Home Health గోళ్లపై తెల్లమచ్చలు ఎందుకు వస్తాయి? వాటివల్ల సమస్యలొస్తాయా…!

గోళ్లపై తెల్లమచ్చలు ఎందుకు వస్తాయి? వాటివల్ల సమస్యలొస్తాయా…!

0

అలంకరణలో అందమైన గోళ్లు కూడా ఒక భాగమే. ఈ మధ్య గోళ్లలో రకరకాల నెయిల్ డిజైన్స్ కూడా అందుబాటులోకి వచ్చాయి. అందుకే అమ్మాయిలు గోళ్ల విషయంలో మరింత ఆసక్తి చూపిస్తున్నారు. మగువలు కాదు మగవారు కూడా గోళ్ల విషయంలో శ్రద్ధ తీసుకుంటున్నారు. సాధారణంగా గోళ్ల స్వభావం ఒక్కొక్కరికి ఒక్కో రకంగా ఉంటుంది. కొందరిలో మందంగా ఉంటాయి. వేగంగా పెరుగుతాయి. మరికొందరికి పగిలిపోయి ముక్కలవుతాయి. పొరపొరలుగా ఊడిపోతాయి. జట్టులాగే గోళ్లు కూడా కెరటిన్‌ ప్రొటీన్‌తో ఏర్పడతాయి. 18 శాతం తేమ ఉంటేనే నాణ్యమైన గోళ్లు అన్నమాట.

womens nailsకొంత మంది చేతి వేళ్ల గోళ్ల పై సహజంగానే తెల్లని మచ్చలు వస్తుంటాయి. అయితే ఇవి కొందరికి ఎక్కువగా ఉంటాయి. కొందరి వేళ్లపై మచ్చలు చిన్నగానే ఉన్నా మరి కొందరికి మాత్రం వెడల్పుగా కబడుతుంటాయి. అయితే ఇలా ఎందుకు వస్తుంటాయి అని భయపడుతుంటారు. ఈ మచ్చలు ఎందుకు వస్తుంటాయి, ఆ సమస్య ఏమిటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

వైద్య పరిభాషలో ఈ స్థితిని లుకోనైకియా అంటారు. లుకోనైకియా అంటే గోళ్ళపై తెల్లని గీతలు లేదా చుక్కలు కనిపించే పరిస్థితి. ఇది చాలా సాధారణ సమస్య. మరియు అత్యంత సహజసిద్ధమైనది. ఇది హాని కారకమేమి కాదు. అయితే కొన్నిసార్లు అనారోగ్య సమస్యల వల్ల కూడా చేతి వేళ్ల గోళ్లపై అలా తెల్లని మచ్చలు ఏర్పడుతుంటాయి. గోళ్ల పై మచ్చలు ఏర్పడేందుకు అనేక కారణాలు చెబుతుంటారు. నెయిల్ పెయింట్ లను ఎక్కువగా వాడే వారికి ఆలా మచ్చలు వచ్చేందుకు అవకాశం ఉంటుంది.

గోళ్లకు దెబ్బలు తగిలినా, ఫంగస్ ఇన్ ఫెక్షన్లు వచ్చినా అలా గోళ్లపై తెల్లని మచ్చలు ఏర్పడతాయి. నెయిల్ పాలిష్ లు కొందరికి పడవు. అలర్జీని కలిగిస్తాయి. అలాంటి వారి గోర్లపై కూడా మచ్చలు ఏర్పడుతుంటాయి. జింక్ లేదా కాల్షియం లోపం ఉన్నా కూడా ఆ మచ్చలు వస్తుంటాయి. జింక్, కాల్షియం ఉండే ఆహారాలను ఎక్కువగా తీసుకుంటే ఆ మచ్చలు పోతాయి. గుండె జబ్బులు ఉన్న వారికి, నోటి దుర్వాసన, కిడ్నీ ఫెయిల్యూర్, సొరియాసిస్, ఎగ్జిమా, న్యూమోనియా వంటి వ్యాధులు ఉన్న వారికి కూడా మచ్చలు వస్తాయి. ఆర్సెనిక్ పాయిజనింగ్ అయినా అలా గోళ్లపై తెల్లని మచ్చలు ఏర్పడతాయి.

హస్తరేఖాశాస్త్రం ప్రకారం అరచేతులు, చేతి వేళ్లలో ఉండే కొన్ని సంకేతాల ద్వారా జీవితంలో రాబోయే స్థితిగతులను అంచనా వేయొచ్చు. ముఖ్యంగా చేతి గోర్లపై ఏర్పడే కొన్ని సంకేతాలు మనిషి జీవితంపై చాలా ప్రభావం చూపుతాయి. హస్తరేఖాశాస్త్రం ప్రకారం ఎవరైనా జాతకుల చిటికెన వేలు గోరుపై తెల్లని మచ్చ ఉంటే శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈ సంకేతం వారి విజయాన్ని సూచిస్తుంది. వారు అనుకున్న కార్యాలు నెరవేరుతాయి. హస్తసాముద్రికం ప్రకారం ఎవరైనా వ్యక్తి గోళ్లపై ఇలాంటి సంకేతం ఉంటే దాన్ని తీయడానికి ప్రయత్నించకూడదు.

ముఖ్యంగా తెలుపు రంగు మచ్చలు ఉంటే వారికి పెద్దమొత్తంలో ధనలాభం ఉండబోతుందని అర్థం చేసుకోవాలి. అంతేకాకుండా ఇది ఏ రూపంలోనైనా ఉండవచ్చు. కొన్నిసార్లు ఉద్యోగ, వ్యాపారంలో, మరి కొన్నిసార్లు కుటుంబం నుంచి డబ్బు అందుకునే అవకాశముంది. అంతేకాకుండా బొటని వేలు గోరుపై తెలుపు రంగు మచ్చ ఉంటే మీ జీవితంలో ప్రేమను పొందబోతున్నారని అర్థం చేసుకోవాలి. ఇది వైవాహిక జీవితంలో ప్రేమను పెంచడం గురించి సమాచారాన్ని అందిస్తుంది.

అయితే ఈ మచ్చలు మరీ పెద్దగా, ఎక్కువ సంఖ్యలో ఏర్పడితే వెంటనే డాక్టర్ ను సంప్రదించి పరీక్షలు చేయించుకోవాలి. అవసరం అయితే మందులు వాడాలి. ప్రారంభంలోనే వైద్యులకు చూపించుకున్నట్లయితే అనారోగ్య సమస్యలు రాకుండా ముందుగానే జాగ్రత్త పడవచ్చు.

Exit mobile version