మనం కొంతమంది వీరుల గాధలు విన్నప్పుడు మనలో ఒక తెలియని ధైర్యం అనేది వస్తుంటుంది. అలాంటి ఒక గొప్ప యుద్ధ వీరుడి గురించే మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. అయితే చరిత్ర చూసుకుంటే చత్రపతి శివాజీ, రాణాప్రతాప్, పృథ్వీరాజ్ చౌహన్ లాంటి వీరోచిత చక్రవర్తులు మనకి తెలుసు కానీ మనలో కొందమందికే తెలిసిన చక్రవర్తి హేమచంద్ర విక్రమాధిత్య. మరి చిట్ట చివరి హిందూ చక్రవర్తి అని చెప్పే ఈయనని గొప్ప వీరుడని ఎందుకు అంటారో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
హేమచంద్ర విక్రమాదిత్య అక్టోబర్ 2, 1501 లో హర్యానాలో జన్మించారు. ఈ చక్రవర్తి సంస్కృతం, హిందీ, అరబిక్ భాషల్లో ప్రావీణ్యం సాధించారు. అయితే మధ్యయుగంలో ఉత్తర భారతావని మొఘలులపై వీరోచితంగా పోరాడిన హిందూ చక్రవర్తి హేమచంద్ర విక్రమాదిత్య. ఇక 1553-1555 మధ్య కాలంలో ఆదిల్ షా సూరి పాలనలో సేనాధిపతిగా, ప్రధానిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆ తరువాత అక్టోబర్ 6, 1556లో తుగ్లక్ బాద్ లో సైన్యంలో చేరి 1556 నవంబర్ 5న పానిపట్టు యుద్ధంలో కీలక భూమిక పోషించారు. ఇలా మొత్తం హేమచంద్ర చక్రవర్తి 22 యుద్ధాల్లో విజయం సాధించారు.
అయితే 1556లో ఉత్తరాదిన మొఘలులను, వారి సైన్యన్ని తరమివేసి పాలనను విస్తరించి గ్వాలియర్, తుగ్గకాబాద్ లను జయించారు. బీహార్, బెంగాల్ లో తనపై తిరుగుబాటు చేసిన ఆప్ఘన్లను ఉక్కుపాదంతో అణిచి వేసి చునాల్ కోటను జయించారు. అంతేకాకుండా హుమాయున్ మొఘల్ చక్రవర్తి మరణం తర్వాత పలువురు మొఘలులను ఓడించారు. ఇలా జరుగుతున్న నేపథ్యంలో 1556లో ఢిల్లీని జయించిన సందర్భంగా విక్రమాదిత్య బిరుదును పొందారు.
అక్బర్, బైరాంఖాన్ లతో పానిపట్టు యుద్ధం చేశారు హేమచంద్ర విక్రమాదిత్య. అతిపెద్ద సైన్యంతో చేసిన ఈ యుద్ధంలో ఆయన ఎడమ కంటికి తీవ్ర గాయమైంది. దీంతో మొఘల్ సైనికులకు బందీ అయ్యారు. బైరాంఖాన్ అతి క్రూరంగా హేమచంద్ర తలను నరికేశాడు. అలాగే హేము తండ్రిని ఇస్లాంలోకి మారమని బెదిరించారు మొఘలులు. దానికి ఒప్పుకోకపోవడంతో చిత్రహింసలు పెట్టి చంపేశారు. ఆగ్రా కోటలోని గుమ్మానికి ఆ చక్రవర్తిని తలను వేలాడదీశారు. అలా ఢిల్లీకి, ఉత్తర భారతదేశానికి వీరోచిత పాలన అందించిన చివరి హిందూ చక్రవర్తి హేమచంద్ర విక్రమాదిత్య చరిత్రలో నిలిచిపోయారు.