శివుడు లింగరూపంలో దర్శనం ఇచ్చే ఎన్నో ప్రసిద్ధ ఆలయాలు ఉన్నాయి. కానీ ఈ ఆలయంలో మాత్రం శివలింగం రెండు ముఖాలను కలిగి ఉండి అర్ధనారీశ్వరుడి రూపంలో భక్తులకి దర్శనం ఇస్తుంది. దేశంలో ఎక్కడ లేని విధంగా ఈ ఆలయంలో మాత్రమే శివుడు అర్ధనాధీశ్వరుడిగా కొలువై ఉన్నారు. మరి ఈ శివలింగం గురించి పురాణాలు ఏం చెబుతున్నాయి? ఈ ఆలయం లో ఉన్న ప్రత్యేకతలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.ఏకైక ఆలయం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, చిత్తూరు జిల్లా సువర్ణముఖి నది తీరాన శ్రీకాళహస్తి లోని తొట్టంబేడు మండలంలో విరుపాక్షపురం అనే గ్రామంలో అతి ప్రాచీన అర్ధనారీశ్వరస్వామి దేవాలయం ఉంది. ఈ ఆలయంలోని మూలవిరాట్టు అయినా శివలింగం రెండు రూపాలని కలిగి ఉంది. ఒకప్పుడు ఈ క్షేత్రాన్ని పాపివిచ్ఛేద క్షేత్రం అని పిలిచేవారు. ఇక్కడ వెలసిన ఈ స్వయంభూ లింగం శివుని భాగంగా బావించబడుతూ ఉన్న ఒక భాగం తెల్లగా మంచువలె ఉండగా, రెండవ సగభాగం దేవి భాగం పసుపు రంగుని కలిగి ఉంది.
ఇక ఆలయ స్థల పురాణానికి వస్తే, ఉత్తరదేశంలోని ఆర్యావర్తనంలోని అవంతీనగరంలో విజయ, సుభగలు నివసిస్తుండేవారు. విజయునికి శివుడు అంటే ఎనలేని భక్తి ఉండేది. అయితే ఒకనాడు విజయుడు మార్కండేయ మహర్షిని దర్శించి అయన సలహా మేరకు దక్షిణ కాశిగా పిలువబడే శ్రీకాళహస్తికి వెళ్లి ప్రసూనాంబ సమేత శ్రీ కాళహస్తీశ్వరుడిని ఎంతో భక్తితో సేవిస్తుండేవాడు.
ఒకనాడు నిద్రలో శివుడు శ్రీకాళహస్తికి ఉత్తరంగా సువర్ణముఖి నదీతీరాన దేవతలు, ఋషులు మొదలగు వారిచేత పూజలందుకుంటున్న అర్ధనారీశ్వరుని సేవించి తరించమని చెప్పగా, ఆ దేవుడి ఆజ్ఞ ప్రకారం ఆ నదీతీరం వెంబడి వెళ్లి పాపివిచ్ఛేద క్షేత్రాన్ని చేరి భక్తితో ఆ స్వామిని కొలిచాడు. అయితే విజయుడి భార్య సుభగ కూడా ప్రతి రోజు బంకమట్టితో 108 శివలింగాలు చేసి ఎంతో భక్తితో ఆ స్వామిని పూజించేది.
ఇలా కొంతకాలానికి వారి భక్తికి మెచ్చి శ్రావణమాసం, పూర్ణిమరోజున శ్రీకాళహస్తీశ్వరుడు దేవి సమేతంగా ఆ దంపతులకి ప్రత్యేక్షమై విజయుడు పూజిస్తున్న శివలింగం నందు సతీసమేతంగా ఎల్లపుడు నివసిస్తూ ఉంటామని, ఈరోజు నుండి సుభగాంబ సమేత శ్రీ విజయేశ్వరస్వామి అని మీ దంపతుల పేరున పిలువబడుతూ భక్తుల కోర్కెలు తీర్చెదను అని చెప్పాడని స్థల పురాణం.
ఇంతటి మహిమ గల ఈ ఆలయంలో యజ్ఞము, దానము, తపస్సు చేసినవారికి శ్రీ కాళహస్తీశ్వరుని సన్నిధిలో యజ్ఞ, దాన, తపః ఫలితాలతో సమానమైన ఫలితం దక్కుతుందని భక్తులు విశ్వసిస్తారు.