తమిళనాడు రాష్ట్రంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వెలసిన ఆరు పవిత్ర పుణ్య క్షేత్రాలు ఉన్నాయి. ఆ ఆరు పడైవీడు క్షేత్రాలు మన శరీరంలో ఆరు చక్రములకు ప్రతీకగా చెబుతారు. అయితే శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దివ్య ధామాల్లో ప్రఖ్యాతి వహించిన ఆరు పడైవీడు క్షేత్రాల తరవాత అంతే స్థాయిలో ఏడవ పడైవీడుగా ఈ ఆలయాన్ని చెబుతారు. మరి ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఈ ఆలయ విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.
మన దేశ రాజధాని అయినా న్యూఢిల్లీలో శ్రీ స్వామినాథ స్వామి ఆలయం ఉంది. ఈ ఆలయంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు శ్రీ స్వామినాథ స్వామి పూజలందుకుంటున్నాడు. ఈ ఆలయాన్ని ఉత్తర స్వామి మలై మందిర్ అని పిలుస్తుంటారు. అయితే ఆరు చక్రాలతో పాటు, బ్రహ్మ రంధ్ర స్థానం అయిన సహస్రార చక్రంగా ఈ ఉత్తర స్వా మి మలై క్షేత్రం అని గురువులు, పెద్దలు నిర్ధారించారు. అందుకే ఈ ఉత్తర స్వామిమలైని సహస్రార క్షేత్రం అంటారు.
ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి వారి గర్భగుడి 90 అడుగుల ఎత్తు ఉన్న కొండ మీద ఉంటుంది. తమిళ భాషలో కొండని మలై అంటారు. కాబట్టే, ఈ క్షేత్రం మలై మందిర్ అనే పేరుతో ప్రసిద్ధి చెందినది. ఇక్కడ మరో ప్రత్యేకత ఏమిటంటే, కరచరణాదులతో ఉన్న భగవంతుని మూర్తిని సాధారణంగా బ్రహ్మ స్థానం లోనూ, లేదా గర్భగుడి మధ్యలోనూ ప్రతిష్ఠ చేయరు. కానీ, ఇక్కడ ప్రత్యేకత సుబ్రహ్మణ్య స్వామివారి మూల విగ్రహ మూర్తిని బ్రహ్మస్థానంలో ప్రతిష్ఠ చేశారు.
ఇక పురాణానికి వస్తే, 1940వ సంవత్సరంలో ఢిల్లీ నగరంలో దక్షిణ భారతీయులు తక్కువగా ఉండేవారు. ఆ సమయంలో స్వామినాథ స్వామి వారి యొక్క ఒక మహాభక్తుడు ఉండేవారు. వారికి భగవాన్ రమణ మహర్షి స్వయంగా పచ్చతో తయారు చేసిన స్వామినాథ స్వామి వారి మూర్తిని బహూకరించారు. వీరు ఆ మూర్తిని ఎంతో భక్తిశ్రద్ధలతో రోజూ పూజించేవారు. ప్రతీ ఏటా కార్తీకమాసంలో తమిళులు ఎంతో భక్తి శ్రద్ధల తో జరిపే స్కంద షష్ఠి ఉత్సవాలను ఈ భక్తుడు కూడా జరి పేవారు. వీరు మొదటగా 1943 లో స్వామినాథ స్వామి వారి మూర్తిని సకల జనులూ దర్శించేవిధంగా, స్కంద షష్ఠి ఉత్సవాలు జరపడం ప్రారంభించారు.
ఇలా నెమ్మదిగా ప్రతీ సంవత్సరం స్కంద షష్ఠి ఉత్సవాలలో పాల్గొనే భక్తుల సంఖ్య వేలలోకి చేరింది. స్వామివారికి ఒక ప్రత్యేక ఆలయం నిర్మించాలని అక్కడి వారు భావించారు. భక్తులందరూ స్వామి నాథ స్వామి ఆలయం కోసం ఒక ఎత్తయిన స్థలం వెదకడం ఆరంభించారు. అయితే, కారుణ్యమూర్తి అయిన సుబ్రహ్మణ్యుడు ఆయన మందిరం యొక్క స్థలం ఎక్కడ ఉండాలో వారే ఒక భక్తుని కలలో కనిపించి తెలియజేశారు. స్వామి ఎంచుకున్న స్థలం, ఢిల్లీ నగరంలోనే వసంత గ్రామం అనే చోట, దట్టమైన రేగిచెట్ల నడుమ ఉన్న ఒక చిన్నకొండ. ప్రస్తుతం ఈ వసంత గ్రామాన్నే వసంత్ విహార్‌గా పిలుస్తారు.
ఇలా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇక్కడ వెలసిన ఈ ఏడవ పడైవీడు అని పిలువబడే ఈ పుణ్య క్షేత్రాన్ని దర్శించుకోవడానికి భక్తులు ఎప్పుడు అధిక సంఖ్యలో వస్తుంటారు.