పాండవులకు, కౌరవులకు మధ్య జరిగిన మహా యుద్ధమే కురుక్షేత్రం. 18 రోజుల పాటు జరిగిన ఈ మహాసంగ్రామంలో కౌరవలు అందరు మరణించారు. అయితే ఈ యుద్ధం జరిగిన ప్రదేశమే కురుక్షేత్రం. దృతరాష్ట్రుడు కావాలనే మహాభారతయుద్ధానికి ఈ ప్రదేశాన్ని నిర్ణయించాడు. మరి అయన ఈ ప్రదేశాన్నే ఎందుకు ఎంచుకున్నాడు? ఈ స్థలం యొక్క గొప్పతనం ఏంటనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.
హర్యానా రాష్ట్రం లో కురుక్షేత్రం అను ప్రదేశం ఉంది. మన అందరికి కురుక్షేత్రం అంటే మహాభారతయుద్ధం జరిగిన ప్రదేశంగానే తెలుసు కానీ అతకుముందు చాలా కాలం నుండే ఈ ప్రదేశం కురు భూమి, కురుక్షేత్రం అనే పేరుతో ప్రసిద్ధిచెందింది.
ఇక పురాణానికి వస్తే, ఒకప్పుడు కురు అనే రాజు ఈ ప్రాంతానికి వచ్చాడు. ఈ ప్రాంతం చుట్టూ మొత్తం ఎనిమిది నదులు ప్రవహిస్తూ ఉన్నాయి. ఇంతటి పవిత్రమైన ప్రదేశం చుసిన ఆ రాజు తన బంగారు రథంలో నుంచి దిగి ఒక నాగలిని తయారుచేసాడు. ఆ తరువాత శివుడిని అడిగి నందిని, యముడిని అడిగి అయన వాహనమైన మహిషాన్ని తీసుకువచ్చి వాటిని నాగలికి కట్టి ఇక్కడ భూమిని దున్నటం మొదలుపెట్టాడు.
ఆ సమయంలో అక్కడికి వచ్చిన ఇంద్రుడు ఎం చేస్తున్నావు అని కురును అడుగగా అప్పుడు కురు తను సత్యము, దయ, క్షమ, దానము, స్వచ్ఛత, నిష్కామము, బ్రహ్మచర్యము, యోగము అనే ఎనిమిది పంటలను పండించడానికి దున్నుతున్నాని చెప్పాడు. మరి ఆ పంటలను పండించడానికి తగిన విత్తనములు ఎక్కడ ఉన్నాయని ఇంద్రుడు అడుగగా, అవి తనలోనే ఉన్నాయని సమాధానం చెప్పాడు.
ఇక కొద్దిసేపటి తరువాత అక్కడికి విష్ణువు వచ్చి అవే ప్రశ్నలు అడిగి, ఆ విత్తనాలు నీలోనే ఉంటె వాటిని చూపించమని ఆ స్వామి అడిగాడు. అప్పుడు కురుమహారాజు తన శరీరాన్ని విషమూర్తికి అప్పగించాడు. విష్ణువు తన చక్రాయుధంతో కురు శరీరాన్ని ముక్కలుగా నరికివేశాడు. దానికి కురు ఎలాంటి అభ్యంతరం చెప్పకపోవడంతో అతడిని మెచ్చుకొని శరీరం యధాప్రకారం అయ్యేట్లు చేసి ఏదైనా వరం కోరుకో అని చెప్పాడు. అప్పుడు కురు మహారాజు వెంటనే తన తదనంతరం ఈ ప్రదేశం తన పేరుమీద ప్రసిద్ధి చెందాలని, ఈ క్షేత్రంలో చనిపోయినవారికి స్వర్గప్రాప్తి కలగాలని రెండు వరాలు కోరాడు. ఇలా కురుమహారాజు చూపిన త్యాగం కారణంగా ఈ ప్రాంతానికి ధర్మక్షేత్రం అని పేరు వచ్చింది.
ఇక మహాభారతం విషయానికి వస్తే, పాండవులకు మరియు కౌరవులకు మధ్య యుద్ధం ఎక్కడ జరగాలని చర్చకు వచ్చినప్పుడు దృతరాష్ట్రుడు కురుక్షేత్రం లో జరుగాలని నిర్ణయించాడు. అయన అలా నిర్ణయించడం వెనుక కారణం ఏంటంటే, అనేక పాపాలు చేసిన ఆయన కుమారులు కౌరవులు యుద్ధంలో మరణిస్తారని, ఈ ప్రాంతంలో యుద్ధం జరిగితే ఇక్కడ మరణించి స్వర్గప్రాప్తిని పొందుతారని ఆశించి ఈ ప్రదేశాన్ని యుద్ధ రంగంగా నిర్ణయించాడని పురాణం.