మన దేశంలో ఎన్నో దేవాలయాలు అనేవి ఉన్నాయి. ప్రతి దేవాలయానికి ఏదో ఒక విశిష్టత అనేది ఉంది. అయితే ఇతర దేశాలలో స్థిరపడిన మన భారతీయులు ఇక్కడి దేవాలయాలకి ఏ మాత్రం తగ్గకుండా అక్కడ దేవాలయాలను నిర్మించుకొని వారి భక్తిని చాటుకున్నారు. ఇలా ఇంత దేశాలలో ఉన్న కొన్ని ప్రముఖ దేవాలయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.
శ్రీ స్వామినారాయణ్ మందిర్:
ఈ మందిర్‌ను లండన్ వాయవ్య ప్రాంతంలో 1995లో నిర్మించారు. 2,828 టన్నుల బల్గేరియన్ లైమ్‌స్టోన్‌ను, 2వేల టన్నుల ఇటాలియన్ మార్బుల్‌ను వినియోగించారు. రూ.82 కోట్లను ఖర్చు చేశారు. నిర్మాణానికి రెండున్నరేళ్లు పట్టింది. దీనిని నీస్‌డెన్ ఆలయంగా పిలుస్తారు. ఇది ఐరోపాలో నిర్మించిన మొదటి అధికారిక ఆలయం. ఇది భారత్‌కు వెలుపల నిర్మించిన అతిపెద్ద ఆలయంగా 2000 సంవత్సరంలో గిన్నిస్ రికార్డులకెక్కింది. లండన్‌లోని ఏడు అద్భుతాల్లో ఇదీ ఒకటని చెబుతారు.
వెంకటేశ్వర ఆలయం, బర్మింగ్‌హాం:
బ్రిటన్ వెస్ట్ మిడ్‌లాండ్‌లోని డబ్లీకి సమీపంలో ఉన్న టివిడేల్‌లో నిర్మించిన వెంకటేశ్వరాలయం మరో అద్భుత కట్టడం. రూ.40 కోట్ల వ్యయంతో 12.5 ఎకరాల్లో దీనిని నిర్మించారు. తిరుమలలోని శ్రీవారి ఆలయం నమూనాలో దీనిని కట్టారు.
కాలిఫోర్నియా లో వెలసిన ఆలయం:
అమెరికాలోని కాలిఫోర్నియాకు సమీపంలో 1981లో శాంటా మోనికా కొండల్లో ఈ మలీబు ఆలయాన్ని నిర్మించారు. ఇక్కడ శ్రీనివాసుడు సేవలందుకుంటారు. ఇందులో రెండు ప్రాంగణాలున్నాయి. పైన ఉన్న ఆలయంలో వెంకటేశ్వరుడు కొలువుదీరి ఉంటారు. కిందిభాగంలో శివాలయం ఉంది.
లండన్ లో వెలసిన ఆలయం:
ఆధ్మాత్మిక పరిమళాలను వెదజల్లుతూ రూ.109 కోట్లతో భారీ ఎత్తున నిర్మించిన అపురూప ఆలయం ఇది. హిందువులు అధికంగా నివశించే లండన్‌లోని వెంబ్లీ ప్రాంతంలో ఈ సనాతన్ హిందూ మందిర్‌ను 2.4 ఎకరాల్లో నిర్మించారు. ఆలయం ఎత్తు 66 అడుగులు. ఆలయ నిర్మాణంలో పురాతన శిల్పశాస్త్ర కళను అనుసరించారు. ఆలయానికి ఉపయోగించిన లైమ్‌స్టోన్‌ను ప్రత్యేకంగా గుజరాత్‌లోని సోలా పట్టణంలో అద్భుత శిల్పాలుగా మలిచారు. మందిర నిర్మాణంలో స్టీల్‌ను వాడకపోవడం విశేషం. ఈ మందిరంలో మతాలకు అతీతంగా 41 మంది పాలరాతి విగ్రహాలను ఏర్పాటు చేశారు. ఇందులో మదర్ థెరెసా, గురునానక్, మీరాబాయి, స్వామినారాయణ్ తదితరుల విగ్రహాలున్నాయి. ఇసుక రంగు గోడలతో ఈ ఆలయం అందరిని ఆకట్టుకుంటుంది.
స్వామి నారాయణ్ మందిర్, టొరంటో:
కెనడాలోని టొరంటోలో రూ.64 కోట్లతో నిర్మించిన స్వామి నారాయణ్ మందిరానికి 2వేల మంది కార్మికులు పనిచేశారు. టర్కీ లైమ్‌స్టోన్, ఇటలీ మార్బుల్‌తో నిర్మించారు. ఈ ఆలయం 2007లో ప్రారంభమైంది.
ఇక భారత్ వెలుపల నిర్మించిన హిందూ ఆలయాల్లో అమెరికాలోని అట్లాంటాలో నిర్మించిన ఆలయమే ప్రస్తుతం అతి పెద్దదని చెబుతారు. 30 ఎకరాల్లో 32వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో దీనిని నిర్మించారు. గోపురం 75 అడుగుల ఎత్తు ఉంటుంది. 34,450 రాళ్లను నిర్మా ణంలో వినియోగించారు. 1300 మంది శిల్పులు పనిచేశారు. ఈ ఆలయం కోసం ఏకంగా రూ.100కోట్లు వెచ్చించారు.
ఇలా ఇతర దేశాలలో వెలసిన ఈ కొన్ని హిందూ దేవాలయాలు ప్రసిద్ధ ఆలయాలుగా చెబుతారు.