Home Unknown facts తిరుమల నుండి వస్తున్న వేంకటేశ్వరస్వామికి ఆతిధ్యం ఇచ్చిన మల్లవరం గురించి మీకు తెలుసా

తిరుమల నుండి వస్తున్న వేంకటేశ్వరస్వామికి ఆతిధ్యం ఇచ్చిన మల్లవరం గురించి మీకు తెలుసా

0

శ్రీ వేంకటేశ్వరస్వామి తిరుమల నుండి ఒకరోజు ఆకాశమార్గాన వస్తుండగా ఒక గిరి పైన విశ్రాంతి తీసుకున్నాడని అదియే ఇప్పుడు ఒక ప్రసిద్ధ దేవాలయంగా మారిందని స్థల పురాణం చెబుతుంది. మరి శ్రీ వెంకటేశ్శ్వరస్వామికి ఆతిధ్యం ఇచ్చిన ఆ గిరి ఎక్కడ ఉంది? ఈ ఆలయానికి సంబంధించిన విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Venkateswara Swamyఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, మద్దిపాడు మండలంలో పేరుగాంచిన గ్రామం మల్లవరం. ఈ గ్రామంలో అతిపురాతనమైన శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం ఉంది. ఈ గ్రామాన్ని గుండ్లకమ్మ నది స్పర్శిస్తూ దక్షిణ ముఖంగా ప్రవహిస్తుంది. ప్రకృతి సౌందర్యలతో భాసిల్లే మల్లవర గిరిపైనా శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం ఉంది. ఇక్కడ వెలసిన స్వామి గురించి మహాభారత అరణ్య పర్వాన్ని పూరించి మహాకవి ఎర్రన్న తన హరివంశ పీఠికలో ప్రస్తుతించారు. దీనిని బట్టి ఈ దేవాలయం సుమారు క్రీ.శ. 1100 సంవత్సరాల ముందే ఉందని చెబుతారు.

ఇక స్థల పురాణానికి వస్తే, పూర్వం ఒక రోజు తిరుమల గిరి నుండి శ్రీ వేంకటేశ్వరస్వామి బయలుదేరి ఆకాశమార్గాన ప్రయాణిస్తూ గుండిక నది తీరాన్ని చేరి, అచట విస్తరించి ఉన్న గిరిపై విశ్రాంతి తీసుకోవాలని అనుకోగా, మళ్లవరగిరి తనపై ఆతిధ్యం ఇచ్చింది. అప్పుడు స్వామి సంతోషంతో విశ్రమించాడు. అప్పుడు మల్లవరాద్రిపై తేజోమయ రూపమున వెలుగుచున్న శ్రీ వేంకటేశ్వరుని చూసిన నారద మహర్షి భక్తి భావంతో స్వామిని ప్రార్ధించి వారి అనుమతితో మళ్లవరగిరి ఆనందించేలా స్వామిని అచట ప్రతిష్ట గావించి స్వామివారిని అర్చించినట్లు స్థల పురాణం.

ఇక శ్రీకృష్ణదేవరాయల కాలంలో ఆలయం గోపురం, ప్రాకారం కట్టించినట్లు అచట ఉన్న శాసనాల ద్వారా తెలుస్తుంది. ఇలా వెలసిన ఆ వేంకటేశ్వరస్వామిని దర్శించుకోవడానికి ప్రతి ఆదివారం అధిక సంఖ్యలో భక్తులు వస్తుంటారు. ఇంకా ప్రతి ఏటా మే నెలలో మూడు రోజులు స్వామివారికి కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతుంది.

Exit mobile version