ఒక రోజు నారదుడు శివపార్వతులను దర్శించుకోవడానికి కైలాసానికి బయలుదేరాడు. కైలాసానికి వెళుతున్న దారిలో కంటకముఖి అనే ఒక యక్షణి పరిహాసంగా, ‘‘నన్ను పెళ్లాడవయ్యా, నారదా! బ్రహ్మఛెర్యం తప్పించుకోవయ్యా బ్రహ్మ కొడుకా!” అని అంది. నారదుడు ఆ మాటకు ఒక్క క్షణం ఉలిక్కి పడి కంటకముఖితో, ‘‘నేను కలహభోజనున్ని.
కలహం వండిపెట్టగలది దొరకాలి కదా!” అన్నాడు. ‘‘నేను, నీ కంటే జగడాలమారిని!” అంది యక్షిణి. ఆమెను ఎలాగైనా వొదిలించుకోవాలని తీక్షణంగా ఆలోచిస్తున్నాడు. ఆ సమయంలో విఘ్నేశ్వరుడూ, కుమార స్వామీ చెట్టాపట్టాలేసుకొని సంతోషంగా వస్తున్నారు. నారదుడు వాళ్ళను చూపిస్తూ, ‘‘ఆ వస్తున్న అన్నతమ్ముళ్ళ మధ్య జగడం తేగలవా?” అన్నాడు.
‘‘ఓస్! అదెంత!”అని కంటకముఖి ఆ క్షణమే పక్కనున్న దళసరోవరంలోకి దూకి బంగారు తామరపువ్వుగా మారి, ‘‘పార్వతీ పరమేశ్వరుల సుపుత్రుడి కోసం వికసించా,” అంటూ కిన్నెర మీటుతున్నట్లు పాట మొదలు పెట్టింది. అన్నదమ్ములిద్దరూ వింత స్వర్ణ పుష్పాన్ని చూసి దాన్ని పట్టుకొని నాది అంటే నాది అని వాదన పెట్టుకున్నారు.
‘‘అమ్మ చేసిన బొమ్మవు నీవు. మురికి ముద్దవు!” అని కుమారస్వామి విఘ్నేశ్వరుణ్ణి ఆక్షేపిస్తే, ‘‘నువ్వు మురికిగుంట శరవణ సరస్సులోంచి వచ్చావు!” అని విఘ్నేశ్వరుడు కుమారస్వామిని ఎత్తిపొడిచాడు. కుమారస్వామి పిడికిలి బిగించి కొట్టబోయాడు. విఘ్నేశ్వరుడు తొండంతో అతని చేతి మణికట్టు బిగించాడు.
ఇద్దరూ కలబడ్డారు. వినాయకుడు కుమారస్వామి నడుము తొండంతో బిగించి పైకెత్తాడు. కుమారస్వామి పైనుంచి బళ్ళాన్ని విఘ్నేశ్వరుడి బొజ్జకు గురిపెట్టాడు. నారదుడు పరుగు పరుగున వచ్చి వారి కలహాన్ని నివారించి, ‘‘ఆ పువ్వు కోసం ఎందుకిలా కలబడుతున్నారు. ఈ పుష్పం ఒక యక్షిణి మీ మధ్య గొడవ పెట్టడానికి ఇలా చేసింది అని చెప్పి గొడవను ఆపాడు.