మన దేశంలో వినాయకుడి ఆలయాలు ఎన్నో ఉన్నాయి. మన సంప్రదాయం ప్రకారం ప్రతి పూజలో వినాయకుడిని ముందుగా పూజిస్తాం. అయితే పూర్వం ఈ ఆలయంలో 108 శివలింగాలు కలసి గణపతి రూపాన్ని ధరించాయట. మరి 108 శివలింగాలు కలసి గణపతి రూపాన్ని ఎందుకు ధరించాయి? గణపతికి కోపం ఎందుకు వచ్చింది? ఈ ఆలయ విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.
తమిళనాడు రాష్ట్రం, చెన్నై నగరంలో పొన్నేరి అనే ప్రాంతానికి కొంత దూరంలో అంకోల గణపతి ఆలయం ఉంది. ఈ ప్రాంతాన్ని చిన్నకావనముగా పిలుస్తారు. ఈ ఆలయ గర్భాలయంలో శ్రీ చతుర్వేదేశ్వర స్వామి, శ్రీ నూటె ట్రెశ్వరస్వామి విడివిడిగా దర్శనం ఇస్తారు. గర్భాలయం వెలుపల రెండు శివలింగాలు రెండు నందులు ఉంటాయి. ఈ ఆలయంలో ఉన్న అంకోల వృక్షం అనేది మరి ఏ ఇతర ఆలయాలలో కనిపించక పోవడం ఈ ఆలయ ప్రత్యేకత గా చెప్పుకోవచ్చు.
ఇక పురాణం విషయానికి వెళితే, శివుడి ఆజ్ఞమేరకు ఇక్కడికి వచ్చిన అగస్త్య మహామునికి ఒక రోజు కాశి క్షేత్రాన్ని సందర్శించాలనే కోరిక కలిగింది. ఆ సమయంలో అయన కలలో శివుడు కనిపించి నీవు మరి కొంత కాలం ఇక్కడే ఉండాలి, ఇక్కడి నది తీరాన చతుర్వేదపురంలో నేను చతుర్వేదేశ్వరునిగా కొలువై ఉన్నాను. ఇక్కడే ఉన్న అంకోల వృక్షం కింద నూట ఎనిమిది రోజులు రోజుకొక సైకత లింగాన్ని చేసి పూజిస్తే నీకు కాశి యాత్ర ఫలం దక్కుతుందని చెప్పాడు.
ఈవిధంగా శివుడు చెప్పిన విధంగానే అగస్త్య మహాముని అంకోల వృక్షం క్రింద 108 రోజులు 108 శివలింగాలను ప్రతిష్టించగా చివరి రోజున అన్ని లింగాలు కలసి గణపతి రూపాన్ని ధరించాయి. అప్పుడు అగస్త్యునికి శివుడు సాక్షాత్కరించి, అగస్త్య నీవు పూజ ప్రారంభించే ముందు గణపతిని పూజించలేదు అందుకే ఆయనకి కోపం వచ్చి ఇలా జరిగింది చింతించకు నీ తప్పదు రాబోయే తరాలకు వరంగా మారింది. అంకోల వృక్షం క్రింద సైకత లింగాలతో కలసి స్వయంభువుగా వెలసిన గణపతి కలియుగంలో భక్తుల కోరిక తిరిస్తూ ఉంటాడని చెప్పడంతో అగస్త్యముని సంతోషించి తన తప్పు తెలుసుకొని అక్కడే మరొక లింగాన్ని ప్రతిష్టించాడని పురాణం.
ఈవిధంగా వెలసిన ఆ స్వామివారు కొన్ని వందల సంవత్సరాల నుండి ఎండలో, వానలో ఉన్నపటికీ స్వామివారి రూపంలో ఎలాంటి మార్పు అనేది రాకపోవడం ఒక విశేషం. ఇక్కడ ఉన్న అంకోల వృక్షం వయసు రెండు వేల ఐదు వందల సంవత్సరాలుగా చెబుతారు. ఇలా వెలసిన ఈ స్వామివారిని దర్శిస్తే కోరిన కోరికలు త్వరగా నెరవేరుతాయని భక్తుల విశ్వాసం.