Home Health షేవింగ్ తరువాత చర్మం పై వచ్చే దద్దుర్లు తగ్గించే చిట్కాలు

షేవింగ్ తరువాత చర్మం పై వచ్చే దద్దుర్లు తగ్గించే చిట్కాలు

0

అబ్బాయిల్లో ఎక్కువ మంది గడ్డం, చంకలు, కాళ్లు, మిగతా అవాంఛిత వెంట్రుకలు తొలగించుకోవడానికి ఎంచుకునే మార్గం షేవింగ్. రేజర్ ఉపయోగించి రోమాలను తొలగించడం సులభమని ఎక్కువ ఇదే పద్ధతిని ఫాలో అవుతుంటారు. కానీ షేవింగ్ తర్వాత చర్మంపై వచ్చే ఎర్రటి దద్దర్లు, మంట మాత్రం చాలా ఇబ్బంది పెడుతుంటాయి. వీటినే రేజర్ బర్న్స్ అంటారు.

ways to smooth your skin after shavingఈ సమస్య కొందరికి అప్పుడప్పుడు మాత్రమే ఎదురైతే.. మరికొందరికి మాత్రం షేవింగ్ చేసుకున్న ప్రతి సారి వస్తుంది. అబ్బాయిలు మాత్రమే కాదు.. షేవింగ్ చేసుకున్నప్పుడు అమ్మాయిలు కూడా ఎదుర్కొనే సమస్య ఇది. అయితే కొన్ని సహజమైన చిట్కాలు పాటించడం ద్వారా షేవింగ్ చేసుకున్న తర్వాత వచ్చే మంట, దద్దుర్ల నుంచి రిలీఫ్ పొందవచ్చు. ఆ చిట్కాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఎప్పుడైనా చర్మానికి దద్దుర్లు వస్తే, లేదా మంటగా అనిపిస్తే కొబ్బరి నూనె రాసుకోమని పెద్దవాళ్ళు చెబుతారు. కొబ్బరి నూనెలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ సెప్టిక్ గుణాలుంటాయి. కాబట్టి దద్దుర్లు తగ్గిపోతాయి. షేవింగ్ పూర్తయిన తర్వాత కొబ్బరినూనె రాసుకుంటే దద్దుర్లు రావు. కొబ్బరినూనెకు బదులుగా ఆలివ్ ఆయిల్, స్వీట్ ఆల్మండ్ ఆయిల్, అవకాడో ఆయిల్ కూడా రాసుకోవచ్చు.

షేవింగ్ చేసుకోవడం వల్ల వచ్చే దద్దుర్లు, మంట, దురదను ఓట్ మీల్ తగ్గిస్తుంది. ఓట్స్ ను మిక్సీలో వేసి మెత్తటి పౌడర్లా చేసుకోవాలి. సమపాళ్లలో ఓట్స్, పెరుగు తీసుకుని పేస్ట్ లా కలుపుకోవాలి. ఈ మిశ్రమంలో చెంచా తేనె కూడా కలపాలి. ఈ మిశ్రమాన్ని షేవింగ్ చేసుకున్నచోట ప్యాక్ లా అప్లై చేసుకోవాలి. అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ చిట్కా షేవింగ్ తర్వాత వచ్చే వెంట్రుకలు గుచ్చుకోకుండా చేస్తుంది. దీనికోసం రోజుకి రెండు సార్లు చొప్పున మూడు రోజులు ఈ ప్యాక్ వేసుకోవాల్సి ఉంటుంది.

కలబందలో ఉన్న కొన్ని ఎంజైమ్ లు మంటను తగ్గిస్తాయి. అందుకే చర్మానికి కాలిన లేదా తెగిన గాయాలైనప్పుడు కలబంద గుజ్జు రాస్తారు. షేవింగ్ చేసుకున్న తర్వాత వచ్చే దద్దుర్లను సైతం కలబంద తగ్గిస్తుంది. కలబంద గుజ్జును దద్దుర్లు వచ్చిన చోట పలుచని పొరలా రాసుకోవాలి. కలబంద మొక్క మీకు అందుబాటులో లేకపోతే.. మార్కెట్లో దొరికే అలొవెరా జెల్ ఉపయోగించవచ్చు.

కీరదోస తొక్క తీసి చిన్నచిన్న ముక్కలుగా కోసి మిక్సీలో వేసి మెత్తగా చేయాలి. దీనికి పావు కప్పు పాలు కలిపి ఫ్రిజ్లో పది నిమిషాలుంచాలి. ఆ తర్వాత మిశ్రమాన్ని బయటకు తీసి షేవింగ్ చేసుకున్న చోట రాసి 10 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకుంటే సరిపోతుంది.

ఈ చిట్కాలను ఆడమగ ఇద్దరూ పాటించవచ్చు. చర్మతత్వాన్ని బట్టి ఈ చిట్కాలు పాటిస్తే షేవింగ్ తర్వాత వచ్చే రేజర్ బర్న్స్ తగ్గిస్తాయి. అయితే వచ్చిన తర్వాత తగ్గించుకోవడం కంటే రేజర్ బర్న్స్ రాకుండా చూసుకోవడం మంచిది.

 

Exit mobile version