పూర్వం పరిక్షిత్తు మహారాజు సర్పరాజు కాటుకి గురై మరణించగా అతడి కొడుకు మొత్తం సర్పజాతి లేకుండా చేయాలనీ భావించి సర్పయాగాన్ని చేస్తాడు. మరి ఆ సమయంలో నాగులతల్లి ఏం చేసింది? ఈ ఆలయానికి సర్పయాగానికి సంబంధం ఏంటనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.
తెలంగాణ రాష్ట్రాల్లోని మెదక్ జిల్లాకి కొన్ని కిలోమీటర్ల దూరంలో పాపన్న పేట మండలం నాగ్సాన్ పల్లి గ్రామపంచాయితీ పరిధిలో గణపవరం డామ్ ప్రాంతంలో పర్వతారణ్యాల మధ్య మంజీరానది తీరాన ఆరు కొండ వాగులు మాజీరానదిలో కలిసే ఏడుపాయల క్షేత్రంలో వెలసిన వానదేవతయే ఈ వనదుర్గా భవానీమాత. ఏడు ఉప నదులు ఇక్కడ గోదావరి నదికి ఉప నది అయిన మంజీర నదిలో కలుస్తాయి.
దేవాలయం చుట్టూ అటవీ ప్రాంతంలో పచ్చని చెట్లు, గుట్టలు, గల గల పారే మంజీరానది ఏడుపాయలుగా విడిపోయి కొండవాగుల నడుమ ప్రవహిస్తూ ఉంటుంది. ఈ ప్రవాహాల మధ్యలో ఒక కొండ గుహలో శ్రీ కనుకదుర్గమ్మ స్వయంభూమాతగా గ్రామదేవతగా వెలసింది.
ఇక పురాణానికి వస్తే, ద్వాపర యుగాంతంలో పరిక్షిత్తు మహారాజు సర్పరాజు కాటుకు గురై ప్రాణాలు కోల్పోతాడు. రాజు కొడుకు జనమేజయుడు తండ్రి మరణానికి కారణమైన సర్ప సంతతిని సమూలంగా అంతమొందించాలని సర్పయాగం తలపెట్టాడు. యజ్ఞ గుండాలు నిర్మింపజేసి జమదగ్ని, అత్రి, కశ్యపి, విశ్వామిత్ర, వశిష్ట, గౌతమి, భరద్వాజ వంటి సప్త రుషులతో ఈ యాగం నిర్వహిస్తాడు. యజ్ఞ ఫలితంగా సర్పాలన్నీ వచ్చి అగ్నికి ఆహుతవుతుండటంతో సర్పజాతి అంతమవుతుందనే ఆందోళనతో నాగులతల్లి దేవుళ్లకు వేడుకొనన్నదట.
అప్పుడు నాగులకు పుణ్యలోక గతులు ప్రాప్తించేందుకు గరుత్మంతుడు పాతాళంలోని భోగవతీ నదిని తీసుకుని వస్తాడు. యజ్ఞస్థలికి రాగానే భోగవతీ నది ఏడుపాయలుగా చీలి ప్రవహించిందట. సర్పయజ్ఞ గుండాలను ముంచుతూ ఓ పాయ రాతిగుహలో వెలిసిన దుర్గామాత పాదాలను తాకుతూ గోదావరిలో కలిసిందట. ఏడుగురు రుషులతో యజ్ఞం చేయడం, గంగాదేవి ఏడుపాయలుగా చీలి ప్రవహించడం వల్ల ఏడు పాయలు అనీ అమ్మవారికి ఏడుపాయల దుర్గామాత అని పేరు వచ్చింది.
అయితే ప్రాశస్త్యం ఉన్నప్పటికీ కొన్నాళ్లపాటు ఏడుపాయల దుర్గమ్మ ఆలయం ప్రాభవం కోల్పోవడంతో కాశీనాథ యోగీంద్రుడనే అవధూత కాశీ నుంచి 16 కళశాలను తీసుకొచ్చి ఏడుపాయల దుర్గామాత ఆలయంలో విడిది చేశారట. దుర్గామాత అతని కలలో దర్శనమిచ్చి ఈ క్షేత్రాన్ని పునరుద్దరించమని ఆజ్ఞాపించిందట. ఈ మేరకు కాశీనాథ యోగీంద్రులు కాశీకి తిరిగి వెళ్లకుండా రాతిపై యంత్రం వేసి.. దుర్గా మహామంత్ర పుణశ్చరణ చేసి అమ్మవారిని భక్తితో కొలవాలని సూచించి అంతర్ధానమైపోయాడట. యంత్ర మహిమ వల్ల వనదుర్గామాత భక్తులకు కల్పవల్లిగా వెలుగొందుతున్నదని భక్తుల నమ్మకం.
ప్రతీ సంవత్సరం మహాశివరాత్రి నాడు ఏడుపాయల జాతర జరుగుతుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్నాటక, మహారాష్ట్రల నుంచి భక్తులు లక్షలాదిగా తరలివస్తారు. మంజీరా నదిలో పుణ్యస్నానాలు చేసి అమ్మను దర్శించుకుని భక్తిపారవశ్యంలో పరవశిస్తారు. విశాలమైన ఏడుపాయల ప్రాంగణం జాతర జరిగినన్ని రోజులు అశేష జనవాహినితో జనసంద్రంగా దర్శనమిస్తుంది.
ఈవిధంగా ఏడుపాయల వనదుర్గా భవాని స్వయంభూమాతగా వెలసి భక్తులను విశేషంగా ఆకట్టుకుంటుంది.