మన దేశంలో అష్టాదశ శక్తి పీఠాలలో ఈ ఆలయం కూడా ఒకటిగా చెబుతారు. ఈ ఆలయంలో కామాక్షిదేవి పూజలందుకుంటుంది. మరి ఈ ఆలయంలో ఉన్న విశేషాలు ఏంటి? ఈ ఆలయం ఎక్కడ ఉందనే విశేషాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.
తమిళనాడు రాష్ట్రం, కాంచీపురం జిల్లా శివకంచిలో కామాక్షిదేవి ఆలయం ఉంది. ఈ ఆలయంలోని అమ్మవారు యోగముద్రలో పద్మాసనంపై ఆసీనురాలై భక్తులకి దర్శనమిస్తుంది. అయితే కొన్ని వేల ఆలయాలు ఉన్న కంచిలో ఒక్క కామాక్షి అమ్మవారి ఆలయం తప్ప మరొక ఆలయం లేకపోవడం విశేషం. కామాక్షి విలాసం అనే పురాణ గ్రంధంలో ఉన్న ప్రకారం ఇక్కడ అమ్మవారు తన శక్తి రూపాల్లోని శక్తినంతటిని గ్రహించి మన్మధుని లో ఆవహింపజేస్తుందని తెలియుచున్నది.
మరొక పురాణం ప్రకారం, రాజరాజేశ్వరీ ఆసనంలో ఉండటం వలన అమ్మవారు సృష్టిలోని అన్ని శక్తులమీద తన ప్రభావం కనబరుస్తుందని పురాణం. సాధారణంగా ప్రతి ఆలయంలో స్వామివారి విగ్రహానికి ప్రక్కనే అమ్మవారి విగ్రహం ఉండటం ఆనవాయితీ, కానీ కంచిలో కామాక్షి అమ్మవారి ఆలయం ఏకామ్రేశ్వరస్వామి ఆలయానికి సుమారు రెండు ఫర్లాంగుల దూరంలో ఉంటుంది.
ఇక మరొక విశేషం ఏంటంటే, ప్రతి దేవాలయంలోనూ ఆయా దేవతకు సంబంధించిన బీజాక్షరాలు చెక్కిన ఒక యంత్రాన్ని పీఠంలో ఉంచి దానిమీద దేవత విగ్రహాన్ని ప్రతిష్ట చేస్తారు. దీనినే ప్రాణప్రతిష్ట అని అంటారు. కానీ కామాక్షి అమ్మవారి ఆలయంలో అలంటి యంత్రం కామాక్షి విగ్రహానికి ఎదురుగా ప్రతిష్టింపబడి ఉంది. పూజ కార్యాక్రమాలు అన్ని కూడా ఈ యంత్రానికే జరుగుతాయి.
ఆ యంత్రం వెనుక ఒక పురాణం ఉంది, ఇక్కడ అమ్మవారు ఉగ్ర రూపునిగా ఉంటూ బలులు తీసుకుంటూ రాత్రిపూట కాలికరూపం ధరించి ఆలయం నుండి బయటకి వచ్చి ఊరంతా సంచరిస్తూ ఉండేదంట, అప్పుడు ప్రజలంతా భయబ్రాంతులకు గురైతే, శంకరాచార్యుల వారు కఠోరమైన తపస్సు చేసి ఆమెని ప్రసన్ను రాలుని చేసుకొని, ఇకముందు నుండి తన అనుమతి లేనిదే ఆలయం ధాటి బయటకి వెళ్లకుండా ఉండేట్లు వరం పొందారట. దానికోసమే ఆయన ఈ యంత్రాన్ని తయారుచేసి అమ్మవారి విగ్రహం ఎదురుగా బంధ ప్రతిష్ట చేసారని పురాణం.
ఈవిధంగా వెలసిన ఈ అమ్మవారి ఆలయంలో ప్రతి సంవత్సరం మర్చి లో జరిగే రథోత్సవం లో భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు.