ఈ దేవస్థానంలో విశేషం ఏంటంటే వైష్ణవ సంప్రదాయానికి భిన్నంగా రాజ్యలక్ష్మి అమ్మవారు, లక్ష్మి నారాయణుని ఎడమ తొడ మీద కూర్చుండి దర్శనం ఇస్తుంది. మరి ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఈ ఆలయ విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ఆంధ్రపరదేశ్ రాష్ట్రంలోని, కృష్ణాజిల్లా దివిసీమ, మొవ్వ మండలంలో, పెదముక్తేవి గ్రామంలో శ్రీ లక్ష్మీపతి ఆలయం ఉంది. ఇది చాలా ప్రాచీన ఆలయం. ఈ ఆలయం క్రీ.శ. 1620 ప్రాంతంలో నిర్మించబడినదని చరిత్ర చెబుతుంది. కృష్ణానది పరివాహక ప్రాంతంలో వెలసిన పంచలక్ష్మి నారాయణస్వామి క్షేత్రాలలో పెదముక్తేవి ప్రధాన క్షేత్రంగా చెప్పబడుతుంది.
ఈ పంచక్షేత్రాలలో మూడు క్షేత్రాలు కృష్ణాజిల్లాలో ఉండగా మిగతా రెండు క్షేత్రాలు నెల్లూరు, రాచూరు లో ఉన్నాయి. ఈ ఐదు క్షేత్రాలను కలిపి పంచవైష్ణవ ఆరామాలుగా పిలుస్తారు. అయితే పెదముక్తేవి లో వ్యాస మహర్షి ప్రతిష్టించిన శ్రీ రాజ్యలక్ష్మి సమేత లక్ష్మి గణపతి స్వామివారు దర్శనం ఇస్తారు. కృష్ణానది ఉపనది అయినా భీమనాది ఈ క్షేత్రాన్ని పావనం చేస్తూ ఉంటుంది.
వ్యాసమహర్షి తపస్సుకి మెచ్చిన శ్రీ మహావిష్ణువు అయన ప్రార్థన మేరకు ఇక్కడ శ్రీ లక్ష్మి గణపతి గా స్వయంభువుగా వెలిసినట్లు స్థల పురాణం చెబుతుంది. ఈ ఆలయం విశాలమైన ఆవరణ, ఆ ఆవరణ చుట్టూ ప్రాకారం. ఆ ప్రాకారం మధ్యలో ఆలయం నిర్మించారు. ఇక్కడ గర్భాలయంలో ఒకే పీఠం మీద లక్ష్మి నారాయణుడు, రాజ్యలక్ష్మి అమ్మవారు ఉన్నారు. ఇచట వైష్ణవ సంప్రదాయానికి భిన్నంగా రాజ్యలక్ష్మి అమ్మవారు, లక్ష్మి నారాయణుని ఎడమ తొడ మీద కూర్చుండి, లక్ష్మీనారాయణుని కుడి చేతిలో ఉండవలసిన చక్రం ఎడమ చేతిలో ఉండుట, ఎడమ చేతిలో ఉండవలసిన శంఖం కుడిచేతిలో ఉండుట ఈ మూలవిరాట్టులోని ప్రత్యేకత.
ఈ ఆలయంలో ప్రతి రోజు అర్చనలతో పాటు ప్రత్యేక పూజలు, సంవత్సరాది, శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు, దసరా, వైకుంఠ ఏకాదశి, సంక్రాంతి పర్వదినాలలో ఉత్సవాలు గోదాదేవి కల్యాణోత్సవం అతి వైభవంగా జరుగును.