అయోధ్యలో ఒకసారి ఆంజనేయుడు రోజువారీ పనులు చేసుకుంటూ శ్రమపడినవాడై, మంచి ఆకలితో అంతఃపురంలోకి వెళ్లి సీతామాతను భోజనము వడ్డించమని అడిగాడు. అప్పుడే స్నానాధికాలు ముగించుకొన్న జానకీదేవీ ‘హనుమా.. కొద్దిసేపు ఆగు. మొదట పాపిటలో సిందూరము పెట్టుకొని తరువాత వడ్డిస్తాను అని అన్నది.
అప్పుడు హనుమంతుడు అమ్మా ! పాపిటలో సిందూరం ధరించటం ఎందుకమ్మా అని ప్రశ్నించాడు. దీనిని నేను నీ ప్రభువు నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని పాపిట పెట్టుకొంటున్నాను సింధూరము సౌభాగ్య వృద్ధిని కలిగిస్తుంది. దీనిని ధరించిన వారి భర్తలు చిరాయువులై వర్థిల్లుతారు అని సీతమ్మ జవాబు చెప్పింది. ఈ మాటవిన్న హనుమంతుడు అక్కడ నుండి వెళ్ళిపోయి కొద్దిసేపు తర్వాత తిరిగి వచ్చాడు ఆయన శరీరం మొత్తం సింధూరము పూసుకొని ఉన్నాడు.
సీతమ్మ ఆశ్చర్యపడి హనుమా.. శరీరమంతా సింధూరం ఎందుకు పూసుకున్నావు అని అడిగింది. అంత మారుతి వినమ్రుడై సిందూరము ధరిస్తే స్వామికి కళ్యాణ ప్రదమై ఉంటుందని నీవే అన్నావుగదా అమ్మా నా ప్రభువు ఎల్లప్పుడు కళ్యాణప్రదంగా ఉండాలని నేను సిందూరము పూసుకొన్నానని సమాధానం ఇచ్చాడు.
హనుమంతుని సమాధానం విన్న సీత ఆనందపరవశ నేత్రాలతో, అతని ప్రభు భక్తికి సంతోషంతో హృదయ పూర్వకంగా ఆశీర్వదించింది. ఆంజనేయుని ప్రభుభక్తికి ఇది నిలువెత్తు నిదర్శనము అనుకుంది.
విషయం తెలిసిన శ్రీరామ చంద్రమూర్తి భక్తికి నువ్వు ఉదాహరణ.ఇక నుండి నిన్ను ఎవరైతే సింధూరంతో పూజిస్తారో వారిని కష్టాల నుండి నేను కాపాడుతాను అని చెప్తాడు.