భారతదేశం గర్వించ దగ్గ మేధావులలో ఒకరు సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య. సెప్టెంబర్ 15 జాతీయ ఇంజనీర్స్‌డే జరుపుకోవడానికి కారణం ఆ రోజు మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి జన్మదినం. సివిల్ ఇంజనీర్ గా ఆయన అందించిన సేవలు ఎప్పటికి చిరస్మరణీయం. దేశానికి 30 సంవత్సరాల పాటు ఆయన అందించిన సేవలను ఒకసారి గుర్తుచేసుకుంటూ ఆయన జీవితంలోని కొన్ని విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.
మోక్షగుండం విశ్వేశ్వరయ్య 1860, సెప్టెంబరు 15న బెంగుళూరు నగరానికి 60 మైళ్ళ దూరంలో ఉన్న చిక్కబళ్ళాపుర తాలూకా, ముద్దెనహళ్ళి అనే గ్రామంలో జన్మించారు. వీరి పూర్వికులది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ప్రకాశం జిల్లాలోని మోక్షగుండం గ్రామం, అయితే కొన్ని శతాబ్దాల క్రితం వీరు మైసూర్ కు వలస వెళ్లారు. ఆయన 1883 లో ఇంజనీరింగ్ పరీక్షల్లో ఉత్తీర్ణులై బంగారు పతకం సాధించారు. 1984లో మహారాష్ట్ర ప్రభుత్వంలో ఇంజనీర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించారు. ఈయన నీటి ప్రవాహానికి ఆనకట్టల కి ఎటువంటి ప్రమాదం కలగకుండా దేశంలోనే మొట్టమొదటి సారిగా ఆటోమేటిక్ గేట్ల వ్యవస్థను రూపొందించారు.
ఇక 1908లో మూసీ నదికి వరద రావడంతో హైదరాబాద్ నగరం తల్లడిల్లింది. వరదల నుండి రక్షణ కోసం అప్పటి నిజాం నవాబు విశ్వేశ్వరయ్యను ఆహ్వానించి ఒక పథకం రూపొందించాలని కోరారు. నగర మురుగునీటి పారుదల పథకాన్ని కూడా తయారుచేయమని కోరారు. 1909 ఏప్రిల్ నుండి అక్టోబర్ వరకు విశ్వేశ్వరయ్య ఈ పని మీదనే శ్రమించారు. 250 కోట్ల రూపాయలతో పథకాలను సిద్ధం చేశారు. అయితే ఈ పనులు వెంటనే అమలు పరచలేదు. ఎందుకంటే హైద్రాబాద్‌లోని బ్రిటీష్ ఇంజనీర్లు ఆ పనుల అమలుకు విముఖంగా ఉండడం వల్ల జాప్యం జరిగింది. ఆ తర్వాత ఆయన పథకాలనే అమలుపరిచారు. దాని పర్యవసానమే మూసీ, ఈసీ నదులపై రిజర్వాయర్లను నిర్మించారు. వీటి నిర్మాణంతో హైదరాబాద్ నగరానికి వరద ప్రమాదం తప్పిపోయింది.
ఇంత గొప్ప పధకాన్ని రూపొందించిన విశ్వేశ్వరయ్యను అప్పటి నిజాం నవాబులు, బ్రిటిష్ ఇంజీనీర్లు అభినందించారు. అంతే కాకుండా విశాఖపట్నం రేవును సముద్రపు కోత నుండి రక్షించే వ్యవస్థను రూపొందించడంలో కీలక పాత్ర పోషించారు. కావేరి నదిపై జరిగిన క్రిష్ణరాజసాగర్ ఆనకట్ట పనులలో పూర్తిగా బాధ్యత వహించి దీనిని విజయవంతంగా పూర్తి చేయడంలో కీలక పాత్ర వహించారు. ఇలా నీటి పారుదల వ్యవస్థలో ఎన్నో సమూల మార్పులు తీసుకొచ్చారు.
దేశ జనాభాకు అనుగుణంగా ఆహారాన్ని పండించాలని ఆయన చెప్పారు. 1931లో ఆంధ్రా యూనివర్శిటీ స్నాతకోత్సవంలో కష్టపడి చదవడం ద్వారానే ఉత్తీర్ణులవుతామని, అంతేకానీ విజయ రహస్యాలంటూ ఏమీ ఉండవని అన్నారు. అభివృద్ధి సాధించేందుకు కష్టించి పనిచెయ్యడమే మార్గమని చెప్పారు. ఏ దేశ అభివృద్ధి అయినా వ్యవసాయం, పారిశ్రామిక పురోగతిపై ఆధారపడి ఉంటుందని విశ్వేశ్వరయ్య నమ్మకం. ఇక మూఢాచారాలు, సంఘంలోని వివిధ రకాల దురాచారాలు మొదలైనవాటిపై పోరాడాలని పిలుపునిచ్చారు. కర్మ సిద్ధాంతం, గుడ్డి నమ్మకాల్ని వదిలపెట్టండని ప్రజలకు హితవు చెప్పారు. విదేశీ వస్తువులను కొనుగోలు చేయడాన్ని విశ్వేశ్వరయ్య వ్యతిరేకించారు. అంతేకాకుండా రాష్ట్ర, దేశ అభివృద్ధికి పంచవర్ష ప్రణాళికలను సూచించారు.
1911 అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం ఇతను ప్రజలకు చేసిన సేవలకు గాను నైట్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఇండియన్ ఎంపైర్ అనే బిరుదు తో సత్కరించింది. 1955 లో భారతదేశపు అత్యున్నత పురస్కారం భారతరత్న తో భారత ప్రభుత్వం సత్కరించింది.
పని చేయటం దండగయితే నీవు తినటం దండగే నీకు అవసరం లేనిది నీవు కొంటూ ఉంటే నీవు కొనలేనిది నీకు అవసరమనిపిస్తాయి అని ఆయన చెప్పేవారు.
సివిల్ ఇంజనీరింగ్ లో ఒక కొత్త ఒరవడి సృష్టించిన భారతదేశంలోనే మొట్టమొదటి ఇంజనీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య మన దేశానికి దొరికిన ఒక గొప్ప వరం.