తెలంగాణాలో ప్రసిద్ధి చెందిన శైవక్షేత్రాలలో ఈ ఆలయం ఒకటిగా చెబుతారు. ఇక్కడ వెలసిన శివుడిని భక్తులు మల్లన్న గా ఆరాధిస్తున్నారు. ఈ ఆలయంలో వెలసిన శివలింగానికి ఒక కథ వెలుగులో ఉంది. మరి ఆ స్థల పురాణం ఏంటి? ఇంకా ఈ ఆలయ విశేషాలు ఏంటి? ఈ ఆలయం ఎక్కడ ఉందనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.
తెలంగాణ రాష్ట్రం, కరీంనగర్ జిల్లా, ఓదెల మండలంలో ఓదెల గ్రామానికి కొంత దూరంలో శ్రీ మల్లికార్జునస్వామి వారి ఆలయం ఉంది. ఈ ఆలయం ఓదెల మల్లన్న గా ఖ్యాతిగాంచింది. అయితే శ్రీ మల్లికార్జునస్వామి ఆలయం కాకతీయుల కాలంలో పునర్నిర్మాణం చేసారని చరిత్రకారుల భావన.
ఇక పురాణానికి వస్తే, ఇక్కడి శివలింగానికి పంకజ మహాముని తపస్సు చేసారని ప్రతీతి. ఇంకా అర్ధరాత్రి సమయాల్లో మునీశ్వరులు శివలింగానికి పూజలు చేసారని చరిత్ర చెబుతుంది. అయితే కాలక్రమేణా శివలింగం పై పుట్ట పెరిగి దండకారణ్యంగా మారిన ప్రాంతంలో చింతకుంటు ఓదెలు అను రైతు సేద్యం చేస్తూ పుట్టను చెదరగొట్టగా నాగటి కర్రు తగిలి శివలింగం బయటపడిందని చెబుతారు. ఇక అప్పటి నుండి ఈ ప్రాంతం ఓదెలుగా ప్రసిద్ధి కెక్కింది.
అయితే శ్రీశైలం మల్లికార్జునస్వామి ఆలయానికి, ఓదెల మల్లికార్జునస్వామి ఆలయానికి పోలికలున్నాయని, ఈ రెండు ఆలయాలు ఒకే కాలం నాటివని ప్రచారం లో ఉంది. కాగా రాముడు వనవాసం చేసిన కాలంలో ఇక్కడ సేదతీరినందున మల్లన్న ఆలయానికి సమాంతరంగా శ్రీ సీతారాంచంద్రస్వామి ఆలయాన్ని కూడా ఇక్కడ నిర్మించారు.
మల్లికార్జున జాతర ప్రతి ఏడాది నుండి జులై మాసం వరకు జాతర జరుగుతుంది. జాతర ముగింపులో బ్రహ్మోత్సవాలు, పెద్దపట్నం, అగ్నిగుండం మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. ఈ జాతర సమయంలో భక్తు అనేక దూర ప్రాంతాల నుండి వస్తుంటారు. పట్నాలు, బోనాలు, కోడెమొక్కులు సమర్పించి భక్తులు తరిస్తుంటారు.
ఇలా ఈ మల్లన్న ఆలయం క్రమేణా అభివృద్ధి చెందుతూ భక్తుల కోరికలే తీర్చే కొంగు బంగారంగా విరాజిల్లుతుంది.