పరమశివుడు ప్రకృతి అందాల మధ్య మల్లెంకొండమల్లయ్య గా ఇక్కడి ఆలయంలో వెలసి పూజలందుకుంటున్నాడు. కార్తీక మాసంలో పార్వతి పరమేశ్వరులు విహారానికి ఈ ప్రాంతానికి వస్తారని భక్తుల ప్రగాఢ నమ్మకం. మరి ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఈ ఆలయ స్థల పురాణం ఏం చెబుతుంది? ఆలయ విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని, వై. ఎస్. ఆర్. కడప జిల్లా, గోపవరం మండలంలో ఓబులం అనే గ్రామము కలదు. ఈ గ్రామానికి అతి దగ్గరలో కొండపైన అతి పురాతనమైన శివాలయం ఉన్నది. ఈ ప్రదేశం అంత కూడా నల్లమల అడవులలోనిదే. మల్లెంకొండకు మాల్యవంతం అనే పేరు కూడా ఉండేది. అయితే కొంతదూరం నుండి చూస్తే కొండల వరుస మూలకారంగా కనిపిస్తుంది. అందువల్ల మలయవంతంగా పిలువబడి, మాల్యవంతంగా పిలుస్తూ కాలక్రమేణా మల్లెంకొండ గా మారింది.
ఇక ఆలయ పురాణానికి వస్తే, శ్రీరామచంద్రుడు రావణసంహారం అనంతరం సీతతో కలసి ఈ మాల్యవంత పర్వత ప్రాంతానికి వచ్చాడట. ఇక్కడి ప్రకృతి రమణీయతకు పరవశించి కొంతకాలం ఇక్కడే ఉండిపోయాడట. అప్పుడే మల్లెంకొండలో ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించినట్లు స్థలపురాణం.
ఇక ఆలయ విషయానికి వస్తే, సాధారణంగా అడవుల్లో జంతువులు, క్రూరమృగాలు, పక్షులు నివసిస్తాయి. కాని ఈ ప్రాంతంలో మాత్రం కాకి కాని, పులి కాని కనిపించదు. అడవుల్లో ఎక్కువగా పెరిగే ఏపి చెట్లు కూడా కనిపించవు. ఇందుకు సంబంధించిన స్థానిక కథనం ఇలా ఉంది. కొండమీద వెలసిన శివుడు, మల్లెం కొండయ్య, అంకమ్మలకు కొన్ని శతాబ్దాల క్రితం పరిసర గ్రామపెద్దలు ఆలయాన్ని నిర్మించాలని నిశ్చయించారట. అంతవరకు మొండి గోడల మధ్యన కొలువుతీరిన ఈ దేవతామూర్తులు ఎండకు ఎండకుండా, వానకు తడవకుండా ఉండేలా, పైకప్పు నిర్మాణం ప్రారంభించారు. అయితే, పై కప్పు వేసిన మరుసటి రోజే ఆ కప్పు కూలిపోతుండటంతో ఇది ఎలా జరుగుతోందో తెలుసుకుందామని కాపు కాశారట. అర్ధరాత్రప్పుడు ఓ యువకుడు గుర్రం మీద స్వారీ చేస్తూ వచ్చి ఆ కప్పును కూల్చేయడం కనిపించింది. దాంతో గ్రామస్తులు ఆగ్రహంతో అతన్ని పట్టుకుని, ఏపి చెట్ల నారతో చేసిన తాళ్లతో బంధించారట. తాను మల్లెం కొండేశ్వరుడినని, తనకు కానీ ఇక్కడున్న శివుడికి కానీ ఆలయానికి పై కప్పు వేయరాదని చెప్పాడట. అంతేకాకుండా తనను కట్టి వేయడానికి సహకరించిన ఏపి చెట్లు ఈ అడవుల్లో కనిపించకూడదని శపించాడట. మల్లెం కొండయ్యను బంధించినప్పుడు ఓ కాకి ఆయన కళ్లను పొడవబోయిందట. దాంతో ఆ అరణ్యంలో కాకి కానరాకూడదని శపించాడట.
ఇక పులులు ఎందుకు సంచరించవు అనడానికి ఒక కథ ఉంది. ఈ పర్వత ప్రాంతంలో నివసించే ఒక గిరిజన భక్తుడు తన గోవులను మేపుకోవడానికి అడవికి వచ్చేవాడట. అక్కడ సంచరించే పులులు అదను చూసి గోవులపై దాడి చేశాయట. ఆ గిరిజనుడు శివునితో తన గోడు చెప్పుకున్నాడట. శివుడు ఈ అరణ్యంలో పులులు సంచరించరాదని ఆఙ్ఞాపించాడట. అందుకే ఈ అరణ్యంలో నేటికీ పులి కనిపించదు.
మల్లెంకొండలో మూడు నీటి గుంటలు మనము దర్శించవచ్చును. అందులో ఒకటి పసుపు నీటి గుండం, రెండవది మోక్షగుండం, మూడవది తొంగిచూపుల గుండం. అయితే భక్తులు ఈ మూడు గుండాలలో స్నానం చేస్తే సకల రోగాలు నయమవుతాయని భక్తుల విశ్వాసం.