శ్రీరాముడు రావణసంహారం తో బ్రహ్మహత్యాపాతకం పోగొట్టుకోవడానికి దేశంలో చాల చోట్ల శివలింగాలను ప్రతిష్టించాడని తెలుసు. అయితే ఈ ఆలయంలోని శివలింగాన్ని స్వయానా విష్ణమూర్తి ప్రతిష్టించడం విశేషం. మరి ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఈ ఆలయ స్థల పురాణం ఏంటనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లాలో ఎల్లోరా గ్రామం ఉంది. ఈ గ్రామానికి, గుహలు ఉన్నవైపుగాకా, రెండవ వైపున శ్రీ ఘృష్ణేశ్వర ఆలయం ఉంది. ఈ ఘృష్ణేశ్వర ఆలయం ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటిగా వెలుగొందుచున్నది. ఈ ఆలయం అందముగా, ఆకర్షణీయంగా చాలా విశాలమైన ప్రాంగణంలో ఉంది. దీని నిర్మాణ శైలి కూడా మిగతా ఆలయాల కన్నా భిన్నంగా ఉంటుంది.
ఇండోర్ ను పాలించిన హోల్కర్ వంశంలోని రాణి అహల్యాబాయి గొప్ప శివభక్తురాలు. ఆమె జీర్ణమైన చాలా శివాలయాలను పునురుద్ధరించింది. ప్రస్తుతం ఉన్న ఈ ఆలయం కూడా ఆమెచేత పునర్నిర్మించబడినదే. ఈ ఆలయ శిఖర భాగము, బయట గోడలు, చదరంగం కాకుండా ఒక విధమైన కోణాలుగా ఉంది, ఒకరకమైన విచిత్ర ఆకర్షణ కలుగుతుంది. ఆలయ ముందుభాగంలో విశాలమైన సభా మంటపం ఉంది. ఈ మంటపంలో మొత్తం 24 స్థంబాలు చక్కని శిల్పసంపదతో నిండి ఉన్నాయి. గర్భాలయము చాలా విశాలంగా, సుమారు 15 అడుగుల పొడవు, వెడల్పుతో చదరంగా ఉంది. మధ్య గా, నేలమట్టానికే ఉన్న పానవట్టమూ, దాని మధ్యగా ఉన్న చిన్న శివలింగ విగ్రహము ఒక వింతైన ఆకర్షణతో ఉన్నాయి. ఇక స్థల పురాణం విషయానికి వస్తే, ఒకనాడు పార్వతి పరమేశ్వరులిద్దరు కైలాసంలో పాచికలాటా ఆడుకుంటూ ఉన్నారు. ఆ ఆటలో పార్వతీదేవి గెలిచింది. అప్పుడు ఆ దేవి, శివుడిని ఎగతాళి చేయగా నొచ్చుకున్న శివుడు కైలాసాన్ని వదిలిపెట్టి, పర్వతాలపైనా ఉన్న చల్లని ఈ అడవి ప్రదేశానికి వచ్చాడు. తన తప్పు తెలుసుకున్న పార్వతి పశ్చత్తాపడి, తాను కూడా ఇక్కడికే వచ్చి భర్తతో పాటు అక్కడే ఉండిపోయింది. ఆలా శివపార్వతులు సన్నిహితంగా ఈ వనంలో విహరిస్తూ ఉండేవారు. అందుకే స్వామివారిని ఇక్కడ ఘృష్ణేశ్వర అని పిలుస్తారు. అంతేకాకుండా శివ పార్వతులు ఆనందంగా గడిపిన ఈ ప్రదేశాన్ని కామ్యకావనం అని కూడా పిలుస్తారు. ఈ ఆలయములో ఉన్న శివలింగాన్ని విష్ణుమూర్తి ప్రతిష్టించాడు. ఈ లింగమును పూజుంచిన వారికీ పుత్రశోకం కలుగదు అని ఇక్కడి భక్తుల నమ్మకం.