సీజన్లు మారినప్పుడు ఎవరైనా సరే సహజంగానే పలు అనారోగ్య సమస్యలు ఎదుర్కుంటారు. సీజన్లో మార్పులు వచ్చినపుడు ఎక్కువగా వైరస్ లు ప్రభలుతుంటాయి. రోగ నిరోధక శక్తి కొంత బలహీనం అవడం వల్ల కూడా ఇలా జరుగుతుంటుంది. దీంతో మన శరీరంపై అనేక సూక్ష్మ జీవులు దాడి చేస్తాయి. ఇన్‌ఫెక్షన్లు, వ్యాధులను కలిగిస్తాయి. ప్రస్తుతం ప్రపంచంలో దాదాపు 200 రకాల వైరస్‌లు ఉండగా వాటిలో ఒకటి కరోనా వైరస్. ఈ వైరస్ సోకినవారిలో రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉండేవారు దీన్ని జయిస్తున్నారు.
మరి రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలంటే ఎలాంటి ఆహారం తినాలి, ఏం తాగాలి అన్న అంశంపై ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు జరిగాయి. తద్వారా క్లినికల్ న్యూట్రిషనిస్ట్ లు ఓ లిస్టు రెడీ చేశారు. ఆ లిస్టులో ఉన్న వాటిని ప్రతి రోజు తింటే కరోనా వైరస్ సోకినా బాడీలోని ఇమ్యూనిటీ పవర్ దాన్ని ఎదిరించగలదని చెబుతున్నారు. అందుకే ఈ వైరస్ సోకిన ప్రతి 100 మందిలో 98 మంది వైరస్‌ని జయిస్తున్నారు. దానికి కారణం పోషకవిలువలున్న ఫుడ్ తీసుకోవడమే. అందుకు గాను కొన్ని రకాల పండ్లు దోహదం చేస్తాయి.
ప్రకృతి పరంగా లభించే పండ్లు, కూరగాయలను తీసుకోవడంతో మనిషి ఆరోగ్యంగా ఉంటాడు. శరీరానికి కావలసిన పోషకపదార్థాలు పండ్లు, కూరగాయల్లో ఉంటాయనడంలో సందేహం లేదు. అనారోగ్యంగా ఉండేవారికి, ఆరోగ్యంగా ఉండే వారికి పండ్లు టానిక్‌లా ఉపయోగపడతాయి. మనిషి ఆయుష్యును పెంచుతాయి. మరి అవేమిటో తెలుసుకుందాం.
దానిమ్మ శరీరంలోని సహజసిద్దమైన రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. దానిమ్మ గింజలు, దానిమ్మ గింజల రసం గుండెకు మంచి టానిక్ లాంటిది. ఇది గుండెకు మాత్రమే కాకుండా కాలేయం ,మూత్రపిండాల ఆరోగ్యానికి కూడా ఉపయోగపడుతుంది. దానిమ్మను తరుచు తీసుకోవడం వలన రక్త నాళాలు శుభ్రపడి రక్త ప్రసరణ సాఫీగా జరుగుతుంది. దానిమ్మ పండ్లను తినడం వల్ల క్యాన్సర్ రాకుండా అడ్డుకోవచ్చు. రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ఈ పండ్లలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని సంరక్షిస్తాయి. దానిమ్మ పండ్లను నేరుగా తినవచ్చు. లేదా జ్యూస్ చేసుకుని తాగవచ్చు. దానిమ్మ పువ్వులు దంతాలకు మేలు చేస్తాయి.
సీజన్ తో సంబంధం లేకుండా ప్రతీ సీజన్ లో ఇష్టపడుతుంటారు. ఇవి ఎంతో రుచిగా ఉండడమే కాదు మన శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తాయి. ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ప్రతీ రోజు ఒక గ్లాసు ఆరెంజ్ జ్యూస్ తీసుకుంటే సంపూర్ణ ఆరోగ్యం మీ సొంతం అవుతుంది అని పోషకాహార నిపుణులు అంటున్నారు. ఆరెంజ్ తింటే కేవలం విటమిన్ ‘సి’తో పాటు ఎన్నో పోషకాలు లభిస్తాయి. నారింజలో యాంటీ ఆక్సిడెంట్ బీటా కెరోటిన్ ఉంటుంది. ఇది ఎముకలు, దంతాల దృఢత్వానికి ఎంతగానో తోడ్పడుతుంది. కాబట్టి నారింజ పండ్లను తరచూ తినాలి.
కివీ పండుతో రక్తంలోని ప్లేట్‌లెట్ల సంఖ్య పెరుగుతుంది. ఈ పండులో ఉండే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్స్ రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఈ పండు పలు అనారోగ్యాలకు కూడా సూపర్ మెడిసిన్‌గా పనిచేస్తుంది. మధుమేహం, గుండె జబ్బులు, నిద్రలేమితో బాధపడేవారికి కివీ పండు దివ్యౌషదంగా పనిచేస్తుంది. విటమిన్ సి, పొటాషియం, విటమిన్ ఇ, కె, యాంటీ ఆక్సిడెంట్లు, ఫోలేట్, ఫైబర్ అధికంగా ఉంటాయి. అందువల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. జీర్ణక్రియ మెరుగు పడుతుంది. ఇన్‌ఫెక్షన్లు రాకుండా చేస్తుంది.
రోజూ ఒక యాపిల్ పండును తింటే డాక్టర్ వద్దకు వెళ్లాల్సిన అవసరమే రాదని నిపుణులు చెబుతారు. మనకు అందుబాటులో ఉన్న అనేక రకాల పండ్లన్నింటిలో కంటే ఎక్కువ పోషకాలు యాపిల్ లోనే ఉన్నాయి. వీటిల్లో ఫైబర్, విటమిన్ సి, విటమిన్ బి, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. దీంతో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. జీర్ణశక్తి పెరుగుతుంది. చర్మం మెరుస్తుంది. అందుకనే యాపిల్ పండ్లను తినడం వల్ల పలు అనారోగ్య సమస్యలకు స్వస్తి చెప్పవచ్చు అంటున్నారు నిపుణులు.
రుచికి, బత్తాయిలు కొంతవరకు నారింజ పండు రుచిని పోలి ఉంటాయి. బత్తాయి పండులో విటమిన్లు పుష్కలంగా ఉంటాయి, ముఖ్యంగా విటమిన్ B9 మరియు విటమిన్ సి లు సమృద్ధిగా ఉంటాయి. బత్తాయిలోని విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచుటకు సహాయపడుతుంది. బత్తాయి లోని రసాయనాలు జీర్ణశక్తిని మెరుగుపరుస్తాయి. శరీరంలోని విషపదార్థాలను బయటకు పంపడంలో సమర్థంగా పనిచేస్తుంది. బత్తాయి రసాన్ని తరచుగా తీసుకుంటే చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి ఉపయోగపడుతుంది. అందుకే వీటిని కూడా తరచూ తీసుకోవాలి.
ఇక రోగ నిరోధక శక్తి పెరిగేందుకు ఈ పండ్లు తినడం మాత్రమే కాకుండా టమాటాలు, క్యారెట్, బీట్‌రూట్, పాలకూర, క్యాబేజీ, కాలీఫ్లవర్, బ్రకోలీ, వంకాయ, కాప్సికం వంటివి తినాలి. పైనాపిల్, బొప్పాయి, జామకాయ, బెర్రీ పండ్లు తినడం మంచిది. రాత్రి నీటిలో నానబెట్టిన బాదం పప్పులు, వాల్‌నట్స్ ఉదయాన్నే తీసుకోవాలి. గ్రీన్ టీ, లెమన్ టీ, అల్లం టీ, పసుపు టీ మంచివి. అలాగే మంచినీరు, కొబ్బరి నీళ్లు, గ్రీన్ టీ, ఇంట్లో తయారు చేసుకున్న ఫ్రూట్ జ్యూస్‌లు, పాలు, మజ్జిగ వంటివి కలిపి రోజూ రెండున్నర నుంచి 3 లీటర్ల వరకు ద్రవాలు తీసుకోవాలని క్లినికల్ న్యూట్రిషనిస్ట్ లు సూచిస్తున్నారు. ఈ ఫుడ్ మీ డైట్‌లో చేర్చుకుంటే… కరోనా వైరస్ తో పోరాడే బలం మీ సొంతమవుతుందని అంటున్నారు.