Home Unknown facts శ్రీ మహావిష్ణువు వరాహావతారాన్ని ఎత్తటానికి గల కారణాలు తెలుసా ?

శ్రీ మహావిష్ణువు వరాహావతారాన్ని ఎత్తటానికి గల కారణాలు తెలుసా ?

0

భక్త సంరాక్షణార్ధం శ్రీ మహావిష్ణువు అనేక అవతారాలు ఎత్తాడు, వాటిలో ముఖ్యమైనవి దశావతారాలని మనం కొలుచుకుంటాం. దశావతారాలలో మూడవది ఆది వరాహావతారం. శ్రీ మహావిష్ణువు వరాహావతారాన్ని ఎత్తటానికి సంబంధించిన కధని తెలుసుకుందాం.

Vishnu Murthyఒకసారి శ్రీమహావిష్ణువు దర్శనార్ధం సనక సనందాది మహా ఋషులు వైకుంఠానికి వెళ్ళారు. అక్కడ ద్వార పాలకులైన జయ విజయులు స్వామివారి దర్శనానికి అది సరైన సమయం కాదని అడ్డగిస్తారు. దానితో ఆ మహా ఋషులకి కోపం వస్తుంది. జయ విజయులని, ఏ స్వామి సాన్నిధ్యంలో వున్నామనే గర్వంతో తమని అడ్డగించారో, ఆ స్వామి సేవకి దూరమయ్యి భూలోకంలో జన్మిస్తారని శపిస్తారు.

విష్ణువు జయవిజయులతో, ‘‘మహా మునుల శాపం మీరరానిది. నా పట్ల మిత్రభావంతో ఏడు జన్మల్లో తరించి వస్తారా లేక నన్ను ద్వేషిస్తూ నాకు శత్రువులై మూడు జన్మల్లో నాచేత అంతమొంది ఇక్కడికి వస్తారా అని అడిగాడు. జయవిజయులు విష్ణు సన్నిధానాన్ని త్వరగా చేరుకోడానికి మూడు జన్మలే కోరుకున్నారు.

అప్పుడు సనకసనందనాది మునులు జయవిజయుల్ని మెచ్చుకుంటూ విష్ణువుతో కర్తవ్య నిర్వహణలో మమ్మల్ని అడ్డుకున్న నీ ద్వారపాలకులను శపించిన మా తొందరపాటుతనానికి సిగ్గు పడుతున్నాం. మమ్మల్ని మన్నించు అని చెప్పి, లక్ష్మీనారాయణులను అనేక విధాల మనసార సేవించి వెళ్ళారు. జయవిజయులు కశ్యపప్రజాపతి భార్య దితి కడువున హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడుగా పుట్టారు. అన్నదమ్ములు గొప్ప పరాక్రమవంతులై తపస్సులు చేసి బ్రహ్మను మెప్పించి గొప్ప వరాలు పొందారు. విష్ణువుపై కక్షగట్టి విజృంభించారు. హిరణ్యాక్షుడు రాక్షసులకు రాజై, విష్ణువును ఎదుర్కొని జయించడానికి కంకణం కట్టుకున్నాడు. హిరణ్యకశిపుడు విష్ణువును కవ్వించే ఘోరకృత్యాలు చేసి, భూమిని దొర్లించుకుపోయి రసాతల సముద్రంలోకి తోశాడు. భూమి రసాతలం అడుగున మునిగిపోయింది. భూదేవి విష్ణువును తలంచి తన్ను ఉద్ధరించమని మొరపెట్టుకుంది.

విష్ణువు భూదేవి మొర ఆలకించి దశావతారాల్లో మూడవది అయిన వరాహావతారాన్ని ఎత్తాడు. బ్రహ్మ హోమం చేస్తూండగా యజ్ఞగుండం నుంచి తెల్లని కాంతితో ఒక నలుసు వెలువడింది. ఆ నలుసు క్రమ క్రమంగా పెద్దదై అడవి పందిగా రూపొందింది. ఆ అడవి పందిని విష్ణువు అవతారంగా గ్రహించి బ్రహ్మాది దేవతలు యజ్ఞవరాహంగా, శ్వేత వరాహంగా, ఆదివరాహంగా కీర్తిస్తూ స్తుతించారు. యజ్ఞవరాహము అలా అలా పెరిగి, బ్రహ్మాండమైన ఆకృతి పొందింది. బలిష్ఠమైన కాళ్ళతో, ఉక్కుకవచం లాంటి పైచర్మంతో, వజ్రాల్లాంటి పొడవైన వాడి కోరకొమ్ములతో, ఎరన్రికాంతి ప్రసరించే కన్నులతో, మెడ నుంచి తోకవరకూ నిక్కబొడుచుకొని బంగారంలా మెరుస్తున్న వెంట్రుకల జూలుతో, విశ్వమంతా దద్దరిల్లేలా వరాహము హుంకార ధ్వనులు చేసింది. యజ్ఞవరాహం ముఖంపై ఖడ్గంలాంటి కొమ్ము ధగధగా మెరుస్తున్నది.

వరాహావతారం మెరుపు వేగంతో రసాతలానికి పరిగెత్తింది. ఆ వేగానికి దిక్కులు అదిరాయి, ప్రళయవాయువులు భీకరంగా వీచాయి. రసాతల సముద్రంలోకి చొచ్చుకొని వెళ్ళి, అడుగున మునిగి ఉన్న భూమిని తన కొమ్ముతో గుచ్చి యజ్ఞవరాహము మీదకు ఎత్తింది. అదే సమయంలో హిరణ్యాక్షుడు వరుణుడిపై దాడిచేసి పోరాటానికి పిలిచాడు. వీరాధి వీరుడివైన నీవు పోరాడవలసినది నాతో కాదు రసాతలం నుంచి భూమిని ఉద్ధరిస్తున్న యజ్ఞవరాహంతో అని వరుణుడు అన్నాడు.

హిరణ్యాక్షుడు హుటాహుటిని వెళ్ళి యజ్ఞ వరహావతారాన్ని ఢీకొన్నాడు. వరాహరూప విష్ణువుతో హిరణ్యాక్షుడు గొప్ప పరాక్రమంతో పోరుడుతూ గదతో విష్ణువు గదను పడగొట్టి కొంతసేపు అలాగే నిల్చున్నాడు. విష్ణువు అతని యుద్ధనీతిని మెచ్చుకొని తిరిగి గదను ధరించాక, ఇరువురికీ సంగ్రామం ఘోరంగా సాగింది. చివరకు వరాహావతారం తన కొమ్ముతో హిరణ్యాక్షుణ్ణి పొడిచి చంపింది. వరాహావతారుడైన విష్ణువును భూదేవి వరించింది. వరాహమూర్తి భూదేవిని సందిట చేర్చుకొని తొడపై కూర్చో బెట్టుకున్నాడు. బ్రహ్మాది దేవతలు పూలవాన కురిపిస్తూ, జగపతిగా విష్ణువును అనేక విధాలుగా స్తోత్రం చేశారు.

 

Exit mobile version