ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లా నారాయణవనం మండలంలో ఉంది కైలాస కోన గుహాలయం. జలపాతం. దీనికి పక్కనే 100 అడుగుల ఎత్తు నుండి జాలువారే కైలాస కోన జలపాతం ఉంటుంది. ఈ జలపాతపు నీటిలో వ్యాధినిర్మూలన శక్తి ఉందని ప్రతీతి. ఇది ఎత్తైన కొండలపై నుంచి అనేక ఔషధీయ వృక్షాల వేర్లను తాకుతూ ప్రవహిస్తూ ఉంటుంది.ఈ జలపాతంలో స్నానమాచరిస్తే పుణ్యంతోపాటు కొన్ని దీర్ఘకాలిక వ్యాధులు నయమవుతాయన్నది ప్రజల విశ్వాసం.ఈ ప్రాంతమంతా ఎత్తైన చెట్లతో పచ్చగా నిండి ఉంటుంది.
ఇది తిరుపతి నుండి సుమారు 45 కిలోమీటర్ల దూరంలోను, చిత్తూరు జిల్లా పుత్తూరు నుండి 12 కిలోమీటర్ల దూరం లోనూ ఉంది. పూర్వం పద్మావతి, వెంటేశ్వరుల కళ్యాణ మహోత్సవాన్ని వీక్షించేందుకు కైలాసం నుండి వచ్చిన పార్వతీ పరమేశ్వరులు ఇక్కడి పర్వతం యొక్క ప్రకృతి రమణీయతకు ముగ్ధులై అక్కడే కొంత కాలం ధ్యానం చేస్తూ సమయం గడిపినట్లు చెబుతారు. అందుకే ఈ కొండకు కైలాస కోన అనే పేరు వచ్చినట్లు పురాణ కధనం.
ఈ పర్వత ప్రాంతం గొప్ప ఆధ్యాత్మిక శోభతో ఆకర్షణీయంగా ఉంటుంది. కైలాస కోన గుహాలయంలో ఒక శివలింగం ఉంటుంది. శివలింగానికి ఎదురుగా నంది విగ్రహం, దాని పక్కన వీరభద్రుని ప్రతిమ ఉన్నాయి. గుహాలయంలో వీరభద్రుని విగ్రహం పక్కన ఆదిశంకరాచార్యుల శిల్పం ఉంది. పూర్వం ప్రత్యేకంగా దేవాలయాలు నిర్మించడం కంటే ముందు కొండ గుహలనే ఆలయాలుగా మలచేవారు. ఈ గుహాలయాలు ప్రాచీన సౌందర్యాన్ని ప్రతిఫలిస్తూ ముగ్ధమనోహరంగా ఉంటాయి.
పర్వత ప్రాంతమే ఒక ప్రశాంతతను, మధుర భావనను కలిగిస్తుంది. అలాంటిది చక్కటి గుహాలయం, ఆ పక్కనే మనోహరంగా ప్రవహించే జలపాతం చూడముచ్చటగా ఉంటాయి. ఆ ప్రదేశంలో అడుగు పెట్టగానే ఎంతో హాయిగా అనిపిస్తుంది.
దైనందిన జీవితంలో ఎదురయ్యే అలజడులు, ఆందోళనలు తొలగి ఊరట లభిస్తుంది. ఈ ప్రాంతంలోని ఎంతో అందమైన జలపాతాలలో ముఖ్యమైనవి తలకోన. కైలాస కోన. ఉబ్బుల మడుగు జలపాతాలు.