Home Unknown facts భగిని హస్త భోజనం అంటే ఏమిటి ? ఎందుకు జరుపుకుంటారు

భగిని హస్త భోజనం అంటే ఏమిటి ? ఎందుకు జరుపుకుంటారు

0

దీపావళి తరువాత రెండో రోజున జరుపుకొనే అన్నా చెల్లెళ్ల పండుగనే భాయ్ దూజ్ అనీ భగిని హస్త భోజనం అనీ యమ ద్వితీయ అని కూడా అంటారు. ఈ పండుగ సోదర సోదరీమణులు మధ్య ప్రేమకు గుర్తు, మరియు వారి మధ్య రక్షణ మరియు ఆప్యాయతని బంధాన్ని బలోపేతం చేయడానికి జరుపుకుంటారు. సోదరీమణులు భోజనం పెడితే సోదరులు వారి జ్ఞాపకార్ధం బహుమతులు ఇస్తారు. ‘భగిని’ అంటే తోబుట్టువు అని, భాగ్యవంతురాలు అనీ అర్థం. సోదరి చేతివంటను తినడమే భగినీహస్త భోజనం. ఈ సంప్రదాయానికి ఎంతో విశిష్టత ఉంది. యమధర్మరాజు సోదరి యమునానది. ఆమె పూర్వం తన అన్న అయిన యమధర్మరాజు దగ్గరకు ప్రతి నిత్యం వెళ్లి, తన ఇంటికి వచ్చి భోజనం చేసి వెళ్లాల్సిందిగా కోరేదట.

భగిని హస్త భోజనంనరకలోక పాలనలోనే సతమతమైపోయే యమధర్మరాజుకు సోదరి ఇంటికి వెళ్ళి భోజనం చేయడానికి ఎన్నాళ్లకూ తీరిక దొరకలేదు. ఎలాగైనా ఒక రోజున చెల్లెలి ఇంటికి వెళ్లి భోజనం చేసి రావాలని సంకల్పించుకున్నాడు. చివరికి అతనికి కార్తికమాసం, శుక్లపక్షం, ద్వితీయతిథినాడు విరామం దొరికింది. ఆ పర్వదినాన యమున ఇంటికి వెళ్లాడు. ఎన్నాళ్లో ఎదురుచూడగా అనుకోకుండా వచ్చి, తన ప్రార్థనను మన్నించిన అన్నకు యమున షడ్రసోపేతమైన విందు భోజనాన్ని వడ్డించింది. యముడు సోదరి భక్తితో చేసిన వంటలన్నీ చక్కగా ఆరగించాడు. ఆమె చేతి భోజనం అమృతాన్ని తాగినంత ఆనందం కలిగింది. అప్పుడు యముడు తన చెల్లెలి చేతివంటను మెచ్చుకొని, యమునతో నీకు బహుమతులు ఏమి తీసుకురాలేదు. ఏదైనా వరం కోరుకొమ్మన్నాడు.

ఆమె నాకు ఏమి వద్దు అన్నయ్య అనింది. అప్పుడు యముడు అడుగమ్మా నేను నువ్వు ఏమి అడిగితే అది నేను తప్పక తీర్చుతాను అన్నాడు. వారు దేవతలు కదా వారు స్వార్ధంగా ఏమి కోరికలు అడగరు. కానీ యమున నాకు ఒక కోరిక వుంది తీర్చుమని అడిగింది. అది ఏమిటంటే… ‘అగ్రజా! నీవు ప్రతి సంవత్సరం ఇదే రోజున నా ఇంటికి వచ్చి నా చేతివంటను తినివెళ్లాలి. అంతేగాక, ప్రతి సంవత్సరం కార్తిక శుక్లద్వితీయనాడు లోకంలో ఏ అన్నలు చెల్లెళ్లు వండిన పదార్థాలను భోజనం చేస్తారో, అలాంటివాళ్లకు నరకబాధ ఉండరాదు. వారికి అపమృత్యుదోషం కలగకుండా వరం ఇమ్మని కోరింది.

యముడు తధాస్తు అన్నాడు. నాటి నుంచి ఈ వేడుక ‘యమద్వితీయ’ అనీ, ‘భ్రాతృద్వితీయ’ అనీ ప్రసిద్ధిలోకి వచ్చింది. ‘భగినీహస్త భోజనం’ అనేది అనాదిగా వస్తున్న సంప్రదాయం, ఆచారం. ఇందులో మానవజీవన విశేషాలు, పరమార్థాలు ఇమిడి ఉన్నాయి. మనిషి కుటుంబజీవి. కనుక కుటుంబాన్ని విడిచి క్షణంకూడా జీవించలేడు. కుటుంబంలో ముఖ్యులు తల్లిదండ్రులు. వాళ్లు సంతానాన్ని కని, పెంచి, పోషించి, పెద్దచేసి, విద్యాబుద్ధుల్ని ప్రసాదించి, తమ సంతానానికీ కుటుంబాలను సంపాదించిపెడతారు.

మనిషికి తల్లిదండ్రుల తరవాత ఆత్మీయులైనవాళ్లు తోబుట్టువులైన అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్లే కదా! తల్లిదండ్రులు వయసులో పెద్దవాళ్లు కనుక, తమ సంతానం బతికినంతకాలం బతుకలేరు. తమ సమకాలంలో పుట్టిన తోబుట్టువులు తమ జీవితాంతం వరకు బతికే అవకాశం ఉంది. అందువల్ల అన్నలు, తమ్ముళ్లు, అక్కలు, చెల్లెళ్లు కనీసం ఏడాదికి ఒక్కసారైనా కలిసి భోజనం చేస్తే ఆత్మీయతలు నిలుస్తాయి. అంతేగాక, ఒకరి కష్టసుఖాలను మరొకరు తెలుసుకొని స్పందించే అవకాశం ఉంటుంది.

కనుక ఈ భోజన సంప్రదాయం కుటుంబ సభ్యుల మధ్యన జీవితాంతం వరకు ప్రేమాభిమానాలను కలిగి ఉండే అదృష్టాన్ని ప్రసాదిస్తుంది. బతుకు తెరువుకోసం దూరదూరాలకు వెళ్లకుండా ఉండిన ప్రాచీనకాలంలోనే ఈ సంప్రదాయం, ఆచారం కొనసాగింది. ఇక ఆధునికకాలం ఉపాధికోసం రాష్ట్రాల సరిహద్దులనే కాదు, దేశాలను, ఖండాలను దాటిపోవలసిన పరిస్థితి ఏర్పడింది. ఏడాదికొకసారి కాదుగదా, రెండు మూడేళ్లకూ ఆత్మీయులను, తోబుట్టువులను కలుసుకోలేని దుస్థితిలో ఆత్మీయతలు ఎలా నిలుస్తాయి? కనుక ఎప్పుడో ఒకప్పుడు కలిసినా ఈ ఆచారాన్ని పాటించి అన్నదమ్ములు అక్కచెల్లెళ్ల ఇళ్లకువెళ్లి, వాళ్ల చేతివంటను భుజించి, వారికి ధనకనక వస్తువాహనాలను యథాశక్తిగా సమర్పించుకొంటే ఆత్మీయబంధాలు వర్ధిల్లుతాయి. ఒకరికొకరం అండగా ఉన్నామనే భావన, విశ్వాసం కలుగుతాయి.

ఈ ఆచారాలు, సంప్రదాయాలు… రాగద్వేషాలకు అతీతంగా విశ్వక్షేమం కోసం ఏర్పాటు చేసినవే. ఈ పరమార్థాన్ని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకుంటే చాలు- ఈ పర్వదినంలోని మహిమ బోధపడుతుంది. ఏ సంప్రదాయమైనా, ఆచారమైనా మానవాళి మధ్య సద్భావనలను పెంపొందింపజేసి, స్నేహాన్ని, ఆత్మీయతను, ఆప్యాయతను శాశ్వతంగా నిలపడంకోసమే.

 

Exit mobile version