయానికి రాజ గోపురానికి మధ్యలో ఉన్న పుష్కరిణి లోనికి స్వచ్చమైన నీరు సర్వ వేళలా గోముఖ శిల నుంచి ధారావాహకంగా వస్తుంటుంది. ప్రధాన ఆలయంలోని లింగం క్రింద భూమిలో ఐదు నీటి ఊటలు ఉన్నాయి.
లింగము క్రింద నుండి సదా నీరు ఊరుతూనే వుంటుంది. ఆ నీరు పుష్కరిణిలోనే బయటకు కనిపిస్తుంది. అందులోనికి వచ్చిన నీరు గోపురం ముందున్న రెండు గుండాల ద్వార బయటకు పారుతుంది. ఈ నీరు బయటకు ప్రవహించే మార్గల అమరిక వలన పుష్కరిణిలో నీరు ఎల్లప్పుడు ఒకే స్థాయిలో (1.7 మీటర్లు) నిర్మలంగా, పరిశుభ్రంగా ఉంటుంది.
ఈ నీరు ఎంత స్వచ్ఛంగా వుంటుందంటే నీటిపై కదలిక లేకుంటే నీరున్నట్టే తెలియదు. ఐదున్నర అడుగులు లోతున్నా క్రిందనున్న రూపాయి బిళ్ల చాల స్పష్టంగా కనబడుతుంది. ఆలయ ఆవరణంలో కొన్ని బావులున్నాయి.
ఆ బావులు అన్నింటిలోను ఇలాంటి నీరే వున్నది. ఈ నీటిని తీర్ధంగా భక్తులు తీసుకెళతారు. మరో గొప్ప విశేషం. ఈ మహనంది క్షేత్రంలో ఊరే ఊట నీరు సుమారు 3000 ఏకరాలకు సాగు నీరు అందజేస్తోంది. ఇచ్చట బ్రహ్మ, విష్ణు, రుద్ర గుండాలు కోనేర్ల రూపంలో ఉన్నాయి.