Home People This Guy’s Detailed Analysis On RGV Is Proof That He Is A...

This Guy’s Detailed Analysis On RGV Is Proof That He Is A Philosopher More Than A Filmmaker

0

రామ్ గోపాల్ వర్మ
దర్శకుడా ? దార్శనికుడా ?

– Written By ప్రవీణ్ యజ్జల

ఈ అందమైన ప్రకృతిలో అర్థం కానీ ఎన్నో విషయాలు ఉన్నాయి. వాటిని తెలుసుకోడానికి ఈ భూమి ఆవిర్భావం మొదల్కొని ఇప్పటి వరకూ అనేక ప్రయోగాలు, పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. ఎన్ని చిక్కులు చేదించినా, ఎన్నో లెక్కకందని వింతలూ, విడ్ఢూరాలు బయటపడుతూనే ఉన్నాయి. అసలు అర్థమవ్వడమంటే ఏమిటి.? అసలు ఏదైనా మనకు ఎందుకు అర్థం కావాలి.? అర్థమైన వెంటనే దాని మీద ఆధిపత్యం చెలాయించడానికా.? మేం సాధించామని ప్రపంచ దేశాల డబ్బాలు కొట్టుకోవడానికా.? అంతులేని ఈ భూమ్యాకాశాలు, సూర్యచంద్రులు, సముద్రాలు, అడవులు, అనేక జీవరాశుల ముందు మానవ మేధస్సు ఏ పాటికి సరిపోతుంది.? అమ్మో నేను ఎక్కడెక్కడికో వెళ్ళిపోతున్నాను గానీ రామ్ గోపాల్ వర్మ దగ్గరకి వచ్చేద్దాం.!

ఈయనేమీ తక్కువ కాదండోయ్! ప్రకృతిలో ఉన్న రహాస్యాలు తెలియకపోతే మనకంత సీన్ లేదని ఊరుకోవచ్చు. కానీ మనలానే ఉన్న మనిషి మనకంటే భిన్నంగా జీవిస్తున్నాడంటే, ముద్దగొంతు దిగుతుందా.? దిగినా అది బతుకునిస్తుంది గానీ, జీవితాన్నిస్తుందా.? ‘‘ఏదీ తనంట తాను నీదరికి రాదు శోధించి సాధించాలి అదియే ధీర గుణం కలకానిది విలువైనది బతుకు కన్నీటి దారలకే బలిచేయకు’’.( శ్రీ శ్రీ. గేయం. వెలుగు నీడలు సినిమా 1961లో విడుదల) ఈ పాట చక్కటి ఉదాహరణ. కృషిలో కసిని కలిపి దించకుండా గడగడా తాగితేనే బతుకు కొంచమైనా జీవితంగా మారుతుంది. కానీ మనుషుల్లో ఉన్న బద్దకం వల్ల అర్థంకాలేదు; చెయ్యలేను అని చెప్పడం ఎక్కువగా జరుగుతుంది. దానికి దన్నుగా కొన్ని నిందలు వెయ్యడం ఇంకా ఆ బద్దకానికి సహజత్వాన్ని తెస్తుంది. ఇదే రామ్ గోపాల్ వర్మ మీదపడి మనం చేసేది.

వర్మ అసలు మనకు ఎందుకు అర్థం కావాలి.? అనే ప్రశ్నకు జవాబు వెతకడానికి ఏ మనిషైనా, ఎప్పుడైనా ఆలోచించే ప్రయత్నం చేశారా.? మనలో ఉన్న అవసరాలు, కోరికలు ఎదుట వ్యక్తులతో ప్రేమగా, స్నేహంగా ఉండేలా మనిషిని తయారు చేస్తాయని మానవజాతి ఎప్పుడైనా గమనించిందా.? ఇది కేవలం ప్రేమల్లో, స్నేహాల్లోనే కాదండోయ్! బంధువుల్లో చివరికి తల్లిదండ్రుల ప్రేమలో కూడా నక్కి, నక్కి దాక్కుంటుందంటే ఒప్పుకోలేని మేకవన్నె పులులు మన మధ్యే ఉన్నారు. ఇదేమీ తప్పు కాదు. తల్లిదండ్రులు పిల్లల్ని పెంచినందుకు పిల్లలు వాళ్ళని చూసుకోవడం అనేది భారతీయ కుటుంబ వ్యవస్థలో ఒక భాగంగా అనాదిగా వస్తున్నదే.! అది కూడా గమనించకుండా వాదించే ప్రోగ్రామింగ్ మరబొమ్మలు నిండుగా ఉన్న సమాజంలో ఉన్నాం.!

ఏదైనా కష్టం వస్తే వెంటనే ఆ కష్టం తీర్చే మనిషి మనకు గుర్తుకొస్తాడు. వెంటనే వెళ్ళి ఆ కష్టం అతనికి చెప్పుకున్నాకా ఆ కష్టం తీర్చితే మంచోడు. తీర్చకపోతే చెడ్డోడు. ఇదే మనకు అర్థమైన అర్థం. మనకు అర్థంకాని, తెలియని విషయాల్ని ఎవరైనా, ఎప్పుడైనా చెబుతుంటే, లేక పాటిస్తుంటే మన దృష్టిలో అతనొక పిచ్చోడని గుడ్డిగా నమ్మేస్తాం. అసలు ప్రతి పుర్రెల్లో మెదడు ఉంటాదనుకోవడం, ఉన్నది పనిచేస్తుందను కోవడం పెద్ద పొరపాటు. దీనికి కారణం మనకు అంతా తెలుసు మనకి తెలియనిది ఈ భూమ్మీద ఉండడానికి ఛాన్సే లేదని బలంగా నమ్మేయడమే! ఆ గుడ్డితనానికి పునాది. ఇలాంటి పునాది మీదనే సమాజం మొత్తం నిర్మించబడింది. ఇందులో పెద్దలు, చిన్నలు, ఆడలు, మగలు అనే భేదం ఉండదు. అందరూ సర్వమంగళ సంతతే.! అక్కడక్కడ వర్మలా మ్యాగ్నెటిక్ లాంటి ఆకర్షితులు తగులుతుంటారు. ఉక్కులా ప్రశ్నాత్మక భావాలతో ఉన్నవారు, అలాంటివారి ఆలోచనల్ని పట్టుకోగల్గుతారు. సత్తులా ఎలా పడితే అలా వంగేవాళ్ళు ఖచ్ఛితమైన నిర్మాణాత్మక జీవన శైలికి పనికిరారు.

మనం మన వ్యక్తిగత స్వార్థాలతో ఎదుటి వ్యక్తిని గుర్తించినప్పుడు మన స్వార్థం ఆ వ్యక్తికి అర్థమైనప్పుడు అతను ఎందుకు స్పందించాలి.? మన చేతకానితనంతో ఎంత మొరిగితే ఏం లాభం.? మనల్ని చూసి నలుగురూ నవ్వుకోవడం తప్పితే ఫలితం ఉండదు. ఈ వ్యక్తిగత స్వార్థాలు, ప్రేమలు, కుళ్ళులు, స్నేహాలు, బంధాలు ఎరిగినవాడు కనుకనే మన చేష్టలు చూసి మౌనమునిలా ముసి, ముసి నవ్వులు నవ్వుకుంటుంటాడు వర్మ. ఆయన మౌనం వెనకాల ఇంత నిగూఢమైన లాజికల్ థింకింగ్ దాగి ఉంది. అదేమిటీ! స్వార్థంగా ఉండాలని ఆయనే చెబుతాడు కదా.? అని మనకు అనుమానం రావచ్చు.? ఆయన చెప్పే స్వార్థంలో నిజాయితీ ఉంటుంది. మనకర్థమైన స్వార్థంలో మోసం ఉంటుంది. అలాంటి మోసగాళ్ళని ఆయన ప్రోత్సహించడు. ఇలాంటి వాళ్ళు సమాజానికి కూడా చాలా హానికరం.! మనలో ఉన్న నిజాయితితోనే అయన ఎట్రాక్ట్ చేసుకోవాలి తప్పితే; మస్కాకొట్టి పని ముగిద్దామనుకుంటే? ఆయన మనకు చిక్కడు-దొరకడు. దానితో పాటు మన మస్కా విషయం ఆయనకు అర్థమైన ఉత్తర క్షణం నుండి తనదైన స్క్రీన్ ప్లే తో మన మాయా ముసుగును మసి చేసి నిలువెత్తు నిజాయితీని పరిచయం చేస్తాడు. ఇదంతా మన మాయోపాయం ఆయనకు నచ్చితే జరుగుతుంది. లేకపోతే పట్టించుకోడు. పాముకు సైతం పాలని చెప్పి నీళ్ళు పోసి పెంచుకునే అంత ఉభయచర ముదురుజీవి ఆర్జీవి.! అతను అనుకుంటే ఏదైనా చెయ్యగలడు. ఎక్కడి వరకైనా వెళ్ళగలడు. ఇదంతా ప్రపంచం అతనికి అర్థమైన దాని నుండి సాధ్యపడుతుంది. మనకెందుకు సాధ్యపడడం లేదని మనకనిపిస్తే మనకు ప్రపంచం ఇంకా అర్థం కావలసింది మిగిలే ఉందని దాని అర్థం.!

అసలు స్వార్థమంటేనే తప్పు. మళ్ళీ అందులో నిజాయితీ, మోసం ఉంటాయా? అని మనకు అనిపించవచ్చు. నిజాయితితో కూడుకున్న స్వార్థంలో మన ఎదుగుదల ఉంటుంది. మోసంతో కూడుకున్న స్వార్థంలో ఎదుట వ్యక్తుల్ని తొక్కెయ్యడం ఉంటుంది. నీ ఎదుగుదలకు నువ్వు కృషి చెయ్యాలి తప్పితే, పక్కవాణ్ణి తొక్కేసి వాడి కష్టం దొబ్బేసి ఎదగకూడదు. అలా చేస్తే పాపం – ఇలా చేస్తే పుణ్యం అని నేనేమీ చెప్పబోవడం లేదు. కానీ మనిషికి శ్వాస తీసుకోవడం ఎంత అవసరమో.? ప్రతి పనిలో నిజాయితీగా ఉండడమనేది కూడా అంతే అవసరం.! నిజాయితీని శ్వాసగా తీసుకుంటూ జీవిస్తుంటాడు కనుకనే సత్యానికీ, నిజానికి తేడా తెలియని వాళ్ళకు వర్మ ఒక కొరకరాని కొయ్యలా కనిపిస్తాడు. లేదు మాకు అర్థమైపోయాడు; మేము నిజాయితీపరులమే అని మనల్ని మనం మోసం చేసుకొని వర్మతో ప్రయాణం మొదలు పెట్టామనుకోండి అతని మీద విపరీతమైన కోపం పెరిగిపోయి ఎంత ఖర్ఛైనా పర్లేదు అతన్ని చంపెయ్యాలంనంత బీపీ వస్తుంది. ఎందుకంటే వర్మ ఒక విషయంలో ఇలా స్పందించాడు కాబట్టి, మన విషయంలో ఇలా ప్రవర్తిస్తాడనుకుంటే? దానికి వందరెట్లు వ్యతిరేకంగా ఆయన అభిప్రాయం ఉండవచ్చు. అదేమిటీ మన అంచనాలు తలకిందులయ్యాయని తలపీక్కొవడం తప్పితే వేరే ఆలోచనే రాదు. ఇక్కడ బాగా గమనించాల్సింది ఏమిటంటే ‘అర్థమవ్వడం అంటే మనం ఊహించినట్లు ఎదుటవారి ప్రవర్తన ఉండడం కాదు’. మన భ్రమలకి కారణం అర్థమవ్వడం కాదు. మనకు అర్థమవ్వకపోవడమేమిటీ? అన్నీ అర్థమౌతాయి. ఇంత చదువుకున్నాం! ఇంత వయస్సు వచ్చింది! మాకు అర్థమవ్వవా? అని, అనిపించే నీలో దాగి ఉన్న ‘ఇగో’ కల్పించిన భ్రమ తప్పితే, అది అర్థమవ్వడం కాదు.

అందుకనే వర్మ మనతో మాట్లాడుతున్నప్పుడు ఆ వ్యక్తి తాలూక ఐక్యూని దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతుంటాడు. అయినా మనకు వర్మ అర్థమవ్వకపోతే ఆయనేమి చెయ్యగలడు. ఇప్పటి వరకూ ఆయన ఐడియాలజీ మనకు అర్థమవ్వాలని ‘రామూఇజం’ పేరుతో అనేక ఎపిషోడ్స్ లో మాట్లాడాడు. అంత తెలివైన వాడు మనకోసం ఎందుకింత టైమ్ వేస్టు చేశాడబ్బా.? అని మనకు సందేహం రావచ్చు. కానీ రామ్ గోపాల్ వర్మ తను చనిపోయాక తనని సినిమా దర్శకుడిగా కన్నా; ఒక థింకర్ గా ప్రజలు గుర్తుపెట్టుకోవలని నిర్ణయించుకున్నాడు. అందుకనే రాముఇజంలో అన్ని విషయాల మీద మాట్లాడాడు. అందుకనే అనేక సంఘటనల మీద స్పందిస్తుంటాడు. సినిమా దర్శకుడుగా ఏ గొట్టంగాడైనా అయిపోవచ్చు, కానీ థింకర్ అనే గుర్తింపు రావడం అంటే సినిమా దర్శకుడైనంత ఈజీ మాత్రం కాదు. వర్మ థింకర్ లా గుర్తించబడటం ఇష్టపడుతున్నాడు కనుకనే అంత టైమ్ మనకి వెచ్చించాడు. ఏ మాత్రం బుర్ర, బుద్ది ఉన్న ఏ మనిషైనా ఆయన్ని థింకర్ గానే గుర్తిస్తారు. ఎందుకంటే ఆయన ప్రతీ సినిమా ఒక ప్రయోగమే, ఒక్క సినిమా కూడా టైమ్ పాస్ కి తీసిన సినిమాలుగా ఉండవు. ప్రతీ దానిలో ఒక మానసిక సంఘర్షణన, విప్లవాత్మకమైన మార్పులు, టెక్నాలజీ ఇలా ఎన్నో విషయాలు ఆయన సినిమాల్లో దాక్కొని ఉంటాయి. థింకర్ గా గుర్తించబడాలని ఆయనేమి ప్రత్యేకంగా చేసిందేమి లేదు. ఆయన చేసే పనిని కాస్త వివరంగా మనకు అర్థమయ్యే విధంగా చెబుతున్నాడు. ఎందుకంటే ప్రేక్షకులే అంతిమం కాబట్టి. అంతే, అంతకు మించి మోసాలేమీ చెయ్యడం లేదు మనం నమ్మే మనం పూజించే బాబాల్లాగ!.

రామ్ గోపాల్ వర్మకి ఎమోషన్స్ చాలా కంట్రోల్లో ఉంటాయి. అందువల్ల మనం అతన్ని మన మాటలతో గాయపరచలేము. కానీ అతనొక మాటంటే మాత్రం మనకు నిలువెల్లా గాయాలైపోతాయి. అసలు మనిషిలో మెదడనే ఒక ఇంజన్ ఉందనీ దానికి చక్రాలుగా ఎమోషన్స్ తిరుగుతుంటాయని మనలో ఎంతమంది గమనించారు? మనలో జరిగే విషయాల మీదనే మనకు స్పష్టత లేనప్పుడు ఎదుటివారు ఎలా అర్థమౌతారు? అందులో వర్మను అర్థం చేసుకోవాలంటే ఇంజనూ, చక్రాలు కాదు. ఆ వాహనం స్కెచ్ దగ్గర్నుండి రావాలి. తరువాత మనకు సొంతంగా కొన్ని స్కెచ్చులు వేయడం రావాలి. అప్పుడు వర్మలాంటి థింకర్స్ అర్థమౌతారు.

ఎప్పుడైతే వర్మ అర్థమౌతాడో అప్పుడు నువ్వే వర్మవి. నీలో ఉన్న శక్తి తెలియనంత వరకూ నీకు ప్రతీది కొండలా కనిపిస్తుంది. తెలుసుకున్న తరువాత నువ్వు అందరికీ కొండలా కనిపిస్తావు. అది తెలియని మందబుద్ధులు నేల మీద నుంచోని కొండమీదకి ఉమ్మేద్దామని ప్రయత్నిస్తుంటారు. ఎంత ఉమ్మినా, వేసేవాడు ఇంకిపోవాలి తప్ప, కొండకు ఏ మాత్రం అంటదు. అలానే వర్మ గురించి మనం మాట్లాడే మాటలు కూడా వర్మని అంటవు.
వర్మ ఎందుకు అర్థమవ్వడో ఇప్పటి వరకూ చెప్పాననుకొని మరో కోణంలో కూడా ఆ భ్రమను కొనసాగిస్తాను. ‘అసలు ఒక మనిషి అర్థమవ్వడమంటే? ఆ మనిషి ఏం చేసినా చూసి, విని, చిరునవ్వుతో ప్రేమతో స్వాగతించగలగాలి. అది అర్థమవ్వడమంటే’. అదేమిటీ తప్పు చేసినా తప్పని చెప్పకూడదా అని మనకనిపించవచ్చు.? కానీ, మనకెవ్వరు చెప్పారు అది తప్పని? ఇది ఒప్పని?. తల్లిదండ్రులా, గురువులా, దేవుళ్ళా, ఆధ్యాత్మిక గ్రంథాలా, కులాలా, మతాలా, ప్రాంతాలా ఈ వరసలో మనం ఎక్కడ చిక్కుకు చిదిగిపోతున్నామో గమనించాలి. ఆ బానిస లంకెలు మొత్తాన్ని విదిలించుకున్న తరువాతే థింకర్స్ అర్థమౌతారు. ఆ లంకెల్లో మనం ఒక్కటేగా అని ఒక్కటి మిగిల్చుకున్నా వర్మ మనకు సంపూర్ణంగా అర్థమయ్యే అవకాశం కోల్పోతాము. అసలు ఎవడెహే ఈ వర్మ.? వీడు అర్థమవ్వడం జనాలకి అంత అవసరమా.? వీడేమైనా దేవుడా? అన్నంత చిరాకు వస్తుందా.? ఇదంతా చదువుతుంటే.! నిజంగా మీకు చిరాకువస్తే ఈ వ్యాసం మీ కోసం రాసింది కాదు. అరక్షణం కూడా ఆలోచించకుండా చింపేయండి. ఏదైనా ఒక విషయం అర్థమవ్వడమంటే ఏమనుకుంటున్నారు? ప్రపంచమంతా తల్లకిందులైనా మనకున్న స్పష్టతతో మనం మనలానే ముందుకు దూసుకుపోవాలి.
ఇలా ఎంతో మందిని లెక్క పెట్టక తన ప్రపంచంలో తాను జీవిస్తూ అనేక సోషల్ సంఘటనల మీద స్పందిస్తూ తన జీవన నావకి జననం తప్ప మరణం లేనే…లేదని! జన సముద్రాన్ని చీల్చుకుంటూ దూసుకుపోతున్న దార్శనికుడు వర్మ.! అలాంటి వర్మ అర్థమవ్వడమంటే ఏమనుకుంటున్నారు.? అసలు వర్మ అర్థమవ్వడమంటే జీవితమాధుర్యం అర్థమవ్వడం; వర్మ అర్థమవ్వడమంటే మానవ సంబంధాలు అర్థమవ్వడం; వర్మ అర్థమవ్వడమంటే ప్రకృతి రహాస్యాలు అర్థమవ్వడం; వర్మ అర్థమవ్వడమంటే మానవజీవిత స్వేచ్ఛ అర్థమవ్వడం. ఇవన్ని మాకు అర్థమౌతున్నాయిగా అని మనం అనుకుంటే మనల్ని ఇక వర్మ కూడా రక్షించలేడు. అన్నీ అర్థమైపోయాయని మూఢ మేకుల్ని మెదడుల్లో దిక్కొట్టుకొని బతుకు పెట్టే పరిక్షల్లో బలైపోయి, వీడేమిట్రా ఇంత ఆనందంగా ఉన్నాడని కుళ్ళుపోయే వాళ్ళకి ప్రతీ దానికి మనోభావాలు దెబ్బతింటూనే ఉంటాయి.‘‘మెచ్చనంటా వీవు;/ నీ విక మెచ్చకుంటే మించి పాయెను/ కొయ్య బొమ్మలె మెచ్చు కళ్ళకు/ కోమలులు సౌరెక్కునా?’’ (గురజాడ అప్పారావు. ముత్యాల సరములు: గురజాడ అప్పారావుగారి రచనలు.)

ఇలాంటి వాళ్ళు వర్మని వేలెత్తి చూపిస్తూ దేశం పట్టని మేధావుల్లా ప్రజల బుర్రల్ని భోమ్చేస్తుంటారు. కానీ వర్మ తన్ని విమర్శించే వాళ్ళ మానసిక స్థితిని స్టడీ చేసి, దానికి రెండింతలు డోస్ పెంచి తరువాత, తరువాత విషయాల మీద స్పందిస్తుంటాడు. ఇక్కడ నిజం ఏమిటంటే ఈ బుద్ధి తక్కువ మనోభావాలు కలిగిన వాళ్ళంతా వర్మ చేసుకొనే పబ్లిసిటీలో సామాగ్రిగా పనికొస్తారు తప్పా వీళ్ళు చేసేది ఏమి ఉండదు. వర్మ అంటే మన బుద్దులకీ, మన గుద్దులకీ అందనివాడు. ప్రజల మనోగాయాల మీద కారం జల్లి, రెచ్చగొట్టి ఒక ఆటాడుకుంటాడు. మనకి అర్థం కావడం లేదు కనుకనే దార్శనికుడు అయ్యాడు. అర్థమైతే దర్శకుడే అయ్యుండేవాడు. లోపం వర్మది కాదు మనది.!
పైన చెప్పిన ఇనుప లంకెల ఎమోషన్స్ జీవితాన్ని చాలా భారంగా, బరువుగా మార్చేస్తుంటాయి.‘‘ఏ జ్ఞానం అయినా, అది సరిగా తెలిసేదాకా చాలా కష్టం. తెలిసిన తర్వాత చాలా తేలిక’’. (రంగనాయకమ్మ. అమ్మకి ఆదివారం లేదా.?: కథల సంపుట: ముందుమాట.పుట:6.) ఆ మూఢనమ్మకాల్ని వదిలి బతుకును జీవితంగా మార్చుకోవాలనుకున్న వాళ్ళకి వర్మ చాలా దగ్గర దారి చూపిస్తాడు. మనలో సమాజం చిన్ననాటి నుండి నూరిపోసిన భయాల్ని ప్రశ్నిస్తుంటే మనకు కొత్త శక్తి ఉత్పత్తి అవుతుంటుంది. ప్రారంభ తొలినాళ్ళలో వర్మ ప్రభావం బాగా ఉంటుంది. అలాంటి ప్రభావాలు లేకుండా తొలి అడుగులు ముందుకు పడవు. అలాగని వర్మ కాళ్ళే, మన కాళ్ళకన్నా బాగున్నాయని సొంత నడక మొదలు పెట్టకపోతే నీలో సమాజం తాలూక బానిస లక్షణాలు ఇంకా మాసిపోలేదని గుర్తించి బయటపడాలి. ‘నీ అజ్ఞానం నీకు అర్థమవ్వడమే జ్ఞానం’. అక్కడ నుండి వర్మతోపాటు ఇతరులైన ‘రంగనాయకమ్మ, ఓషో, జిడ్డు కృష్ణమూర్తి’ ఇలాంటి వారిని కూడా చదువుతూ ఒంట బట్టించుకుంటూ సరస్సులా సాగిపోతుంటే నువ్వు ఇంతకాలం ఎంత బరువును గాడిదలాగ మోసావో అర్థమౌతుంది. స్వేచ్ఛని తాకిన నీ జీవితం రంగనాయకమ్మగారు చెప్పినట్టు చాలా తెలిక పడుతుంది. నీకంటూ ఒక సొంత గుర్తింపు నీకు ఎదురొచ్చి తనని అధిరోహించమని నీ ముందు శిరస్సు వంచుతుంది. ఇంత కిక్కు, ఇంత కీర్తి ప్రపంచం మనకు అర్థమవ్వడంలో దాగి ఉందని తెలిసిన వాడిగా వర్మ మనకు ఆ దారినే చూపించే ప్రయత్నంలో దర్శకుడిగా మొదలై దార్శనికుడిగా దర్శనమిస్తుంటాడు. ఇది కేవలం బుర్రతోపాటు బుద్ధికూడా ఉన్న వాళ్ళకి మాత్రమే కనిపించే అంతర్దర్శనం.!

వర్మలో కూడా మనిషిలో ఉన్న జాఢ్యాలు అన్నీ ఉన్నాయి. కానీ వాటిన్నింటినీ ఆయన అర్థం చేసుకొని కొన్నింటిని వదిలించుకొని మరికొన్నింటిని బంధించుకొని జీవిస్తున్నాడు. ఏదేమైనా వడపోత లేకుండా మాట్లాడం అంటే ఏమిటో వర్మని చూస్తే, వింటే మనకు అర్థమౌతుంది. ‘ఉపేంద్ర సినిమా’లోని ఉపేంద్ర పాత్రలాగన్నమాట. వ్యక్తిగత స్వార్థమే మనిషికి స్వర్గమనే నినాదంతో స్వార్థపరులను ఆకర్షించాడు. కులాలకూ, మతాలకూ, కుళ్ళుకూ, స్వార్థానికి పుట్టిన బిడ్డలం మనం.! మనలో అవి ప్రవహించక భూమ్మీద కనుమరుగైపోతున్న మంచి, దానం, ప్రేమా, భూతదయా, మమత, సమత లాంటి చెడు రక్తం ఎలా ప్రవహిస్తుంది. ఈ భూమ్మీద కాలు మోపిన ప్రతీ పోటుగాడు చెప్పేది నీతులే; చేసేది బూతులే అని తోలు మందం గాళ్ళకి తోలు వలిచి చెప్పేదే వర్మ దార్శనికత. ‘నాతో సహా మనుషులందరూ వెధవలే అని చెప్పే కలియుగకల్కి వర్మ; అది అర్థం కాని వారంతా కలియుగకల్తి’.!

Exit mobile version