శ్రీ మహావిష్ణువు లోకకల్యాణం కోసం దశావతారాలు ఎత్తాడు. అందులో శ్రీకృష్ణవతారం ఒకటి. పురాణాల ప్రకారం శ్రీకృష్ణుడు కంసుడి చెరసాలలో జన్మిస్తాడు. మరి ఇప్పుడు ఆ ప్రదేశం ఎక్కడ ఉంది? అక్కడి విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం, ఆగ్రాకి కొన్ని కిలోమీటర్ల దూరంలో యమునానది తీరంలో మధుర ఉంది. ఈ నగరంలోనే శ్రీకృష్ణుడు జన్మించాడు. అందుకే ఈ ప్రదేశాన్ని శ్రీకృష్ణ జన్మభూమి గా, పవిత్ర ప్రదేశంగా, 108 దివ్యతిరుపతులలో ఒకటిగా ఖ్యాతి చెందింది.
ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడి మేనమామ కంసుడు పరిపాలిస్తున్న సూర్యసేన సామ్రాజ్యానికి మధుర రాజధాని. అయితే శ్రీ కృష్ణుడు నడచిన ఈ పవిత్ర ప్రాంతాలన్నీ శ్రీకృష్ణుని లీలాక్షేత్రాలుగా ప్రసిద్ధి చెందాయి. మధుర, బృందావనం, బలదేవ్, గోకులం, గోవర్ధనం, నందగావ్ మొదలగు ప్రాంతాలన్నీ కలిపి వజ్రమండలంగా పిలుస్తారు. ఈ వజ్ర భూమికి ప్రదక్షిణ చేస్తే, సప్తద్విపములకు ప్రదక్షిణ చేసిన పుణ్యం కలుగుతుంది.
ఇది ఇలా ఉంటె, శ్రీకృష్ణుడి జన్మస్థానం అంటే దేవకీ, వసుదేవుల జైలు ఉన్న ఈ ప్రదేశంలో హిందువులు పూజలు జరుపుతారు. మధురలో చూడవలసిన వాటిలో అత్యంత ప్రధానమైనది జన్మస్థాన్ లేక శ్రీకృష్ణ జన్మ స్థలం అనే ఆలయం.
ఈ ఆలయం చాలా విశాలమైన ఆవరణలో రెండు అంతస్థుల ఎత్తున నిర్మించబడి ఉంది. ఈ ఆలయానికి ఉత్తరం వైపు ఉన్న గదిలో 4 అడుగుల ఎత్తు ఉన్న వేదికమీద శ్రీకృష్ణుడు పసిబాలుడిగా ఉన్నప్పటి విగ్రహమూర్తి ఉంది. శ్రీకృష్ణుడి విగ్రహ మూర్తి చాల అందంగా, ఆకర్షణీయంగా ఉంటుంది. ఇది శ్రీకృష్ణుడు జన్మించిన చెరసాల గది అని చెబుతారు. కానీ కొందరు మాత్రం అసలైన చెరసాల ఔరంగజేబు నిర్మించి ఉన్న మసీదులో ఉన్నదని చెబుతుంటారు.
ఈవిధంగా శ్రీకృష్ణుడి జన్మ భూమి అయినా ఈ ప్రాంతంలో ప్రతి అడుగు పవిత్రం అని ఈ పవిత్ర ప్రాంతాలన్నీ శ్రీకృష్ణుని లీలాక్షేత్రాలుగా చెబుతారు