శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో ఈ దేవాలయం కూడా ఒకటి. ఇక్కడ విశేషం ఏంటంటే నరసింహస్వామి వారి అన్ని క్షేత్రాలలో లేనివిధంగా ఈ ఒక్క ఆలయంలో మాత్రమే అయన భక్త ప్రహ్లాదుని సహిత భక్తులకి దర్శనం ఇస్తుంటారు. మరి ఇంతటి ప్రసిద్ధమైన ఈ క్షేత్రం ఎక్కడ ఉంది? ఈ ఆలయ స్థల పురాణానికి సంబంధించిన విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లా, హిందూపురాణానికి తూర్పు దిక్కున సుమారు 90 కీ.మీ. దూరంలో కడపజిల్లా సరిహద్దులో ఉన్న కదరి గ్రామంలో శ్రీమత్ కదిరి లక్ష్మి నరసింహ స్వామి వారి ఆలయం ఉన్నది. ఇది రెండున్నర ఎకరాలలో నిర్మించబడి ఉంది. ఇది చాలా పురాతన ఆలయంగా ప్రసిద్ధి చెందింది. ఇచట కదిరి వృక్షం నందు స్వామివారు స్వయంభువుగా వెలిశారు. హరిహర బుక్కరాయుల కాలంలో ఈ ఆలయ నిర్మాణం జరిగినట్లు తెలుస్తుంది.
పురాణానికి వస్తే, శ్రీ మహావిష్ణువు దానవుడైన హిరణ్య కశిపుని శిక్షణకు భక్తుడైన ప్రహ్లాదుని రక్షణకు నరసింహుని అవతారంలో స్తంభం నుంచి ఉద్భవించాడు. హిరణ్యకశిపుడిని సంహరించిన తర్వాత ఆ ఉగ్రరూపంలోనే కదిరి సమీపంలోని కొండపై సంచరించసాగాడు. స్వామి అలాగే ఉండటం సరికాదని ఆయనను శాంతింప చేయాలని భావించిన మహర్షులు, దేవతలు ఆ కొండపైకి చేరి నరసింహుణ్ణి స్తోత్రిస్తూ నెమ్మదిగా శాంతింప చేశారు. అలా ఆ కొండకు సోత్రాద్రి అని పేరు వచ్చింది. అంతేకాకుండా అయన క్రోధతాపాన్ని ఉపశమింపచేయుటకు స్వామికి ఎడమవైపున ప్రహ్లదుడు నిలబడి స్తుతిస్తున్నట్లు మనకు దర్శనమిస్తున్నారు.
దీనికి గుర్తుగా ఆ కొండపై కదిరికొండ లక్ష్మి నరసింహ దేవస్థానం ఉంది. అదే కొండపై భక్తులకు విష్ణుపాదాలు కూడా కనిపిస్తాయి. ఖ అంటే విష్ణుపాదమని, అద్రి అంటే కొండ అని విష్ణుపాదాలు ఉన్న కొండ కనుక ఈ ప్రాంతానికి ఖద్రి లేదా ఖాద్రి అనే పేరు వచ్చిందని అంటారు.
దుష్ట శిక్షణ, శిష్టరక్షణ కోసం శ్రీ మహావిష్ణువు సగంమనిషి, సగం సింహంగా నరసింహావతారంలో భీకర రౌద్ర స్వరూపంతో అవతరించాడు. హిరణ్య కశిపుడి సభామంటపం నందలి çస్తంభం నుంచి స్వామి ఆవిర్భవించాడు కనుక శ్రీవారిని కంబాలరాయుడని భక్తులు పిలుచుకుంటాడు. అలా ఈ స్వామికి కాటమరాయుడు, భేట్రాయస్వామి అనే పేర్లు కూడా ఉన్నాయి. అన్నమాచార్యులు సైతం తన కీర్తనల్లో సైతం శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని కాటమరాయుడా అని కీర్తించారు. కాటమరాయుడు అనే పేరు ఎలా వచ్చిందంటే కదిరి నియోజకవర్గంలోని గాండ్లపెంట మండలం గొడ్డువెలగల సమీపంలోని కొండపై చండ్రవృక్షపు కొయ్య స్తంభం నుంచి నరసింహ స్వామి వెలసినట్లు భక్తుల విశ్వాసం. ఆ కొండను ఆనుకొని కాటం అనే కుగ్రామం కూడా ఉండటంతో స్వామిని కాటమరాయుడిగా పిలుస్తున్నారు.
ఈవిధంగా వెలసిన నరసింహస్వామిని దర్శించుకొనుటకు తెలుగు రాష్ట్రాల నుండే కాకుండ కర్ణాటక నుండి కూడా భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు.