Home Unknown facts దేశం మొత్తంలో గ్రహణం రోజు తెరిచి ఉంచే ఏకైక ఆలయం

దేశం మొత్తంలో గ్రహణం రోజు తెరిచి ఉంచే ఏకైక ఆలయం

0

మన దేశం మొత్తంలో గ్రహణం రోజు తెరిచి ఉంచే ఏకైక ఆలయం శ్రీ కాళహస్తీశ్వరాలయం. దేశంలో ఉన్న అతిపెద్ద ఆలయాలలో ఈ ఆలయం ఒకటిగా చెబుతారు. రాహు కేతు సర్పదోష నివారణ పూజలు ఈ ఆలయంలో విశేషంగా జరుగుతాయి. దేశం నలుమూలల నుండి వచ్చిన భక్తులు ఇక్కడ తమ దోషనివృత్తి కోసం రాహు, కేతు పూజలు నిర్వహిస్తారు. మరి ఏనుగు శ్రీకాళహస్తీశ్వరున్ని ఎందుకు పూజించింది? ఆ ఏనుగుకి ఉన్న శాపం ఏంటనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లా లో శ్రీకాళహస్తి పట్టణం ఉంది. ఈ నగరం స్వర్ణముఖి నదికి తూర్పు ఒడ్డున ఉంది. ఇది చాలా ప్రాచీన ఆలయం. ఈ ఆలయాన్ని క్రీ.శ. 12 వ శతాబ్దంలో రాజేంద్ర చోళుడు అనే రాజు కట్టించాడని చరిత్ర చెబుతుంది. స్థల పురాణం ప్రకారం పరమేశ్వరుడు ఇక్కడ స్వయంభువుగా అవతరించాడని చెబుతుంది.

ఇక పురాణం విషయానికి వస్తే, పూర్వం శివ పార్వతులు ఏకాంతంగా ఉన్న సమయంలో శివకింకరుడు, ప్రమథుడు ద్వారపాలకులు అడ్డుకున్నపటికి వినకుండా లోపలకి వెళ్లడంతో పార్వతిదేవికి కోపం వచ్చి, నీవు రాకూడని సమయంలో మదించిన ఏనుగుల వచ్చావు కావున నీవు మదపుటేనుగువు కమ్ము అని శపించడంతో అప్పుడు శివకింకరుడు పచ్యత్తాపంతో శాప విమోచనం చెప్పమంటూ ప్రార్ధించగా, పార్వతీదేవి అప్పుడు కరుణించి నీవు గజారణ్యంలో శివలింగమును పూజిస్తూ ఉండగా నీవు ఉంచిన పత్రములను, పుష్పములను కాలము అనే సర్పం తీసివేస్తూ ఉంటుంది. అప్పుడు మీ ఇద్దరికీ వైరం ఏర్పడి పోట్లాడుకొని చివరకి ఇద్దరు శివ సాయుజ్యాన్ని పొందుతారు అని శాపవిమోచనం గురించి వివరించింది.

ఇక ఈ పవిత్ర స్థలంలో పరమేశ్వరుడిని అత్యంత భక్తితో శ్రీ అంటే సాలెపురుగు, కాళ అంటే పాము, హస్తి అంటే ఏనుగు ఈ మూడు ప్రాణులు పూజించి ముక్తి పొందినవి. అందువలనే ఈ స్థలమునకు శ్రీకాళహస్తి అనే పేరు వచ్చినది పురాణం. శ్రీకాళహస్తిని దక్షిణ కాశి అని కూడా అంటారు. ఇది దక్షిణ భారతదేశంలోనే ప్రాచీనమైన మరియు పంచభూతలింగములలో నాల్గవదైన వాయులింగం గల గొప్ప శైవక్షేత్రం. ఇక్కడ రెండు దీపాలతో ఒకటి ఎప్పుడు గాలికి రెపరెపలాడుతూ ఉంటుంది. వాయులింగం అనడానికి ఈ దీపం ఒక నిదర్శనం. ఇంకా మరోదీపం ఎల్లప్పుడు నిశ్చలముగా ఉంటుంది.

ఇలా ఎన్నో సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ కాళహస్తీశ్వరుని గ్రహణానంతరం దర్శనం చేసుకునే వారికి దారిద్య్రం, దోషాలు తొలిగిపోయి సకల సంపదలు చేకూరుతాయని విశ్వాసం అందుకే దేశంలోని ఆలయాలన్నీ గ్రహణం రోజున మూతపడినా శ్రీకాళహస్తీశ్వరాలయం మాత్రం తెరిచే ఉంటుంది.

Exit mobile version