మన హిందూ పురాణాల ప్రకారం కొందరు కొన్ని యుగాల నుండి ఇప్పటికి ఇంకా బ్రతికే ఉన్నారని చెబుతున్నారు. అయితే వీరు మృత్యుంజయులని వీరికి అసలు మరణం అనేది లేకుండా ఎప్పుడు చిరంజీవులుగానే ఉంటారని పురాణాలూ చెబుతున్నాయి. మరి ఆ చిరంజీవులు ఎవరు? వారు ఇంకా బ్రతికే ఉన్నారని చెప్పడం వెనుక కారణాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.
పరశురాముడు:
శ్రీమహావిష్ణువుకు ఉన్న 10 అవతారాల్లో పరశురామావతారం కూడా ఒకటి. ఇతను 21 సార్లు విశ్వంలో ఉన్న చక్రవర్తులందరినీ జయిస్తాడు. ఇందుకోసమే విష్ణువు ఇతన్ని కాలాలకు సమన్వయకర్తగా నియమించినట్టు చెబుతారు. ఇతను కూడా మృత్యుంజయుడే. ఇప్పటికీ ఇతను జీవించే ఉన్నాడని చెబుతారు.
విభీషణుడు:
రావణుడి తమ్ముడు విభీషణుడు. ఇతను రాముడికి యుద్దంలో సహకరిస్తాడు. దీంతో రాముడు ఇతనికి మరణం లేకుండా మృత్యుంజయునిగా చేస్తాడు. ఈ క్రమంలోనే విభీషణుడు ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో తిరుగుతూ ఉంటాడంటారు. ఇతనికి చెందిన గుడి ఒకటి రాజస్థాన్‌లోని కోటా అనే టౌన్ లో ఉంది. దేశంలో విభీషణుడికి ఉన్న ఏకైక ఆలయం ఇదే. ఇక్కడే విభీషణుడు ఇప్పటికీ తిరుగుతూ ఉంటాడని చెబుతుంటారు.
బలి చక్రవర్తి:
మూడడుగుల స్థలం కోరి వామనుడి రూపంలో వచ్చిన శ్రీమహావిష్ణువుచే పాతాళ లోకానికి తొక్కబడిన బలి చక్రవర్తి మనకి తెలుసు. అతను ఇప్పటికీ బతికే ఉన్నాడట. ప్రతి ఏటా ఒక రోజున అతను పాతాళ లోకం నుంచి భూమిపైకి వస్తాడని అదే రోజున కేరళీయులు ఓనమ్ పండుగ జారుకుంటారని అంటారు.
మార్కండేయ మహర్షి:
చాలా చిన్న వయస్సులోనే మరణం ఉందని తెలుసుకున్న మార్కండేయుడు శివునికై తపస్సు చేసి ఆయనచే మహామృత్యుంజయ మంత్రం పొందుతాడు. ఈ క్రమంలోనే మార్కండేయుడు మృత్యుంజయుడిగా మారుతాడు. అందుకే ఆయనకు కూడా మరణం ఉండదు. ఇప్పటికీ బతికే ఉన్నాడని చెబుతారు.
అశ్వత్థామ:
మహాభారతంలో అశ్వత్థామది ఒక ముఖ్యమైన పాత్ర. ఇతను ద్రౌపది కుమారులను నిద్రలోనే చంపుతాడు. అభిమన్యుడి కుమారుడు పరీక్షిత్తును కూడా తల్లి గర్భంలో ఉండగానే చంపుతాడు, కానీ కృష్ణుడు అతన్ని బతికిస్తాడు. అనంతరం కృష్ణుడు అశ్వత్థామకు శాపం పెడతాడు. అందులో భాగంగానే అశ్వత్థామ ఇప్పటికీ జీవించే ఉంటాడని చెబుతారు.
వేద వ్యాసుడు:
మహాభారతాన్ని రాసిన వేద వ్యాస మహర్షి కూడా మృత్యుంజయుడే. ఇతనికీ మరణం లేదట. ఇప్పటికీ జీవించే ఉన్నాడట.
కృపాచార్యుడు:
కృపాచార్యుడు పాండవులు, కౌరవులకు గురువు. ద్రోణుడికి బంధువు. ఇతనికి కూడా మరణం లేదని చెబుతారు.
ఆంజనేయ స్వామి:
భక్తులను కాపాడే కలియుగ దైవంగా హనుమంతుడు పేరుగాంచాడు. ఈయన కూడా మృత్యుంజయుడే. ఈయన ఎప్పటికి చిరజీవుడే అని చెబుతారు.
మన హిందూ పురాణాల ప్రకారం ఈ ఎనిమిది మంది వ్యక్తులు చిరజీవులై కొన్ని యుగాల నుండి ఇప్పటికి బతికే ఉన్నారని చెబుతున్నారు.