మనకి ఎన్నో ఆలయాలు ఎన్నో సంప్రదాయాలు ఉన్నాయి. అందరు వాటిని గౌరవిస్తూ వారి సంప్రదాయం ప్రకారం దేవుడిని పూజిస్తుంటారు. అయితే ఇక్కడ వెలసిన ఈ అమ్మవారికి పాద పూజలు చేస్తుంటారు. ఇలా చేయడం వెనుక ఒక పురాణ గాథ ఒకటి ఉంది. మరి ఆ పురాణం ఏంటి? ఇక్కడ వెలసిన ఆ అమ్మవారు ఎవరు? ఈ ఆలయం ఎక్కడ ఉందనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని, విశాఖపట్టణానికి కొన్ని కిలోమీటర్ల దూరంలో పాడేరు గ్రామం వద్ద శ్రీ మోద కొండమ్మ తల్లి అనే గ్రామ దేవత ఆలయం ఉంది. ఈ అమ్మవారికి పాదపూజలు చేయడం ఇక్కడి భక్తుల ఆచారం. పాడేరు మోదకొండమ్మ వారు ఉత్తరాంధ్ర గిరిజనుల ఆరాధ్యదైవం. స్థల పురాణానికి వస్తే, కొన్ని శతాబ్దాల క్రితం దట్టమైన అడవులలో ప్రస్తుత ఆలయ స్థలానికి సమీపంలో అడవిలో కొండపైన కొండమ్మ వారి ఆలయం ఉండేది. ప్రతి సంవత్సరం ఆదివాసులు బృందాలుగా ఏర్పడి అమ్మవారికి అత్యంత ఇష్టమైన దప్పుల దరువుతో నృత్యాలు చేసుకుంటూ కాలినడకన ఎత్తైన కొండా ఎక్కి అమ్మవారికి పండుగచేసి మొక్కుబడులు చెల్లించేవారు.
అయితే ఒక సంవత్సరం అమ్మవారికి పండుగ చేసి ఓ గిరిజనుడు ప్రయాణంలో సగం దూరం వచ్చిన తరువాత చెంబు సంగతి గుర్తుకు వచ్చి వెను తిరిగి వెళ్ళాడు. ఆలయంలో మోద కొండమ్మ తనం ఏడుగురు అక్కాచెల్లెళ్లు, తమ్ముడు పోతురాజుతో కలసి భక్తులు తెచ్చిన ప్రసాదాన్ని భుజించే దృశ్యాన్ని భక్తుడు చూడడంతో అమ్మ ఆగ్రహించింది. ఇకపై తన వద్దకు ఎవరు రావద్దని, ఈ చెంబు ఎక్కడ పడితే అక్కడే తనకు గుడి కట్టి పూజలు, పండుగలు చేయాలనీ ఆదేశించింది.
అలా భక్తుడు వదిలేసిన చెంబును బలంగా కాలితో తన్నగా ప్రస్తుతం అమ్మవారి పాదాలుగా పేరొందిన పాడేరు – విశాఖపట్నం మార్గంలో పడింది. అప్పటి నుండి మన్యం వాసులంతా ఈ పాదాలు వద్దే పండుగ చేస్తున్నారు. ప్రతి సంవత్సరం ఇక్కడ జాతర కూడా నిర్వహిస్తారు.