Home Unknown facts ఊర్వశి పురూరవుని ఎందుకు వదిలేసింది?

ఊర్వశి పురూరవుని ఎందుకు వదిలేసింది?

0

స్వర్గంలో అప్సరసలు రంభ, ఊర్వశి, మేనకా తదితరులు ఉంటారని చాలా పురాణాల్లో విన్నాం. వీరు స్వర్గంలో దేవతల ఆనందం కోసం నాట్యం చేయడానికి నియమించిన వారు. అంతే కాకుండా ఎవరైనా యాగాలు, తపస్సు లాంటివి చేస్తే ఆ యజ్ఞాలను భగ్నం చేయడానికి ఇంద్రుడు వీరిని పంపించేవాడు.

The sun cursed Urvashiఅయితే రంభ, మేనకా ఇద్దరు ఊర్వశి కంటే ముందే స్వర్గంలో ఉండేవారు. ఊర్వశి పుట్టుక గురించి మాత్రం ఒక ఆసక్తిగల కధ ఉంది. పూర్వం బదరికావనంలో నర, నారయణులు లోక కళ్యాణం గురించి ఘోర తపస్సు చేస్తున్నారు. వారి తపస్సు వలన అభద్రతా బావనకు గురైన దేవేంద్రుడు వారి తపస్సును భంగం చేసి రమ్మని రంభ, మేనక, తిలోత్తమ తదితర అప్సరసలను పంపాడు. అందగత్తెలైన రంభాది అప్సరసలు బదరికావనంలో ప్రవేశించి తమ నృత్య, గాన విలాసాలతో నర, నరాయణుల తపస్సును భగ్నం చెయ్యడానికి శతవిధాలుగా ప్రయత్నించారు.

ఇంతలో ఇంద్రుని గర్వమనచడానికి నారాయణుడు తన కుడి ఊరువు (తొడ) మీద అరచేత్తో చరిచాడు. ఆ శబ్దం నుంచి అప్సరసల అందాన్ని తలదన్నే అద్భుత సౌందర్యవతి పుట్టింది. ఊరువు నుంచి పుట్టింది కాబట్టి ఆమెకు ‘ఊర్వశి’ అని పేరుపెట్టి, ఆమెను రంభాది అప్సరసలకు అప్పగిస్తూ ‘ఈ సుందరిని మేమే దేవేంద్రునికి బహూకరించామని చెప్పండి’ అని పలికి ఊర్వశిని వారికి అప్పగించి, తిరిగి తపస్సులోకి వెళ్ళిపోయారు.

ఆ విధంగా నారాయణుని కుమార్తె అయిన ఊర్వశి అప్సరసల్లో స్థానం సంపాదించుకుంది. ఒకసారి దేవలోకం‌లో ఊర్వశిని సూర్యుడు, వరుణుడు చూడటం జరిగింది. ఊర్వశి అందం చూడగానే వారి తేజస్సు జారగా వారి తేజస్సును ఊర్వశి కుండలలో భద్రపరిచింది. అలా సూర్యుడు, వరుణులకు పుట్టిన వారే వశిష్ట, అగస్త్యులు. వీరు కుండల నుండి ఉద్బవించడం వల్ల వీరిని కుంభసంభవులంటారు. అయితే వరుణునితో కలిసినందున భంగపడిన మిత్రుడు ఊర్వశిని భూలోకం‌లో పురూరవునికి బార్యగా పుట్టమని శపించాడు.

పురూరవుడు చంద్రవంశానికి చెందిన రాజు. ఆయన తల్లిదండ్రులు బుధుడు, మనువు కూతురైన ఇళ. ఒకనాడు భూలోకం‌లో ఊర్వశిని పురూరవ చక్రవర్తి చూసాడు. ఆమె సౌందర్యం అతనిని మోహపరవశుని చేయగా, పురూరవుడు తనను వివాహం చేసుకొమ్మని ఊర్వశిని అర్థించాడు. వివాహానికి సమ్మతించిన ఊర్వశి కొన్ని నిబంధనలుపెట్టింది. అమె తన వెంట తీసుకువచ్చిన జింకపిల్లలను కంటికి రెప్పలా కాపాడాలని మరియు దిగంబరంగా ఎప్పుడూ నా కంటబడకూడదని ఈ నిబంధనలను అతిక్రమించిన క్షణమే తను స్వర్గానికి వెళ్ళిపోతాను అని చెప్పింది. ఇందుకు సమ్మతించిన పురూరవుడు ఆమెను వివాహాం చేసుకొని, ప్రేమగా జీవించారు. మరోవైపు వీరి ప్రేమ దేవతలకు అసూయగా మారింది.

ఊర్వశి లేకపోవడంతో స్వర్గ లోకం‌ చాలా వెలితిగా కనిపించింది. దీనితో ఊర్వశిని స్వర్గానికి రప్పించాలని దేవతలు ఒక పన్నాగం పన్నారు. ఆ పన్నాగం ప్రకారం ఒకనాటి రాత్రి ఊర్వశి, పురూరవుడు ఒకే శెయ్య మీద ఉండగా దేవేంద్రునిచేత నియమితుడైన ఒక గంధర్వుడు అదృశ్యరూపంలో ఊర్వశి జింకపిల్లలను అపహరించాడు. అది తెలిసి ఊర్వశి పురూరవుని నిందించగా, అతడు ఆమెను ఓదారుస్తు అతను ఉన్న స్థితిని మరచిపోయి శయ్య దిగాడు. అదే సమయంలో అతని దిగంబరత్వం ఊర్వశికి కనబడేలా దేవేంద్రుడు మెరుపులు సృష్టించగా, ఊర్వశి ఆ మెరుపుల వెలుగులో పురూరవుని దిగంబరంగా చూసింది. ఈ విధంగా వీరి వివాహపు నిబంధన అతిక్రమించబడి పురూరవుడు ఎంతగా బ్రతిమాలుతున్నా వినకుండా స్వర్గానికి వెళ్లిపోయింది. వీరికి ధీమంతుడు, ఆయువు, శతాయువు, దృఢాయువు అనే కుమారులు పుట్టరు.

 

Exit mobile version