సీతాఫలం ఆగస్టు నుంచి అక్టోబర్ వరకూ వచ్చే ఈ ఫలాలు మనల్ని ఎంతగా నోరూరిస్తాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దక్షిణ అమెరికా, వెస్టిండీస్, ఆసియా ప్రాంతాల్లో ఎక్కువగా పెరిగే ఈ చెట్లు పెంచడానికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం కూడా ఉండదు. అందుకే మన దగ్గరి అడవుల్లో ఈ చెట్లు ఎక్కువగా పెరుగుతుంటాయి. చాలా ఎక్కువ క్యాలరీలున్న ఈ పండులో సహజసిద్దమైన చక్కెరలు ఉంటాయి. అందుకే ఇది తీపి తినాలనే కోరికను తగ్గించే మంత్రం. అంతేకాదు.. పోషకభరితమైన స్నాక్ కూడా. మరి ఈ సీతాఫలంలో ఉండే పోషకాలు. దానివల్ల మన ఆరోగ్యానికే కాదు అందానికి కూడా కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం.
సీతాఫలం చాలా రుచిగా ఉంటుంది. సమతులాహారానికి ఉదాహరణగా ఈ పండుని చెబుతారు. ఇందులో కాలరీస్, ప్రోటీన్, ఫ్యాట్, ఐరన్, మెగ్నీషియం, కాల్షియం, ఫాస్ఫరస్ వంటివన్నీ సరైన క్వాంటిటీలో ఉంటాయి. సీతాఫలంలో ఉండే ఫైబర్, మినరల్స్ వల్ల ఈ పండు అరుగుదలకి తోడ్పడుతుంది. బౌల్ మూమెంట్‌కి సహకరిస్తుంది. తద్వారా, గ్యాస్, కాన్స్టిపేషన్ వంటి సమస్యలు దూరమౌతాయి. అంతే, కాకుండా డయేరియా లాంటి సమస్యకి కూడా ఈ పండు చెక్ పెడుతుంది.
సీతాఫలం గర్భంతో ఉన్నవాళ్లకు కళ్లు తిరగడం, వాంతులు వంటివి తగ్గేలా చేస్తుంది. ఇందులోని కాపర్ గడువుకు ముందే నొప్పులు రాకుండా చేస్తుంది. అంతేకాదు రోజూ ఓ సీతాఫలం తీసుకున్నవారిలో గర్భస్థ పిండం మెదడు పెరుగుదల ఆరోగ్యంగా ఉంటుంది.
సీతాఫలం వల్ల మన శరీరంతో పాటు చర్మం, జుట్టు కూడా ఎన్నో ప్రయోజనాలు పొందుతాయి. ఎగ్జిమా, సొరియాసిస్ లాంటి చర్మ సమస్యలు ఉంటే సీతాఫలం తినడం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చు. రెగ్యులర్‌గా తగిన మోతాదులో సీతాఫలాన్ని తీసుకోవడం వల్ల మంచి ఫలితాలుంటాయి. కేవలం దీన్ని తినడం వల్లనే కాదు. ఈ చెట్టు బెరడు నుంచి వచ్చే జిగురు కూడా.. చర్మ సమస్యలను తగ్గిస్తుందట. ఈ జిగురును చర్మ సమస్యలు ఉన్న చోట పూయడం వల్ల అవి త్వరగా తగ్గిపోతాయి.
సీతాఫలంలోని విటమిన్లు, మినరల్స్ శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌తో పోరాడతాయి. చర్మాన్ని ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని యవ్వనంగా ముడతల్లేకుండా చేస్తాయి. అంతేకాదు మన చర్మంలోని కొల్లాజెన్ బంధాలు బలంగా మారేందుకు ఇది ఎంతగానో తోడ్పడుతుంది. చర్మం ఆరోగ్యంగా మెరవాలంటే మనం తీసుకునే ఆహారంలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండాలి. సీతాఫలంలో వీటితో పాటు ఎన్నో మినరల్స్ కూడా ఉంటాయి. ఇవి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంతో పాటు మొటిమలను తగ్గిస్తాయి. ఇందులోని యాంటీ ఇన్ ఫ్లమేటరీ గుణాలు చర్మరంధ్రాలను శుభ్రంగా ఉంచి ఆక్నీ, బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ వంటివి రాకుండా చేస్తాయి.
సీతాఫలం గింజల నుంచి తీసిన నూనె జుట్టును చాలా అందంగా మార్చడంతో పాటు మాయిశ్చరైజ్ కూడా చేస్తుంది. జుట్టు ఆరోగ్యంగా పెరిగేలా చేస్తుంది. అంతేకాదు సీతాఫలంలో ఎన్నో విటమిన్లు ఉంటాయి కాబట్టి దీన్ని తినడం వల్ల జుట్టు ఆరోగ్యంగా మెరుస్తుంది.
సీతాఫలంలో విటమిన్స్ సమృద్ధిగా ఉంటాయి. ఈ విటమిన్స్ వయసు మీద పడకుండా చేస్తాయి. ఈ పండులో ఉండే గుణాల వలన స్కిన్ మంచి గ్లో తో ఉంటుంది. ఈ పండు ఫ్రీ రాడికల్స్ తో పోరాడి సెల్స్ ని స్ట్రాంగ్ గా ఉంచుతుంది.